Mukul Roy : టీఎంసీ కీలక నేత ముకుల్ రాయ్ ఆచూకీ తెలిసింది
ABN , First Publish Date - 2023-04-18T13:00:10+05:30 IST
పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీ కీలక నేత ముకుల్ రాయ్ (Mukul Roy) కనిపించడం లేదని ఆయన కుమారుడు
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీ కీలక నేత ముకుల్ రాయ్ (Mukul Roy) కనిపించడం లేదని ఆయన కుమారుడు సుభ్రాంశు రాయ్ వెల్లడించిన కొద్ది గంటల్లోనే ముకుల్ ఢిల్లీ విమానాశ్రయంలో కనిపించారు. ఆయనకు ఢిల్లీ విమానాశ్రయంలో స్వాగతం పలికేందుకు ఓ వ్యక్తి వచ్చినట్లు తెలుస్తోంది. వీరిరువురూ మాట్లాడుకుంటుండగా ఓ పాత్రికేయుడు చిత్రీకరించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియో యథార్థత గురించి స్పష్టంగా తెలియడం లేదు.
దీనిపై సుభ్రాంశు రాయ్ (Subhranshu Roy) స్పందిస్తూ, తన తండ్రి అనారోగ్యాన్ని తమకు అనుకూలంగా మలచుకుని, చిల్లర రాజకీయాలు చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఓ పాత్రికేయుడు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వీడియోలో, ఢిల్లీ విమానాశ్రయంలో ముకుల్ రాయ్‌కి ఓ వ్యక్తి స్వాగతం పలుకుతున్నట్లు కనిపించింది. ముకుల్ తెలుపు రంగు కుర్తా, పైజమా ధరించినట్లు కనిపించింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం, విమానాశ్రయంలో ముకుల్ రాయ్ మాట్లాడుతూ తాను తరచూ ఢిల్లీకి వస్తూ ఉంటానని, ఈసారి కూడా కొంచెం పని ఉందని, అందుకే వచ్చానని చెప్పారు. తాను మెడికల్ చెక్అప్ కోసం ఇక్కడికి రాలేదన్నారు. తన రాకకు ప్రత్యేకంగా రాజకీయ కారణాలేవీ లేవన్నారు. ప్రత్యేకంగా ఓ పని మీద ఇక్కడికి వచ్చానన్నారు. ‘‘నేను ఢిల్లీ రాకూడదా? నేను ఎమ్మెల్యేని, గతంలో ఎంపీగా చేశాను’’ అన్నారు.
సుభ్రాంశు సోమవారం మాట్లాడుతూ తన తండ్రి ముకుల్ రాయ్ కనిపించడం లేదని, ఆయనను ఫోన్ ద్వారా కూడా సంప్రదించలేకపోతున్నానని చెప్పారు. ఆయన పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.
ముకుల్ రాయ్ టీఎంసీ నుంచి బీజేపీలో చేరారు. ఆ తర్వాత 2021లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో టీఎంసీ విజయం సాధించడంతో మళ్లీ టీఎంసీలోకి వెళ్లిపోయారు.
ఇవి కూడా చదవండి :
Supreme Court : అతిక్-అష్రఫ్ హత్యలపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం
Ajit Pawar: ఎన్సీపీకి అజిత్ పవార్ బిగ్ షాక్...30మంది ఎమ్మెల్యేలతో బీజేపీ తీర్థం?