Nipah Virus: అసలు నిపా వైరస్ ఏమిటి? తొలి కేసు ఎక్కడ నమోదైంది? దీనికి చికిత్స ఏంటి?
ABN , First Publish Date - 2023-09-14T16:38:00+05:30 IST
ఇంకా కరోనా వైరస్ పూర్తిగా అంతం అవ్వలేదు. కానీ.. మునుపటి కన్నా దాని ప్రభావం బాగా తగ్గిపోవడంతో, ఆ వైరస్‌తోనే కలిసి జనాలు సహజీవనం చేయడం అలవాటు చేసుకున్నారు. ఇప్పుడిప్పుడే..
ఇంకా కరోనా వైరస్ పూర్తిగా అంతం అవ్వలేదు. కానీ.. మునుపటి కన్నా దాని ప్రభావం బాగా తగ్గిపోవడంతో, ఆ వైరస్‌తోనే కలిసి జనాలు సహజీవనం చేయడం అలవాటు చేసుకున్నారు. ఇప్పుడిప్పుడే దాన్నుంచి కోలుకుంటూ, స్వేచ్ఛగా గాలి తీసుకోవడం ప్రారంభించారు. ఇక ఏ సమస్యలూ లేవని ఆనందిస్తుండగా.. ఇంతలోనే మరో ప్రాణాంతకరమైన వైరస్ కోరలు చాచింది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. అదే నిపా వైరస్. ఇది ఇంకా దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందలేదు కానీ.. కేరళ రాష్ట్రంలో మాత్రం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో.. అధికారులు అక్కడ వారం రోజుల పాటు ప్రభుత్వ ఆఫీసులతో పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
అసలు ఈ నిపా వైరస్ ఏమిటి? తొలిసారి ఎక్కడ కనుగొనబడింది? నివేదిక ప్రకారం.. 1998లో మలేషియా, సింగపూర్‌లలోని పందుల పెంపకందారులలో ఈ నిపా వైరస్‌ను తొలిసారిగా గుర్తించారు. ఇది పందులు, గబ్బిలాల శారీరక ద్రవాలతోనూ నేరుగా మానవులకు సోకుతుందని కొన్ని డాక్యుమెంట్ కేసులతో నిర్ధారితమైంది. బహుశా ఈ నిపా వైరస్ వెయ్యి సంవత్సరాల నుంచే గబ్బిలాల మధ్య ఉండొచ్చని.. ఇప్పుడు అది పరివర్తన చెంది, వ్యాప్తి చెందే జాతిగా ఉద్భవిస్తోందని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. 1998లో ఈ నిపా వైరస్ కారణంగా మలేషియా, సింగపూర్‌లలో 100 మందికి పైగా మరణించగా, 300 మంది దీని బారిన పడ్డారు. ఇక అప్పటి నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందుతూ వచ్చింది.
ఈ నిపా వైరస్ సోకిన వారిలో.. 72% నుంచి 86% శాతం వరకు మరణించినట్టు రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయి. 1998 నుంచి 2015 మధ్య కాలంలో 600కి పైగా నిపా వైరస్ కేసులు నమోదైనట్టు WHO డేటా చూపిస్తోంది. 2001లోనే ఈ వైరస్ భారత్‌లోకి ప్రవేశించింది. అనంతరం బంగ్లాదేశ్‌లోనూ పంజా విసిరిన ఈ నిపా వైరస్.. 62 మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఆ తర్వాత ఈ వైరస్ ప్రభావం తగ్గడంతో, ఇది అంతం అయ్యిందని అనుకున్నారు. కానీ.. ఈ మహమ్మారి 2018లోనూ దాడి చేసి, 21 మంది చావుకి కారణమైంది. 2019, 2021లోనూ ఈ నిపా మహమ్మారి కొరడా ఝుళపించింది. ఇప్పుడు మళ్లీ ఇది కేరళలో కలకలం సృష్టిస్తోంది.
అయితే.. ఈ నిపా వైరస్ సంక్రమణను నివారించడానికి గానీ, వ్యాధిని నయం చేయడానికి గానీ ఎలాంటి వ్యాక్సిన్‌లు లేవు. అందుకే.. మరణాల రేటు 70% వరకు ఉంటోంది. ఈ వ్యాధి సోకిన వెంటనే.. తక్షణమే సాధారణ ట్రీట్‌మెంట్ అందించడం ఉత్తమం. ఈ నిపా వైరస్ సోకిన వ్యక్తుల్లో మొదటగా.. జ్వరం, శ్వాసకోశ బాధ, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు వస్తాయి. తీవ్రమైన సందర్భాల్లో ఎన్సెఫాలిటిస్, మూర్ఛలు కూడా సంభవించవచ్చు. అప్పుడది కోమాకు దారితీస్తుంది. ప్రస్తుతం ఈ వైరస్ తమ పరిశోధన శాలలో ఉందని, దీన్ని పరిశీలించి వ్యాధి నివారణ మార్గాలు కనుగొంటున్నామని WHO పేర్కొంది.