OHRK BY JC Prabhakar Reddy: రాజారెడ్డినే లెక్కచేయలేదు.. జగనెంత?
ABN, First Publish Date - 2023-07-31T03:22:43+05:30
తాడిపత్రి(Tadipatri) ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి( MLA Ketireddy Peddareddy) తాను లేని సమయంలో ఇంటికి వచ్చి కూర్చున్న సంఘటన తర్వాత ఉరేసుకుని చద్దామనుకున్నానని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ సోదరుల్లో ఒకరైన ప్రభాకర్‌రెడ్డి (Prabhakar Reddy) వ్యాఖ్యానించారు.
భయపెడితే లొంగేది లేదు.. ప్రేమతోనైతే ఎందాకైనా వెళ్తాం
నా బస్సులు, లారీలు అన్నీ లాగేశాడు.. ఇంక పీకేదేముంది?
ఏదైనా పీక్కోమనే ఇలా గడ్డం పెంచుతున్నా
జగన్ మళ్లీ గెలిచినా శరణు కోరను
క్లీనర్ పనయినా చేసుకుంటా.. సరెండరయ్యే ప్రసక్తే లేదు
పెద్దారెడ్డి నా ఇంటికి వచ్చాక ఉరేసుకుందామనుకున్నా
అప్పుడు కార్యకర్తలు నా వెంట నిలబడ్డారు
ఆ తర్వాత ఆయన కొడుకు ప్రాణాలను నేనే కాపాడా
నీ పాడె మోస్తానని ఎమ్మెల్యేకే చెప్పా.. 2024లో టీడీపీ పక్కా
‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో జేసీ ప్రభాకర్‌రెడ్డి అంతరంగం
తాడిపత్రి(Tadipatri) ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి( MLA Ketireddy Peddareddy) తాను లేని సమయంలో ఇంటికి వచ్చి కూర్చున్న సంఘటన తర్వాత ఉరేసుకుని చద్దామనుకున్నానని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ సోదరుల్లో ఒకరైన ప్రభాకర్‌రెడ్డి (Prabhakar Reddy) వ్యాఖ్యానించారు. ఆ తర్వాతే తినడానికింత ఉంటే చాలనే భావన తనలో పెరిగిందన్నారు. ఇప్పుడే ఎంతో ప్రశాంతంగా ఉన్నానని, ఇకపై ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. రాజారెడ్డి చెప్పిందే చెల్లాలనడాన్ని జీర్ణించుకోలేకనే ఎదురుతిరిగి నిలబడ్డామని పేర్కొన్నారు. ఈ నాలుగేళ్లలో తననుంచి అన్నీ లాగేసుకున్న జగన్(JAGAN)... ఇక పీకేదేమీ లేదన్నారు. ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించే ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’(Open Heart with RK)లో ప్రభాకర్‌రెడ్డి ఎన్నో విషయాలు పంచుకున్నారు. విశేషాలివీ..
ఆర్కే: ఈ గెటప్ చూస్తుంటే సర్దార్‌జీలా ఉన్నారు?
జేసీ ప్రభాకర్‌రెడ్డి : సర్దార్‌జీ కాదు యోగి అయిపోదామనుకుంటున్నా.
ఆర్కే:ఎందుకంత వైరాగ్యం వచ్చింది? తట్టుకోలేకపోతున్నారా?
జేసీ ప్రభాకర్‌రెడ్డి : ఆయనేమో(జగన్) బస్సులు, లారీలు అన్నీ లాగేశాడు. నా వెంట్రుక కూడా పీకలేడని జగన్ అంటుంటాడు కదా! అప్పుడు నాకూ అనిపించింది. మనది కూడా ఏం పీకలేడు కదా అని. అందుకే గడ్డం పెంచేశాను. మొన్న నేను గుడికి పోతే కొందరు వచ్చి నాకు మొక్కుతున్నారు. అమ్మా నేను మీ ప్రభాకర్‌రెడ్డినని చెప్పుకోవలసి వచ్చింది. ఇలా మారిన తర్వాత నాకు చాలా బాగుందనిపించింది. నాకు షుగర్, బీపీ ఉన్నాయి.. కానీ ఈ నాలుగేళ్లలో నో బీపీ, నో షుగర్. సంతోషంగా ఉన్నా. మొన్న శ్రీశైలం వెళ్లి వచ్చి నా భార్యతో.. ‘నువ్వు కొడుకు దగ్గరకు వెళ్లిపో.. నేను ఎటైనా పోతా’నని అంటే ‘నేనూ నీతో వస్తా.. జోలె పట్టుకున్నా నీ వెంటే’ అన్నది.
