BJP గెలిచే నియోజకవర్గాల్లో గ్రాఫ్ పడిపోతుందా? నేతల మధ్య విభేదాలతో పార్టీ దిగజారుతోందా..?
ABN, First Publish Date - 2023-02-14T09:08:09+05:30
తెలంగాణలో అధికారం ఖాయమని బీజేపీ అధిష్టానం భారీగా ప్రకటనలు చేస్తోంది. కానీ.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా..
ఆదిలాబాద్ జిల్లా బీజేపీలో కలహాలు ముదిరి పాకాన పడుతున్నాయా?.. నేతల మధ్య విభేదాలతో పార్టీ పరిస్థితులు దిగజారుతున్నాయా?.. అంతర్గత వైరంతో నేతలు అభాసుపాలవుతున్నారా?.. ఆధిపత్య పోరుతో బజారున పడేలా చేస్తున్నారా?.. ఇంతకీ.. ఆదిలాబాద్ బీజేపీలో ఏం జరుగుతోంది?.. పార్టీ పరువును బజారున పడేస్తున్న నేతలెవరు?.. అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం..
ఎవరికి వారే యమునా తీరే..
తెలంగాణలో అధికారం ఖాయమని బీజేపీ అధిష్టానం భారీగా ప్రకటనలు చేస్తోంది. కానీ.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉంటున్నాయి. పట్టున్న నియోజకవర్గాలోనూ బీజేపీ గ్రాఫ్ పడిపోతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీకి వర్గపోరు మైనస్‌గా మారుతోంది. కమలనాథులు.. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఆదిలాబాద్, ఖానాపూర్, బోథ్, నిర్మల్, ముథోల్, ఆసిఫాబాద్, సిర్పూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు నియోజకవర్గాల్లో వర్గపోరు భగ్గుమంటోంది. నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో అమిత్‌షా ఆదిలాబాద్ జిల్లా పర్యటనను లాస్ట్ మినిట్‌లో రద్దు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన రామారావుపాటిల్
ఇదిలావుంటే.. ముథోల్‌లో బీజేపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు రమాదేవి, కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన రామారావుపాటిల్, మోహన్‌రావు పాటిల్ టికెట్ రేసులో ఉన్నారు. టికెట్ హామీతోనే జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రామారావు పాటిల్ రాజీనామా చేసి కాషాయ కండువా కప్పుకున్నట్టు ప్రచారం జరుగుతుండడంతో ఇతర ఆశావాహులు జీర్ణించుకోలేక తున్నారు. అటు.. నిర్మల్‌లోనూ అదే పరిస్థితి నెలకొంది. పైకి బాగానే ఉన్నా.. మున్సిపల్ మాజీ చైర్మన్ అప్పాల గణేష్, సీనియర్ నేత డాక్టర్ మల్లిఖార్జునరెడ్డి టికెట్ రేసులో ఉన్నారు. దాంతో.. ఎవరికి వారు అధిష్టానం మెప్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. అక్కడి ప్రత్యేక పరిస్థితి దృష్ట్యా మరింత బలమైన నేత కోసం బీజేపీ అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది. దానికి తగ్గట్టే.. బీఆర్ఎస్ సీనియర్ నేత సత్యనారాయణగౌడ్‌తో బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భేటీ కావడంపై రకరకాల చర్చలు కొనసాగుతున్నాయి.
ఎవరికి వారే గ్రూపులు మెయింటేన్
మరోవైపు... ఖానాపూర్ నియోజకవర్గంలో మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, జడ్పీటీసీ జానుబాయి టికెట్ రేసులో ఉన్నారు. టికెట్‌పై ధీమాతోనే రమేష్ రాథోడ్ ఖానాపూర్‌లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే.. ఆయనకంటే ముందే బీజేపీలో చేరిన జానుబాయి కూడా పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారితోపాటు.. మరో ఇద్దరు, ముగ్గురు నేతలు కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఈ క్రమంలో.. ఎవరికి వారే గ్రూపులు మెయింటేన్ చేస్తుండడం వర్గపోరుకు దారితీస్తోంది. బోథ్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి ఉంది. సిర్పూర్ నియోజకవర్గంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, సీనియర్ నేత పాల్వాయి హరీశ్‌బాబు మధ్య టికెట్ ఫైట్ నడుస్తోంది. అయితే.. అధిష్టానం మాత్రం హరీశ్‌బాబు వైపు మొగ్గు చూపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక.. మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల్లో బీజేపీ పరిస్థితి దయనీయంగా ఉందని చెప్పొచ్చు. వర్గపోరుతో క్యాడర్‌లో నిరాశ నిస్పృహలు కనిపిస్తున్నాయి. అంతేకాదు.. మూడు నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు మూడో స్థానంలో ఉంటారని ఆ పార్టీ నేతలే ప్రచారం చేస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
బీజేపీ నేతలు సొంత ఏజెండాతోనే జనాల్లోకి
ఇక.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మెజారిటీ బీజేపీ నేతలు సొంత ఏజెండాతోనే జనాల్లోకి వెళ్తున్నారు. ఎవరికి వారే టికెట్‌పై ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ.. అధిష్ఠానం ఇప్పటివరకు టికెట్‌పై ఎవరికీ స్పష్టత ఇవ్వకపోవడంతో లోలోన మాత్రం భయమే కనిపిస్తోంది. టికెట్‌పై.. కొంత అభద్రతతోనే కనిపిస్తున్న నేతలు.. ఎవరికీ చెప్పుకోలేక పోతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. పైకి బాగానే కనిపిస్తున్నా.. లోలోన మాత్రం ఒకరిపై ఒకరు రగిలిపోతున్నారు. ఆయా నేతల వ్యవహారం.. అధిష్టానం పెద్దల దృష్టికి వెళ్లడంతో పలువురికి వార్నింగ్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా... ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో బీజేపీ పరిస్థితి మెరుగ్గానే ఉన్నా.. నేతల మధ్య వర్గాలతోనే కిందిస్థాయి నేతలు, కార్యకర్తలు డీలా పడిపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో.. ఆదిలాబాద్ జిల్లా కమలనాథుల కలహాల విషయంలో అధిష్టానం ఎలాంటి చర్చలు తీసుకుంటుందో చూడాలి.
Updated Date - 2023-02-14T09:08:12+05:30 IST