DK ShivaKumar or Siddaramaiah: కర్ణాటక సీఎం ఎవరనే ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్.. తొలి ప్రయత్నంలో ఓ మెట్టు అధిగమించిన డీకే శివకుమార్..!
ABN , First Publish Date - 2023-05-15T13:49:35+05:30 IST
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Election Results) గెలిచి అధికారాన్ని ‘హస్త’గతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీకి (Congress Party) ముఖ్యమంత్రి అభ్యర్థిని (Karnataka CM Selection) ఎన్నుకోవడం పెద్ద తలనొప్పిగా..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Election Results) గెలిచి అధికారాన్ని ‘హస్త’గతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీకి (Congress Party) ముఖ్యమంత్రి అభ్యర్థిని (Karnataka CM Selection) ఎన్నుకోవడం పెద్ద తలనొప్పిగా మారింది. సీఎం పదవి కోసం కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ (Congress Chief DK ShivaKumar), మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య (Siddaramaiah) మధ్య తీవ్ర పోటీ నెలకొంది. సీఎల్పీ భేటీలోనే సీఎం ఎవరనేది తేల్చేస్తారనుకుంటే అధిష్టానం వద్దే తేల్చుకుంటామని డీకే స్పష్టం చేయడంతో ఉత్కంఠ కొనసాగుతోంది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్లి.. కాంగ్రెస్ అధిష్టానం ఏం డిసైడ్ చేస్తుందో తేలాక తదుపరి కార్యాచరణ ఏంటనే విషయంలో ఒక స్పష్టమైన నిర్ణయానికి రానున్నారు. అయితే.. కర్ణాటక సీఎం పదవి కోసం ఇప్పటివరకూ జరిగిన పరిణామాలను గమనిస్తే సిద్ధరామయ్యతో పోల్చుకుంటే డీకే శివకుమార్ ఒక్క విషయంలో మాత్రం విజయం సాధించినట్టే కనిపిస్తోంది.
సీఎల్పీ భేటీలోనే సీఎం ఎవరనేది తేలే నిర్ణయమైతే సిద్దరామయ్యకే చాన్స్ ఉంటుందనే అభిప్రాయం ఉంది. పార్టీ ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది ఆయనవైపే మొగ్గు చూపుతున్నారు. గడిచిన ఏడాదిగా కాబోయే సీఎం సిద్దరామయ్య అంటూ పార్టీ సీనియర్లు, ఎమ్మెల్యేలు బహిరంగ ప్రకటనలు చేశారు. ఈ అంశంపై ఢిల్లీలో పంచాయితీ కూడా జరిగింది. ఎన్నికలు ముగిసేదాకా ఎవరూ బహిరంగ ప్రకటన చేయరాదని అధిష్టానం పలుమార్లు ఆదేశించినా సాధ్యం కాలేదు. ప్రస్తుతం సీఎల్పీలో బహిరంగంగా అభిప్రాయాలను సేకరిస్తే సిద్దరామయ్య వైపు ఎక్కువమంది మొగ్గు చూపే అవకాశం ఉంది. అందుకే వ్యూహాత్మకంగా డీకే శివకుమార్ పార్టీ అధిష్టానం సమక్షంలోనే తేలాలని పట్టుబట్టారు. తొలి ప్రయత్నంలో డీకే శివకుమార్ ఓ మెట్టు అధిగమించారు. కాగా అధికారాన్ని పంచుకునేందుకు డీకే ససేమిరా అనడంతో పరిశీలకులు ఎటూ నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాలేదు. దీన్ని బట్టి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి కావాలని డీకే శివకుమార్ ఆశిస్తున్నట్టు స్పష్టమైంది.
డీకే శివకుమార్ విషయంలో కాంగ్రెస్ తటపటాయించడానికి కారణం ఆయనపై ఉన్న కేసులేనని తెలుస్తోంది. డీకే మూడు దశాబ్దాలకు పైగానే రాజకీయాల్లో ఉన్నారు. కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా రెండేళ్లలో పోరాటాల ద్వారా రాష్ట్రమంతటా పార్టీని బలోపేతం చేశారు. అయితే.. ఆయనను సీబీఐ, ఈడీ కేసులు వెంటాడుతున్నాయి. ఎవరైనా కేసుల గురించి ప్రస్తావిస్తే ఆయన బలంగా తిరిగి తిప్పికొట్టే విధంగా సమాధానం చెప్పలేకపోతుండటం డీకేకు ప్రతికూల అంశంగా మారింది. డీకే శివకుమార్ అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా మే 30న వాదోపవాదాలు కొనసాగనున్నాయి. 2013-2018 మధ్య డీకే ఆస్తుల విలువ రూ.589 కోట్లు పెరిగిందనేది సీబీఐ ప్రధాన అభియోగం. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ అక్రమంగా (లెక్కల్లో చూపని సంపద) రూ.74.9 కోట్లు సంపాదించారని సీబీఐ ఆరోపించింది. మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని డీకే శివకుమార్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గతంలో అరెస్ట్ చేసిన విషయం కూడా తెలిసిందే. డీకేను ముఖ్యమంత్రిగా చేస్తే ఈ కేసుల వల్ల పదవికి ముప్పు వాటిల్లుతుందోననే భయంలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు సమాచారం.