Viral Video: నీ భార్య కంటే నేనే బెటర్.. అంటూ లిఫ్ట్‌లోనే ఓ మహిళ రచ్చ.. నా భార్య గర్భవతి అంటూ అతడు అడిగిన ఒక్క మాటకే..!
ABN , First Publish Date - 2023-07-07T14:57:36+05:30 IST
కొందరు తాము పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. ఎదుటి వారు ఏం చెప్పినా వినిపించుకోకుండా.. అంతా మా ఇష్టం అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. తాము చేస్తున్నది తప్పు అని తెలిసినా.. సరిదిద్దుకునే ప్రయత్నం మాత్రం చేయరు. ఇదంతా..
కొందరు తాము పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. ఎదుటి వారు ఏం చెప్పినా వినిపించుకోకుండా.. అంతా మా ఇష్టం అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. తాము చేస్తున్నది తప్పు అని తెలిసినా.. సరిదిద్దుకునే ప్రయత్నం మాత్రం చేయరు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నామంటే.. ఇటీవల లిఫ్ట్‌లో ఓ మహిళ ఇలాగే రచ్చ రచ్చ చేసింది. నా భార్య గర్భవతి అంటూ ఓ వ్యక్తి అన్న ఒక్క మాటకు.. నీ భార్య కంటే నేనే బెటర్.. అంటూ సదరు మహిళ వాగ్వాదానికి దిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియలో ఓ వీడియో (Viral video) తెగ చక్కర్లు కొడుతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) నోయిడా లాజిక్స్ సొసైటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న అపార్ట్మెంట్ లిఫ్ట్ ఓ జంటతో పాటూ మరికొంత మంది వెళ్తూ ఉండగా... ఓ మహిళ (woman) తన పెంపుడు కుక్కను (pet dog) తీసుకుని లోపలికి వస్తుంది. కుక్కను చూడగానే లోపల ఉన్న వారంతా.. ఎక్కడ కరుస్తుందోనని భయపడతారు. ఇంతలో ఓ వ్యక్తి కలుగజేసుకుని.. ‘‘ఏవమ్మా.. కుక్క నోటికి మాస్క్ తొడగండి’’.. అని సూచిస్తాడు. దీంతో ఆమెకు ఒక్కసారిగా చిర్రెత్తుకొస్తుంది. ‘‘నా ఇష్టం నేను మాస్క్ వేయను’’.. అంటూ వారితో వాగ్వాదానికి దిగుతుంది.
‘‘నా భార్య గర్భిణి.. ఒకవేళ కుక్క కరిచిందంటే.. మేము చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది’’.. అంటూ అతను విన్నవించుకున్నా ఆ మహిళ మాత్రం అసలు వినిపించుకోదు. దీంతో అతడికి కోపం వచ్చి ‘‘ఈ మహిళ అసలు మనిషేనా’’.. అని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఇందుకు ఆమె ‘‘నీ భార్య కంటే నేనే బెటర్’’.. అంటూ వాగ్వాదానికి దిగుతుందే తప్ప.. కుక్క నోటికి మాస్క్ మాత్రం వేయలేదు. కుక్క మెడలోనే మాస్క్ వేలాడుతున్నా.. వేయడానికి మాత్రం ఆమె ఒప్పుకోలేదు. ఈ ఘటనను మొత్తం సదరు దంపతులు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ హల్చల్ చేస్తోంది. మహిళ ప్రవర్తనను జంతు ప్రేమికులు కూడా ఖండిస్తున్నారు. మాస్క్ వేయడం అందరికీ శ్రేయస్కరమని, అలా చేయకుండా వాగ్వాదం దిగడం పద్ధతి కాదని హితవు పలుకుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.