BRS ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై తిరగబడ్డ కూతురు.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
ABN , First Publish Date - 2023-05-08T23:07:26+05:30 IST
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా పేరుగాంచిన జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. అయితే ఈసారి ఆయన సొంత కుమార్తే.. తిరగబడటం పెద్ద చర్చనీయాంశమే అయ్యింది. ..
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా పేరుగాంచిన జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి (Muthireddy Yadagiri Reddy) తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. అయితే ఈసారి ఆయన సొంత కుమార్తే.. తిరగబడటం పెద్ద చర్చనీయాంశమే అయ్యింది. అక్కడితో ఆగలేదు.. తండ్రీ-కుమార్తె పంచాయితీ పోలీస్ స్టేషన్ దాకా వెళ్లడంతో రచ్చ రచ్చగా మారింది. పూర్తి వివరాల్లోకెళితే.. సిద్దిపేట జిల్లా చేర్యాలలోతనకు సంబంధించిన ఎకరం 20 గుంటల భూమిని ముత్తిరెడ్డి ఆక్రమించుకున్నారని తుల్జాభవాని రెడ్డి (Tulja Bhavani Reddy) ఆరోపిస్తున్నారు. తన సంతకం ఫోర్జరీ చేసి భూమి తీసుకున్నారని తండ్రిపైనే ఆమె సంచలన ఆరోపణలు చేయడం గమనార్హం. ఇదే విషయంపై ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ముత్తిరెడ్డిపై కుమార్తె ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
కాగా.. గతంలో ఈ భూమిపై తీవ్ర వివాదమే చోటుచేసుకుంది. చెరువు భూమిని ఎమ్మెల్యే కబ్జా చేశాడంటూ విపక్షాల ఆరోపిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. ఇప్పుడు అదే భూ మి గురించి కూతురు ఫిర్యాదు చేయడంతో మరోసారి ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. దీనిపై ఇంతవరకూ ఉప్పల్ పోలీసులు మాత్రం స్పందించలేదు. అయితే.. ఇలా వివాదాలు రావడం వెనుక ఏమైనా కుటుంబ కక్షలున్నాయా..? లేకుంటే రాజకీయపరంగా బేధాభిప్రాయాలు వచ్చాయా..? అనేది తెలియాల్సి ఉంది.
గతంలోనూ పలుమార్లు భూములు ఆక్రమించారని పెద్ద ఎత్తునే ఆరోపణలు వచ్చాయి. ఈయనకు ‘కబ్జారెడ్డి’ అని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పేరు కూడా పెట్టారు. ఆ మధ్య ఓ వివాదాస్పద 6 ఎకరాల స్థలంలో మున్సిపల్ నాలాకు అడ్డంగా వెంచర్ వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీన్ని మాజీ సర్పంచి అడ్డుకోగా ముత్తిరెడ్డి నానా రచ్చే చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు.. మత్తడి సమీపంలో ముత్తిరెడ్డి యాదగిరి అర ఎకరం స్థలాన్ని ఆక్రమించారని స్థానిక విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. మత్తడి నుంచి నిర్మించే కాలువ విషయంలోనూ డిజైన్ మార్చారని కూడా వార్తలు వచ్చాయి. అయితే తాను గుంట కబ్జా చేసినట్లు నిరూపించినా రాజీనామా చేస్తామని అప్పట్లో సవాల్ చేశారు. ఇప్పుడు సొంత ఇంటి నుంచే ఫిర్యాదు పోవడంతో పాత విషయాలన్నీ బయటికొస్తున్నాయి.