Lasya Nanditha: ఎవరీ లాస్య నందిత.. కేసీఆర్ టికెట్ ఇచ్చిన ఈమె రాజకీయాలకు కొత్త కాదు కానీ..

ABN , First Publish Date - 2023-08-21T22:16:06+05:30 IST

బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే జి.సాయన్న అకాల మరణంతో ఖాళీ అయిన కంటోన్మెంట్‌ టికెట్‌ హాట్‌ కేక్‌లా మారింది. అధికార పార్టీలో అరడజను మంది టికెట్‌ కోసం విశ్వప్రయత్నాలు చేశారు. హైదరాబాద్‌ జిల్లాలో ఏకైక ఎస్సీ అసెంబ్లీ సెగ్మెంట్‌ ఇదే కావడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన సీనియర్‌ నేతలు టికెట్‌ నాకంటే.. నాకు అని ప్రచారం చేసుకున్నారు. కానీ చివరకు ఎమ్మెల్యే టికెట్ సాయన్న కుమార్తె లాస్య నందితకే దక్కింది.

Lasya Nanditha: ఎవరీ లాస్య నందిత.. కేసీఆర్ టికెట్ ఇచ్చిన ఈమె రాజకీయాలకు కొత్త కాదు కానీ..

బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే జి.సాయన్న అకాల మరణంతో ఖాళీ అయిన కంటోన్మెంట్‌ టికెట్‌ హాట్‌ కేక్‌లా మారింది. అధికార పార్టీలో అరడజను మంది టికెట్‌ కోసం విశ్వప్రయత్నాలు చేశారు. హైదరాబాద్‌ జిల్లాలో ఏకైక ఎస్సీ అసెంబ్లీ సెగ్మెంట్‌ ఇదే కావడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన సీనియర్‌ నేతలు టికెట్‌ నాకంటే.. నాకు అని ప్రచారం చేసుకున్నారు. స్థానికులతో పాటు స్థానికేతర నేతలు టికెట్‌పై కన్నేసి నియోజకవర్గంలో పర్యటించారు. పోటీ అధికమవ్వడం బీఆర్‌ఎస్‌లో ఓ వైపు ఆనందాన్ని, మరోవైపు ఆందోళనను కలిగించింది. పోటీ పెరిగి నియోజకవర్గంలో వారు ఎంత ఎక్కువగా పర్యటించి పనిచేస్తే పార్టీకి అంత మేలు కలుగుతుందని ఓ వైపు, ఒకరికి టికెట్‌ ఇస్తే, మరో ఐదుగురు వ్యతిరేకమవుతారనే భావన మరోవైపు వ్యక్తమైంది.


దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె, మాజీ కార్పొరేటర్‌ లాస్య నందిత, రాష్ట్ర మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మన్నె క్రిశాంక్‌, బేవరేజస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గజ్జెల నాగేష్‌, వైద్య సదుపాయాలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, శ్రీగణేష్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ ఎన్‌. శ్రీగణేష్‌, బీఆర్‌ఎస్‌ నాయకుడు ముప్పిడి మధుకర్‌ బరిలోకి దిగాలని ఆరాటపడగా సాయన్న కుమార్తెకే ఆ అవకాశం దక్కింది. లాస్య నందిత, క్రిశాంక్‌, గజ్జెల నాగేష్‌, ఎర్రోళ్ల శ్రీనివాస్‌, శ్రీగణేశ్‌లు నిత్యం ప్రజాక్షేత్రంలో పర్యటించారు. బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి మర్రి రాజశేఖరరెడ్డి నియోజకవర్గంలో పర్యటిస్తూ శ్రేణులకు అందుబాటులో ఉన్నారు.

128102441_3524062941041966_3340708447182946941_n.jpg

హైదరాబాద్‌ జిల్లాలో ఏకైక ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గం కంటోన్మెంట్‌. సిట్టింగ్‌ ఎమ్మెల్యే సాయన్న అకాల మరణంతో ఆయన కుమార్తె లాస్య నందిత పోటీ చేసేందుకు సిద్ధమవక తప్పని అనివార్య పరిస్థితి నెలకొంది. ఐదుసార్లు విజయం సాధించడం ద్వారా కంటోన్మెంట్‌కు పర్యాయపదంగా నిలిచిన సాయన్న హఠాన్మరణంతో ఆయన స్థానంలో లాస్య నందితను బరిలోకి దించాలని సాయన్న అనుచరులు భావించారు. ఆమెకు గతంలో జీహెచ్‌ఎంసీ కవాడిగూడ కార్పొరేటర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. సాయన్న మరణానికి ముందు నుంచే నందిత నియోజకవర్గ పరిధిలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, సాయన్న అభిమానులు, సాధారణ ప్రజానీకంతో పరిచయాలు పెంచుకున్నారు. ప్రస్తుతం కంటోన్మెంట్‌లో పర్యటిస్తూ పార్టీ శ్రేణులు, ప్రజలతో మమేకమవుతున్నారు.

127157687_3523553914426202_4229420574469153543_n.jpg

సాయన్న కూతురుకి కంటోన్మెంట్ టికెట్ ఇవ్వడంతో సానుభూతి ఓటు బ్యాంకుపై బీఆర్‌ఎస్ బోలెడు ఆశలు పెట్టుకుంది. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర సాయన్నకు ఉండటంతో, ఆయన సేవలను గుర్తించి సాయన్న కుమార్తె లాస్య నందితకు టికెట్ ఇచ్చారని నియోజకవర్గ బీఆర్‌ఎస్ శ్రేణుల్లో కూడా కొంత సానుకూల వాతావరణం ఉంటుందనేది బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. మహిళకు కంటోన్మెంట్ టికెట్ ఇచ్చామనే ప్రచారం కూడా లాస్య నందిత గెలుపునకు దోహదపడుతుందని గులాబీ పార్టీ గట్టి నమ్మకంతో ఉంది. దేశంలోనే సైనికుల ఆధీనంలో ఉన్న అతిపెద్ద కంటోన్మెంట్ అయిన సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో రెండున్నర లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్నారు.

Updated Date - 2023-08-21T22:28:00+05:30 IST