Google Lay Offs: స్టార్ పెర్ఫార్మర్ అవార్డు పొందిన ఉద్యోగిని గూగుల్ ఏం చేసిందో తెలిస్తే.. నివ్వెరపోతారు!
ABN , First Publish Date - 2023-02-28T21:16:08+05:30 IST
టెక్నాలజీ కంపెనీలు ఇటీవల ఉద్యోగులపై ఎడాపెడా కత్తిదూస్తున్నాయి.
న్యూఢిల్లీ: టెక్నాలజీ కంపెనీలు ఇటీవల ఉద్యోగులపై ఎడాపెడా కత్తిదూస్తున్నాయి. ఉన్నఫళంగా ఇంటికి పంపుతున్నాయి. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్(Twitter) ఎలాన్ మస్క్ చేతికి వచ్చిన తర్వాత ప్రారంభమైన ఈ ‘లే ఆఫ్’ల పరంపర దాదాపు అన్ని ఐటీ కంపెనీలకు పాకింది. మైక్రోసాఫ్ట్(Microsoft) నుంచి అమెజాన్ (Amazon) వరకు అన్ని కంపెనీలు వేలాదిమందిని ఇంటికి పంపాయి. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్(Google) తాజాగా ఇండియాలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 450 మందిని ఇంటికి పంపినట్టు తెలుస్తోంది. ఈ అకస్మాత్తు పరిణామంతో ఉద్యోగులు షాకింగ్‌లోకి వెళ్లిపోయారు. తమ బాధలను సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ ఆవేదనను పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. గూగుల్‌లో డిజిటల్ మీడియాలో సీనియర్ అసోసియేట్‌గా పనిచేస్తున్న హైదరాబాదీ లింక్డిన్‌లో తన బాధను ఇలా పంచుకున్నారు.
‘‘శనివారం ఉదయం గూగుల్ ఆపరేషన్ సెంటర్ నుంచి నా ఫోన్‌కు వచ్చిన ఓ పాపప్ ఈమెయిల్ నోటిఫికేషన్ చూసి నా గుండె ఆగినంత పనైంది. నేను కూడా లే ఆఫ్ బాధితుల్లో ఒకడిగా మారాను. అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటైన గూగుల్‌లో నేను పనిచేస్తున్నందుకు గర్వంగా ఉండేది. ఉంటాను కూడా. అయితే, నా ఫస్ట్ ప్రశ్న ఏంటంటే.. నేను స్టార్ పెర్ఫార్మర్‌ను అయినప్పటికీ నేనే ఎందుకు? అన్నదే ప్రశ్న. దీనికి సమాధానం ఉండదన్న విషయం కూడా నాకు తెలుసు’’ అని రాసుకొచ్చాడు.
లేఆఫ్ తనపై ఎలాంటి ప్రభావం చూపించిందో చెబుతూ.. నా వేతనం రెండు నెలల వరకు సగమే. నా ఆర్థిక ప్రణాళిక పూర్తిగా నాశనం అయింది. ఇది శనివారం జరిగింది. దీనిని నేను రాయడానికి రెండు రోజులు పట్టింది. ఇప్పుడు మళ్లీ జీవనం కోసం యుద్ధం ప్రారంభించాలి. మీకు తెలిసి ఏదైనా మంచి అవకాశం ఉంటే చెప్పండి. లే ఆఫ్ యుద్ధంతో పోరాడుతున్న వారందరూ అంతర్గత పోరాటంతోపాటు మనుగడ పోరాటం కూడా దారి వెతకండి’’ అని అందులో రాసుకొచ్చాడు.
గురుగ్రామ్‌కు చెందిన గూగుల్ క్లౌడ్ ప్రోగ్రాం మేనేజర్ ఆక్రితి వాలియాకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. గూగుల్‌లో ఐదేళ్లు పూర్తిచేసుకున్నందుకు ఇటీవలే సెలబ్రేట్ చేసుకున్న ఆమెకు ఆ ఆనంద క్షణాలు ఎంతోసేపు నిలవలేదు. ఆఫీసుకెళ్లి కంప్యూటర్ ఆన్ చేస్తే ‘యాక్సెస్ డినైడ్’ మెసేజ్ వచ్చిందని వాపోయారు. కాగా, 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ ఇంక్ జనవరిలో ప్రకటించి నివ్వెరపరిచింది. అదే నెలలో మరో దిగ్గజ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ కూడా 10 వేలమందిని తొలగించింది. అమెజాన్ 18 వేల మందిని, మెటా 11 వేలమందికిపైగా ఉద్యోగులను తొలగించింది.