Asian Games 2023: ఫైనల్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేసి 10వ గోల్డ్ మెడల్ గెలిచిన భారత్
ABN , First Publish Date - 2023-09-30T16:22:44+05:30 IST
ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో 10వ గోల్డ్ మెడల్ చేరింది. పురుషుల టీమ్ స్క్వాష్ విభాగం ఫైనల్‌లో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించింది.
హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో 10వ గోల్డ్ మెడల్ చేరింది. పురుషుల టీమ్ స్క్వాష్ విభాగం ఫైనల్‌లో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో పాకిస్థాన్‌పై విజయకేతనం ఎగురవేసిన భారత్ బంగారు పతకం గెలిచింది. ఈ సూపర్ థ్రిల్లర్ పోరులో అభయ్ సింగ్, సౌరవ్ ఘోషల్, మహేష్‌తో కూడిన భారత జట్టు 2-1 తేడాతో గెలిచి స్వర్ణం కైవసం చేసుకుంది. మొదట 8-11, 3-11, 2-11 స్కోరుతో నాసిర్ ఇక్బాల్ చేతిలో మహేష్ ఎం ఓడిపోవడంతో భారత్ వెనుకబడింది. అయితే 11-5, 11-1, 11-3తో ముహమ్మద్ అసిమ్‌పై సౌరవ్ ఘోషల్ విజయం సాధించడంతో భారత్ పోటీలోకి వచ్చింది. 1-1తో సమం అయింది. ఇక మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించే మూడో సెట్‌లో అభయ్ సింగ్ అద్భుతంగా ఆడాడు. ఒత్తిడిని అధిగమిస్తూ చక్కగా ఆడి నూర్ జమాన్‌పై 11-7, 9-11, 7-11, 11-9, 12-10తో విజయం సాధించాడు. దీంతో ఫైనల్ మ్యాచ్ 2-1తో భారత్ సొంతం అయింది. భారత్ ఖాతాలో బంగారు పతకం చేరింది.
కాగా ఆసియా క్రీడలు 2023లో భారత్‌కు ఇది 10వ గోల్డ్ మెడల్ కావడం గమనార్హం. ఆసియా క్రీడల్లో భారత్‌కు నేడు రెండు గోల్డ్ మెడల్స్ వచ్చాయి. టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో భారత్ జోడి రోహన్ బోపన్న-రుతుజ భోసలే బంగారు పతకాన్ని గెలిచింది. చైనీస్ తైపీకి చెందిన సంగ్-లియాంగ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రెండో సీడ్ భారత్ జోడి 2-6, 6-3, 10-4 తేడాతో విజయం సాధించింది. దీంతో ఈ టోర్నీలో మొత్తంగా భారత్ పతకాల సంఖ్య 36కు చేరింది.