ఆర్కే: ఈ నాలుగేళ్లలో ఎందుకింత మార్పు?
జేసీ ప్రభాకర్‌రెడ్డి : ఒక విధంగా పెద్దారెడ్డి కారణం. నేను లేని సమయంలో ఇంటికి వచ్చి పోయాడు చూడండి.. నా దగ్గర డబ్బులున్నా అవి పనిచేయలే. ఏమిటి నా పరిస్థితి అనిపించింది. ఆ రోజు ఇంటికి వెళ్లే సమయానికి నాకున్న ఆలోచన ఒకటే.. ఉరి వేసుకోవాలని అనిపించింది. లేదా ఊరొదిలి పారిపోవాలి.. లేదా కప్పం కట్టి వాడికి లొంగిపోయి బతకాలి. కానీ ఇంటికి వెళ్లే సమయానికి కార్యకర్తలు వచ్చారు. చివరకు పెద్దారెడ్డి కొడుకే చచ్చిపోయేవాడు. వాడిని నేనే రక్షించి పంపాను. ఆ తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది. ఏదో ఇంత అన్నం తింటే చాలనే పరిస్థితికి వచ్చా. అలాగని ఎవరికీ సరెండరయ్యే పరిస్థితి లేదు.
ఆర్కే: మీ రెండు కుటుంబాల మధ్య వైరం ఎందుకు?
జేసీ ప్రభాకర్‌రెడ్డి : దీనికి మూల కారణం రాజారెడ్డి. ఆయన పక్క నియోజకవర్గమే మాది. రాజారెడ్డిని లెక్కచేసేవాళ్లం కాదు. ఆయన ఏదనుకుంటే అది జరగాలనుకుంటారు. ఆయన అలా లేకుంటే అంత కిరాతకంగా హత్య చేయరు కదా! ఫ్యాక్షనిస్టు ఎప్పటికైనా పోస్టుమార్టం అవుతాడన్నది ఎప్పటికైనా నిజం.
ఆర్కే: మీది స్వతహాగా తెలంగాణ కదా! తెలంగాణలో వాళ్లకు ఈ ఫ్యాక్షనిజం లక్షణాలు ఉండవుగా!
జేసీ ప్రభాకర్‌రెడ్డి : అవును. గద్వాల ప్రాంతంలో జూటూరు అనేది మా ఊరు. 370 ఏళ్ల నాటి సంగతి ఇది. ఆ ఊరి పేరే మా ఇంటి పేరు. ఇప్పుడే చరిత్ర మొత్తం తీశాను. మేము తినడానికి లేక ఫ్యాక్షన్ చేశాం. మా ప్రాంతంలో ఐదేళ్లకోసారి వర్షం పడేది. దాంతో మా గుంపును నడపాలి.
ఆర్కే: దివాకర్‌రెడ్డి మీ కుటుంబానికి పెద్ద కదా.. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ఉన్నారు?
జేసీ ప్రభాకర్‌రెడ్డి : ఆయనకు రెండు స్టంట్స్ వేశారు. అందువల్ల కొంత సైలెంట్‌గా ఉన్నారు. రాజారెడ్డితో యుద్ధం చేసిన మీరు.. వైఎస్ సీఎం
ఆర్కే: అయ్యేనాటికి సయోధ్య ఏర్పరచుకున్నారా?
జేసీ ప్రభాకర్‌రెడ్డి : మమ్మల్ని అణగదొక్కాలని రాజశేఖర్‌రెడ్డికి ఉండేది. మొదటిసారి అన్నకు మంత్రి పదవి ఇచ్చి.. ఆ తర్వాత ఇవ్వలేదు. ఆయన జెరూసలెం పోయినప్పుడు కేవీపీ నన్ను పిలిచి.. నువ్వు వైఎ్‌సని తిట్టినావట.. అందుకోసమే మీ అన్నకు మంత్రి పదవి ఇవ్వలేదని అన్నారు. నేను తిట్టానో లేదో నాకు తెలియదు గానీ.. ఇదెక్కడా చెప్పుకోకండి.. మీ మర్యాదే పోతుందని అన్నాను. దాంతో జెరూసలెం నుంచి వచ్చాక మీ అన్నను మంత్రిమండలిలోకి తీసుకుంటారని కేవీపీ చెప్పారు.
