NTR: కొడుకు కలెక్టరు.. తండ్రి బంట్రోతు

ABN , First Publish Date - 2023-02-19T14:10:53+05:30 IST

త్రివేణి ప్రొడక్షన్స్‌ పతాకంపై పి. పేర్రాజు నిర్మించిన ‘బంగారు మనిషి’ (Bangaru Manishi) (25-08-1976) చిత్రంలోనిది ఈ స్టిల్‌.

NTR: కొడుకు కలెక్టరు.. తండ్రి బంట్రోతు
NTR

త్రివేణి ప్రొడక్షన్స్‌ పతాకంపై పి. పేర్రాజు నిర్మించిన ‘బంగారు మనిషి’ (Bangaru Manishi) (25-08-1976) చిత్రంలోనిది ఈ స్టిల్‌. మనిషి ఎలాంటి స్థితిలో ఉన్నా స్వయంకృషి వల్ల పైకి వస్తాడనే సామాజిక విలువల్ని ఈ చిత్రం ప్రబోధించింది. కలెక్టరు ఆఫీసులో బంట్రోతు రంగన్న (గుమ్మడి) కొడుకు వేణు (ఎన్‌.టి.రామారావు). కొడుకు పెద్ద చదువులు చదివి తండ్రి బంట్రోతుగా వున్న చోటనే కలెక్టరు కావడం కథాంశం. తండ్రీ కొడుకులు, బంట్రోతు - కలెక్టరు మధ్య నడిచిన సన్నివేశాలలో గుమ్మడి (Gummadi Venkateswara Rao), ఎన్‌.టి.ఆర్‌. (NTR) హృదయాల్ని కదిలించేలా నటించారు.

గుమ్మడి కాఫీ తీసుకురమ్మని భార్యకు పురమాయిస్తే, వేణు కాఫీ తెస్తాడు. ‘‘బాబూ! నువ్వు తెచ్చావా?’’ అని తండ్రి అంటే.. ‘‘నాన్న! ఆఫీసులో కలెక్టరుగారికి ప్యూన్‌గా పదిసార్లు కాఫీ ఇచ్చారు. కన్నకొడుకుగా ఒకసారైనా కాఫీ ఇవ్వకూడదా?’’ అనే సన్నివేశామూ, తన స్నేహితుడు మధు (శరత్‌బాబు) ఆఫీసులో కలెక్టర్‌ అయిన తన స్నేహితుణ్ని చనువుగా సంభోదించబోతే కటువుగా వారిస్తూనే బయటకు వచ్చాక, ‘‘అరే మధూ! అక్కడ మాట్లాడడం ఎంత తప్పో, ఇక్కడ మాట్లాడకపోవడం అంత తప్పురా, ఆఫీసుకొక మర్యాద వుంది, స్నేహానికి ఒక హద్దు ఉంది’’ అనే సన్నివేశాన్ని రామారావు చాలా సహజంగా, ఆర్ధ్రంగా నటించారు. సహజ నటి లక్ష్మితో ఎన్‌.టి.రామారావు హీరోగా చేసిన చివరి చిత్రం ఇదే. ‘నా దేశం భగవద్గీత’ అన్న పాట ఎంతో ప్రజాదరణ పొందింది.

ఇది కూడా చదవండి: NTR-Bhanumathi: ఒకే సినిమా.. రెండు అర్ధ శతదినోత్సవాలు

Updated Date - 2023-02-19T14:10:55+05:30 IST