KTR: ‘రేవంత్ ఒక్కఛాన్స్ అంటున్నారు.. 50 ఏళ్లు పాలించింది కాంగ్రెస్ కాదా?’
ABN, First Publish Date - 2023-05-08T15:10:23+05:30
ఎన్నికలు రాగానే గంగిరెద్దుల వారిలా కొన్ని పార్టీలు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.
మంచిర్యాల: మంచిర్యాల సభలో కాంగ్రెస్‌పై మంత్రి కేటీఆర్ (Minister KTR) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికలు రాగానే గంగి రెద్దుల వారిలా కొన్ని పార్టీలు వస్తున్నాయని మంత్రి వ్యాఖ్యలు చేశారు. సోమవారం బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి మాట్లాడుతూ.. ఒక్క ఛాన్స్ ఇవ్వమని రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) అడుగుతున్నారని.. ఒకసారి కాదు 50 ఏళ్ళు పాలించింది కాంగ్రెస్ (Congress) కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో కరెంటు ఉంటే వార్త, కేసీఆర్ (CM KCR) పాలనలో కరెంటు పోతే వార్త అని అన్నారు. వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం సాగుతోందన్నారు. ప్రజలు అలాంటి వాళ్ళను నమ్మొద్దని తెలిపారు. కాంగ్రెస్ కొన ఊపిరిలో ఉందని అన్నారు. బండి సంజయ్ (BJP Leader Bandi Sanjay)మనిషో.. పిచ్చోడో అర్థం కావడం లేదని మండిపడ్డారు. నరేంద్ర మోదీ దేవుడు ఎలా అయ్యారని ప్రశ్నించారు. అదానికి, సంజయ్‌కు మాత్రమే ఆయన దేవుడన్నారు. నలుగురు ఎంపీలను ఇక్కడి నుంచి గెలిపిస్తే నాలుగు బొగ్గు బ్లాకులను వేలంలో పెట్టారన్నారు. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. మూడో సారి ప్రభుత్వం రాగానే పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో భాగంగా సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి మంత్రి కేటీఆర్ పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, ఇంద్ర కరణ్ రెడ్డి, విప్ బాల్క సుమన్, ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్సి విఠల్, జెడ్పీచైర్మన్లు జనార్దన్ రాథోడ్, కోవ లక్ష్మి,ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, రాథోడ్ బాపు రావు పాల్గొన్నారు.
Updated Date - 2023-05-08T15:10:23+05:30 IST