ఆర్కే: మీకు ఎందుకింత ఆవేశమని మీ భార్య అనలేదా?
జేసీ ప్రభాకర్‌రెడ్డి : చాలా ధైర్యవంతురాలు. బకెట్లు(బాంబులు) తెచ్చి ఇవ్వమన్నా ఇస్తుంది. ఆమే నన్ను ఇలా ధైర్యంగా మార్చిందేమో అనిపిస్తుంది.
ఆర్కే: జగన్ పార్టీ పెట్టాక చాలాసార్లు పిలుపులొచ్చినా ఎందుకు వెళ్లలేదు?
జేసీ ప్రభాకర్‌రెడ్డి : ఒక రోజు కుటుంబం మొత్తం జూబ్లీహిల్స్ క్లబ్‌లో ఏదో ఫంక్షన్‌లో ఉంటే మా అన్న ఇంటికి రమ్మని ఫోన్ చేశారు. ఎందుకని అడిగితే విజయసాయిరెడ్డి వస్తున్నారని చెప్పారు. ఇంటికి వెళ్లాక నోరెత్తకూడదు.. నోరెత్తకూడదని అనుకుంటూనే వచ్చాను. అయితే అక్కడ అంతా మాట్లాడిన తర్వాత.. ఎంత ఖర్చు పెట్టగలరని విజయసాయి ఒక మాట అన్నారు. దాంతో మా అన్నకు తీవ్రమైన కోపం వచ్చేసింది. ఆయనపై చెడామడా అరిచేశారు. నేను మనసులో హ్యాపీ ఫీలయ్యాను.
ఆర్కే: ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టుకోమన్నాడా? సీటుకు డబ్బులు ఇవ్వమన్నాడా?
జేసీ ప్రభాకర్‌రెడ్డి : డబ్బులు ఖర్చు పెట్టి, ఎంత ఇవ్వగలరన్నట్లు మాట్లాడారు. దాంతో అన్నకు కోపం వచ్చేసింది. కమాండ్ చేస్తే ఎవడికీ లొంగేది లేదు. ప్రేమతో అడిగితే ఎక్కడిదాకా అయినా పోతాం.
ఆర్కే: మిమ్మల్ని కూసాలు కదిలినట్లు కొట్టాడు కదా జగన్?
జేసీ ప్రభాకర్‌రెడ్డి : అదేం లేదు. ఏం కొట్టాడు. ఇది(వెంట్రుక) పీక్కోమను. వ్యాపారాలు పోయినయి.. నా భార్య కోసం క్లీనర్ పని అయినా చేస్తా. ఎందుకు భయపడాలి?
ఆర్కే: దివాకర్ కుమారుడు పవన్‌కు జగన్ మంచి ఫ్రెండ్ కదా..రాజీ కుదరలేదా?
జేసీ ప్రభాకర్‌రెడ్డి : నేను ఒప్పుకోను కదా!
ఆర్కే: మీ అబ్బాయి ఓటమి వెనుక ప్రబోధానంద ఆశ్రమం
విషయంలో భక్తుల మనసు కష్టపెట్టడమే కారణమని చెబుతారు?
జేసీ ప్రభాకర్‌రెడ్డి : అదేం లేదు. నిజానికి ప్రబోధానంద నాకు చాలా సన్నిహితం. ఆయన అనంతపురంలో హత్యలు చేసి వస్తే అది నాకు నచ్చక వదిలేశా. ఈ విషయాలన్నీ ఆయన కొడుకే ఇప్పుడు చెబుతున్నాడు కదా!
ఆర్కే: మీరు స్థానిక అధికారులతో గొడవ పడుతుంటారు ఎందుకు?
జేసీ ప్రభాకర్‌రెడ్డి : నేను లా ఒబీడియంట్! వాళ్లు చట్టానికి లోబడి ఉండకపోతే వారితో నాకు గొడవ రాకుండా ఎందుకు ఉంటుంది? నాపై 74 కేసులున్నాయి. బస్సులు సీజ్ చేశారు. స్వాతంత్ర్యానికి పూర్వమే మాకు బస్సులున్నాయి. వాటిని కూడా సీజ్ చేశారు. ఇది తప్పు కదా! నాకు 32 రూట్ బస్సులుంటే వాటిని మొత్తం సీజ్ చేశారు. అందరిపైనా కేసులు పెట్టాను.. గెలిచాను. ఆ అధికారులు నాకు ఇప్పుడు పరిహారం కట్టాలి.
ఆర్కే: మీ ప్రత్యర్థి పెద్దారెడ్డి వయసెంత?
జేసీ ప్రభాకర్‌రెడ్డి : 53 అనుకుంటా. కానీ ముందు వాడే పోతాడు.
ఆర్కే: ఏంటి.. వేసేస్తారా?
జేసీ ప్రభాకర్‌రెడ్డి : ఆయన ఆరోగ్యం అలాంటిది. ఎప్పుడోసారి పుసుక్కున పోతావు. నేనే నీ పాడె మోస్తానని చెప్పాను.
ఆర్కే: వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా?
జేసీ ప్రభాకర్‌రెడ్డి : లేదు. నా కుమారుడే పోటీ చేస్తాడు. పవన్ ఎంపీగా ఇస్తే చేస్తాడు. చంద్రబాబును ఒక్కటే అడుగుతున్నా.. నాయకులెవరూ బయటకు రావడం లేదు. ఎంతో కొంత మాట్లాడుతున్న నన్ను ఎందుకు జిల్లా మొత్తం తిప్పకూడదు?
ఆర్కే: 2024లో టీడీపీ వస్తుంది.. మంచి రోజులు వస్తాయని ఉందా?
జేసీ ప్రభాకర్‌రెడ్డి : కచ్చితంగా గెలుస్తుంది. బాగుంటుంది.
ఆర్కే: ఒకవేళ జగన్ మళ్లీ సీఎం అయితే ఆయన శరణు కోరతారా?
జేసీ ప్రభాకర్‌రెడ్డి : ఏం లేదు. క్లీనర్ పని అయినా చేసుకుంటా. నా అనుభవంతో ఏ వర్క్‌షా్‌పలోకి పోయినా కూర్చోబెడతారు. ఏదో గేటు దగ్గర కాపలా అయినా కాస్తా. ఆర్థిక మూలాలను దెబ్బతీస్తే లొంగుతారనుకున్నాడు. నేను పోరా అన్నాను.
ఆర్కే: టీడీపీ అధికారంలోకి వచ్చి మీ అబ్బాయి ఎమ్మెల్యే అయితే పెద్దారెడ్డిని క్షమించి వదిలేస్తారా?
జేసీ ప్రభాకర్‌రెడ్డి : వదిలేస్తాను. ఏమీ చేయను. మా ఊరిలోనే పంచె విప్పి కొడతారు. ఆయనే అలా చేసుకుంటున్నాడు.
ఆర్కే: రాగద్వేషాలకూ ప్రభాకర్‌రెడ్డి అతీతమా?
జేసీ ప్రభాకర్‌రెడ్డి : ఈ నాలుగేళ్లలో వాడి మానాన వాడు పోతాడులే అనే తీరుకు వచ్చేశా. మనమైతే ఎవరి జోలికి పోం. మన జోలికి ఎవరైనా వస్తే ఊరుకోం. అప్పుడు కూడా శాంతంగా ఉంటే వాడు గొడ్డలి తీస్తాడు. వివేకాను కొట్టినట్లు కొడతాడు.
ఆర్కే: ఇప్పుడు మీరు కోరుకునేది ఏదీ లేదు..?
జేసీ ప్రభాకర్‌రెడ్డి : ఇప్పుడు ఇంటిలో చాలా మౌనంగా, ప్రశాంతంగా ఉంటున్నా. నా చివరి వరకూ ప్రజలకు సేవ చేస్తూ మానవతావాదిగా ఉండాలని అనుకుంటున్నా.
Updated Date - 2023-10-06T17:23:06+05:30 IST