Team India: ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయంపై బీసీసీఐ అప్‌డేట్..!!
ABN , First Publish Date - 2023-10-19T16:48:41+05:30 IST
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయంపై బీసీసీఐ అప్‌డేట్ ఇచ్చింది. పాండ్య గాయాన్ని బీసీసీఐ మెడికల్ టీమ్ పరిశీలిస్తోందని.. స్కానింగ్ కోసం ఆస్పత్రికి తరలించామని బీసీసీఐ ప్రకటన చేసింది.
పూణె వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. తన తొలి ఓవర్‌లో మూడు బంతులు వేయగానే కాలి మడమ పట్టేయడంతో పాండ్య తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. నొప్పితో విలవిలలాడిపోవడంతో పాటు అతడు కనీసం నడవలేకపోయాడు. దీంతో అతడు ఫిజియో సూచనలతో మైదానం వీడాడు. అయితే అతడి గాయంపై బీసీసీఐ అప్‌డేట్ ఇచ్చింది. పాండ్య గాయాన్ని బీసీసీఐ మెడికల్ టీమ్ పరిశీలిస్తోందని.. స్కానింగ్ కోసం ఆస్పత్రికి తరలించామని బీసీసీఐ ప్రకటన చేసింది. కానీ పాండ్య గాయం తీవ్రతపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
కాగా పాండ్యాను ఆస్పత్రికి తీసుకెళ్లగా డాక్టర్లు స్కానింగ్ నిర్వహించనున్నారు. స్కానింగ్‌లో ఫ్రాక్చర్ ఉన్నా..గాయం తీవ్రత ఎక్కువగా ఉండి జట్టుకు దూరమైనా.. టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ అనంతరం టీమిండియా న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ వంటి మేటి జట్లతో తలపడాల్సి ఉంది. హార్దిక్ పాండ్య దూరమైతే.. టీమిండియా కాంబినేషన్‌లో కూడా సమతుల్యం దెబ్బతింటుంది. బౌలింగ్, బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లో సత్తా చాటే హార్దిక్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు భారత జట్టులో మరొకరు లేకపోవడంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు.