Share News

ఈ విషయాలు తెలిస్తే.. రాజకీయాలకు దండం పెట్టేస్తారు..

ABN , Publish Date - Mar 25 , 2025 | 04:27 PM

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా స్టార్లు కూడా కొత్తగా పార్టీ పెట్టడానికి సిద్ధం అవుతున్నారు. దేశంలో వారానికో కొత్త పార్టీ పుట్టుకు వస్తోంది. ప్రతీ వీధిలో ఓ పార్టీ వెలుస్తోంది.

ఈ విషయాలు తెలిస్తే.. రాజకీయాలకు దండం పెట్టేస్తారు..
Politics

భారతదేశంలో పేదవాడి దగ్గరినుంచి లక్షల కోట్లు కలిగిన ధనవంతుడి వరకు అందరి జీవితాలను ప్రభావితం చేయగలిగే శక్తి ఒక్క రాజకీయాలకు మాత్రమే ఉంది. రాజకీయ నాయకులు తలుచుకుంటే.. ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అయిపోతాయి. అందుకే సినిమాల్లో స్టార్లుగా ఎదిగి.. వందల కోట్లు సంపాదిస్తున్న వాళ్లు కూడా రాజకీయాల్లోకి వస్తూ ఉన్నారు. కేవలం సినిమా వాళ్లే కాదు.. ప్రజల్లో కొద్దిగా పాపులారిటీ ఉన్నా చాలు కొత్త పార్టీ పెట్టేస్తున్నారు. దేశ వ్యాప్తంగా వారానికో కొత్త పార్టీ పుట్టుకు వస్తోంది. వీధికో రాజకీయ పార్టీ వెలుస్తోంది. వాటిలో కొన్ని ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తుంటే.. మరికొన్ని డిపాజిట్లు కూడా రాకుండా ఉనికిని కోల్పోతున్నాయి. మరి, ఎవరు పడితే వాళ్లు కొత్త పార్టీ పెట్టేస్తున్నారు కదా.. కొత్త పార్టీ పెట్టడం అంత సులభమా?.. కొత్తగా పార్టీ పెట్టాలంటే ఎలాంటి నిబంధనలు పాటించాలి?.. ఎంత ఖర్చు అవుతుంది?.. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..


రాజకీయ పార్టీ పెట్టడానికి నిబంధనలు

భారతదేశంలో ఎవరైనా సరే కొత్తగా పార్టీ పెట్టాలనుకుంటే ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలను తప్పకుండా పాటించాలి. పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ప్రాసెస్ మొత్తం రాజ్యాంగంలోని ఆర్టిక్ 324, రెప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ 1951లోని సెక్షన్ 29 ఏ ప్రకారం జరుగుతుంది.

ఆర్జీ సమర్పణ

కొత్తగా పార్టీ స్థాపించిన 30 రోజుల్లోగా ఎన్నికల సంఘానికి అర్జీ పెట్టాల్సి ఉంటుంది. పార్టీ లెటర్ హెడ్‌పై అర్జీని టైప్ చేసి పోస్టు ద్వారా ఎన్నికల సంఘానికి పంపొచ్చు.. లేదా నేరుగా ఎన్నికల సంఘం సెక్రటరీ దగ్గరకు వెళ్లి ఇవ్వొచ్చు. కొత్తగా పెట్టిన పార్టీలో 100 మంది గుర్తింపు కలిగిన ఓటర్లు సభ్యులుగా ఉండాలి. వీరికి సంబంధించిన ఎలక్టోరల్ వివరాలు ఎన్నికల సంఘానికి సమర్పించాలి. దీనితో పాటు పార్టీకి సంబంధించిన మెమోరాండం, నియమ నిబంధనలు లేదా రాజ్యాంగాన్ని కూడా సమర్పించాల్సి ఉంటుంది. భారత రాజ్యాంగం పట్ల నమ్మకం, సోషలిజం, లౌకికవాదం, ప్రజాస్వామ్యం, దేశ సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతను కాపాడతామని అందులో స్పష్టంగా పేర్కొనాలి.


అఫిడవిట్‌లు.. పబ్లిక్ నోటీస్..

పార్టీ అధ్యక్షుడు లేదా ప్రధాన కార్యదర్శి ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ లేదా నోటరీ దగ్గరకు వెళ్లి అఫిడవిట్ సమర్పించాలి. తమ పార్టీలో ఉన్న 100 మంది సభ్యులు వేరే ఏ పార్టీలోనూ లేరని నిర్ధారించాలి. దీంతో పాటు 100 మంది సభ్యుల నుంచి వ్యక్తిగత అఫిడవిట్‌లు తీసుకోవాలి. ఇదంతా అయిపోయిన తర్వాత పబ్లిక్ నోటీస్‌కు సంబంధించిన ప్రాసెస్ మొదలవుతుంది. ఇందులో భాగంగా కొత్తగా పెట్టిన పార్టీ పేరును రెండు జాతీయ, రెండు లోకల్ పేపర్లలో ప్రచురించాలి. ఈ నోటీస్ ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లోనూ ప్రదర్శిస్తారు. కొత్త పార్టీకి సంబంధించి ఎవరైనా 30 రోజుల్లోగా అభ్యంతరం చెబితే.. దాన్ని పరిగణలోకి తీసుకుంటారు.


పార్టీ పేరు.. మొత్తం ఖర్చులు..

కొత్తగా పెట్టిన పార్టీ పేరు మతపరమైనదై ఉండకూడదు. ఇప్పటికే ఉన్న పార్టీలతో సంబంధం ఉండకూడదు. ఇక, ఖర్చు విషయానికి వస్తే ఎన్నికల సంఘానికి 10 వేల రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్ సమర్పించాలి. ఈ డిమాండ్ డ్రాఫ్ట్‌ను "అండర్ సెక్రటరీ, ఎన్నికల సంఘం, న్యూఢిల్లీ" పేరిట తీయాలి. ఈ డబ్బులు తిరిగి ఇవ్వబడవు. అఫిడవిట్ల కోసం నోటరీకి 5 వేల నుంచి 10 వేల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. జాతీయ, లోకల్ పత్రికల్లో ప్రకటనల కోసం 20 వేల నుంచి 50 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. లాయర్ కన్సల్టేషన్ ఫీజు 10 వేల నుంచి 30 వేల వరకు ఉంటుంది. మొత్తంగా దాదాపు 45 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల దాకా ఖర్చు వస్తుంది. ఇది కేవలం అంచనా ఖర్చు మాత్రమే..


ఇవి కూడా చదవండి:

ఇది కారు లాంటి గేట్..

Hotel Booking: ఒయో రూమ్స్ కోసం ఆధార్ ఉపయోగిస్తున్నారా.. అయితే ఇలా చేయండి

Stock Market Update: స్వల్ప లాభాల్లో గట్టెక్కిన నిఫ్టీ, సెన్సెక్స్ రెడ్ లో బ్యాంక్ నిఫ్టీ

Updated Date - Mar 25 , 2025 | 09:52 PM