Share News

AUS vs NZ: పవర్‌ప్లేలో ఆస్ట్రేలియా ఓపెనర్ల ఊచకోత.. వరల్డ్ కప్ చరిత్రలోనే..

ABN , First Publish Date - 2023-10-28T12:03:01+05:30 IST

ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్లు ఊచకోత కోశారు. ఆరంభం నుంచే కివీస్ బౌలర్లపై విరుచుకుపడిన డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్ పరుగుల సునామీ సృష్టించారు. ఫోర్లు, సిక్సులతో రెచ్చిపోయిన వీరిద్దరు పవర్ ప్లేలో పెను విధ్వంసం సృష్టించారు.

AUS vs NZ: పవర్‌ప్లేలో ఆస్ట్రేలియా ఓపెనర్ల ఊచకోత.. వరల్డ్ కప్ చరిత్రలోనే..

ధర్మశాల: ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్లు ఊచకోత కోశారు. ఆరంభం నుంచే కివీస్ బౌలర్లపై విరుచుకుపడిన డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్ పరుగుల సునామీ సృష్టించారు. ఫోర్లు, సిక్సులతో రెచ్చిపోయిన వీరిద్దరు పవర్ ప్లేలో పెను విధ్వంసం సృష్టించారు. దీంతో ఈ వరల్డ్ కప్‌లో పవర్‌ప్లేలో ఆస్ట్రేలియా అత్యధిక స్కోర్‌ను నమోదు చేసి రికార్డు నెలకొల్పింది. అలాగే ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఈ వరల్డ్ కప్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. మొదటి ఓవర్ నుంచే టీ20 స్టైలులో బ్యాటింగ్ చేసిన వార్నర్, హెడ్ ప్రతి ఓవర్‌లోనూ ఫోర్లు, సిక్సులతో దుమ్ములేపారు. మాట్ హెన్రీ వేసిన మొదటి ఓవర్లో వార్నర్ 2 ఫోర్లు బాదాడు. హెన్రీనే వేసిన మూడో ఓవర్లో వార్నర్ ఓ సిక్సు, హెడ్ రెండు సిక్సులు బాదడంతో ఏకంగా 22 పరుగులొచ్చాయి. బౌల్ట్ వేసిన నాలుగో ఓవర్లో వార్నర్ ఓ ఫోర్, సిక్సు బాదాడు. హెన్రీ వేసిన ఐదో ఓవర్ మొదటి మూడు బంతులను హెడ్ 2 ఫోర్లు, ఓ సిక్సు బాదాడు. దీంతో 4.1 ఓవర్లలోనే ఆస్ట్రేలియా స్కోర్ 50 పరుగులకు చేరుకుంది. దీంతో ఈ వరల్డ్ కప్‌లో వేగంగా 50 పరుగులు పూర్తి చేసుకున్న జట్టుగా రికార్డు నెలకొల్పింది. వార్నర్, హెడ్ ధాటికి కివీస్ బౌలర్ హెన్రీ తన మొదటి 3 ఓవర్లలోనే ఏకంగా 44 పరుగులు సమర్పించుకున్నాడు.


ఫెర్గ్యూసన్ వేసిన 7వ ఓవర్లో వార్నర్ రెండు సిక్సులు, హెడ్ ఓ ఫోర్ బాదడంతో 19 పరుగులొచ్చాయి. శాంట్నర్ వేసిన 9వ ఓవర్లో హెడ్ ఓ ఫోర్, సిక్సు, వార్నర్ ఓ ఫోర్ బాదడంతో 15 పరుగులొచ్చాయి. ఈ క్రమంలో ఆస్ట్రేలియా స్కోర్ 8.5 ఓవర్లలోనే 100 పరుగులకు చేరుకుంది. దీంతో ఈ ప్రపంచకప్‌లో వేగంగా 100 పరుగులు చేసిన జట్టుగా ఆసీస్ రికార్డు నెలకొల్పింది. అలాగే డేవిడ్ వార్నర్ 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. ట్రావిస్ హెడ్ 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో ఈ ప్రపంచకప్‌లో వేగంగా హాఫ్ సెంచరీని చేసిన బ్యాటర్‌గా హెడ్ రికార్డు నెలకొల్పాడు. హెడ్, వార్నర్ విధ్వంసంతో ఆస్ట్రేలియా జట్టు పవర్‌ప్లేలో వికెట్ నష్టపోకుండా ఏకంగా 118 పరుగులు చేసింది. మొదటి 10 ఓవర్లలో ఆస్ట్రేలియా ఓవర్‌కు 12 పరుగుల చొప్పున సాధించింది. దీంతో ఈ ప్రపంచకప్‌లో పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. అన్ని ప్రపంచకప్‌లలో కలిపి పవర్ ప్లేలో ఇది మూడో అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. మొదటి 10 ఓవర్లలోనే ఆస్ట్రేలియా ఓపెనర్లు ఏకంగా 10 సిక్సులు బాదడం గమనార్హం. ఆ తర్వాత కూడా హెడ్, వార్నర్ విధ్వసం కొనసాగింది. దీంతో ఆస్ట్రేలియా స్కోర్ 15 ఓవర్లలోనే 150 పరుగులు దాటింది.

Updated Date - 2023-10-28T12:09:51+05:30 IST