Viral: ఉద్యోగం పోగొట్టుకున్న మూడో రోజే కొత్త జాబ్.. మహిళ ఉదంతం వైరల్..
ABN , First Publish Date - 2023-01-30T21:02:44+05:30 IST
సోషల్ మీడియాలో మహిళ ఉదంతం వైరల్.. జాబ్ పోయిన మూడు రోజులకే కొత్త ఉద్యోగం సంపాదించిన వైనం.
ఎన్నారై డెస్క్: టెక్ రంగంలో ఉద్యోగాల తొలగింపు(Mass Layoffs) ప్రస్తుతం సిబ్బందిని తీవ్ర కలకలానికి గురి చేస్తోంది. మైక్రోసాఫ్ట్(Microsoft), గూగుల్(Google), మెటా(Meta) లాంటి సంస్థలు ఇప్పటికే వేల మంది ఉద్యోగులను తొలగించాయి. తమతో సంస్థలు ఎంత కఠినంగా వ్యవహరించిందీ చెబుతూ పలువురు సోషల్ మీడియాలో తమ బాధను వెళ్లబోసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మరో జాబ్ దొరక్కపోతే అమెరికాను వీడాల్సి వస్తుందని ఎన్నారైలు బెంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి సమయంలో జాబ్ పోగొట్టుకున్న ఓ మహిళ జస్ట్ మూడు రోజుల్లోనే కొత్త ఉద్యోగాన్ని సంపాదించింది. తన అనుభవాన్ని వివరిస్తూ ఆమె పెట్టిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ట్విటర్‌లో babyCourtfits అకౌంట్‌గల ఓ యువతి తనకు కొత్త జాబ్ ఎలా వచ్చిందీ చెబుతూ పెట్టిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లో ఆసక్తి రేపుతోంది. ‘‘మంగళవారం నాకు జాబ్ పోయింది. కానీ.. శుక్రవారమే మరో ఆఫర్ వచ్చింది. 50 శాతం ఎక్కువ శాలరీ, అదీ వర్క్ ఫ్రం హోం అవకాశం. నేను అందరకీ ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను. ఇతరుల అభిప్రాయాల్ని విని నమ్మకాన్ని కోల్పోకండి. జాబ్ కోల్పోయాక నిరాశలో కూరుకుపోయి తేరుకున్నాక నేను ఈ విషయం చెబుతున్నాను’’ అంటూ ఆమె ట్వీ్ట్ చేశారు. జాబ్ కోల్పోయిన రోజే మరో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నట్టు ఆమె చెప్పుకొచ్చారు. మూడు రోజుల పాటూ మూడు మార్లు ఇంటర్వ్యూకు హాజరయ్యాక ఈ ఉద్యోగం వచ్చినట్టు ప్రకటించారు. ఈ ట్వీట్‌లో ఎందరిలోనే కొత్త ఆశలు నింపాయి. ఆత్మస్థైర్యాన్ని ఇచ్చాయి. దీంతో.. లక్షల సంఖ్యలో ఆమె ట్వీట్‌కు లైకులు వచ్చాయి. అనేక మంది ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు.