CPI Narayana: పువ్వాడ నాగేశ్వరరావుపై సీపీఐ నారాయణ ఆగ్రహం
ABN , First Publish Date - 2023-12-02T21:04:58+05:30 IST
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ( Telangana Assembly Election ) ల్లో సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వరరావు ( Puvvada Nageswara Rao ) ఉమ్మడి ఖమ్మం /జిల్లాలో తమ పార్టీకి ఎలాంటి సహకారం అందించలేదని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ ( CPI Narayana ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ లేఖను రాశారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ( Telangana Assembly Election ) ల్లో సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వరరావు ( Puvvada Nageswara Rao ) ఉమ్మడి ఖమ్మం /జిల్లాలో తమ పార్టీకి ఎలాంటి సహకారం అందించలేదని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ ( CPI Narayana ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ లేఖను రాశారు. ఈ లేఖలో ఏముందంటే.. ‘‘వువ్వాడ నాగేశ్వరరావుకి.. ఇలాంటి ఉత్తరం ఎప్పుడో రాయాల్సి ఉన్నా మీ గత చరిత్ర, మీరు పార్టీ చేసిన సేవరీత్యా నా మనసంగీకరించక రాయలేదు. ఇంకా భరించడం నా వల్ల కాదు. తెలంగాణ రాష్ట్రం విడిపోయాక రాజకీయాలల్లో మార్పులు వచ్చాయి. మీ కుమారుడు మంత్రి అజయ్ కుమార్ రాజకీయాలల్లో చురుకైన పాత్ర వహించింది మొదలు మీలో మౌలిక మార్పులు వచ్చాయి. తండ్రి కొడుకులు ఒకే పార్టీలో ఉండాలని నేను అనుకోను. కేరళ రాష్ట్రంలో మన పార్టీ భార్యా భర్తలుగా ఉన్నా గౌరీ, గౌరీ థామస్ చెరొక పార్టీలో ఉన్నారు. నీలం రాజశేఖర్‌రెడ్డి, నీలం సంజీవరెడ్డి సొంత అన్నదమ్ములైనా చెరొక పార్టీలో క్రియాశీలంగానే ఉన్నారు. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. అయితే మీరు సీపీఐలో ప్రముఖ పాత్ర వహించారు. రాష్ట్ర రాజకీయాలల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. ఖమ్మం జిల్లాలో సీపీఐని ఉన్నత స్థాయికి తెచ్చారు. మీ సేవను పార్టీ, ప్రజలు గానీ మర్చిపోలేరు. మీ కుమారుడు రాజకీయాలల్లో ఉండవచ్చు. కానీ మీరు సీపీఐలో ప్రముఖ పాత్ర హించి నాయకులుగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా బాధ్యతలు నెరవేర్చారు. ప్రస్తుతం ఆరోగ్యరీత్యా సీపీఐలో క్రియాశీలక పాత్ర వహించలేకపోయినా సీపీఐ సాధారణ సభ్యులుగా కొనసాగుతున్నారు. అయితే మిమ్మల్ని సాధారణ సభ్యులుగా పార్టీ చూడలేదు. మీరు ఏ సభలకు వచ్చినా మిమ్మల్ని గౌరవంగా చూస్తున్నది. చివరకు ఖమ్మం జిల్లా సీపీఐ కార్యాలయం ముందు కూడా మీ ఫ్లెక్సీ నేటికీ ఉంది. ఇంత గౌరవం పొందిన మీరు సీపీఐకి ఇస్తున్న మర్యాద ఏది? మీ అబ్బాయి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పార్టీలు మారుతూ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ప్రతి సందర్భంలోనూ మీ కుమారుడిని సమర్థించారు తప్ప సీపీఐ తీసుకున్న విధానాలను బహిరంగంగా సమర్థించలేదు’’ అని నారాయణ తెలిపారు.
మచ్చుకైనా సాంబశివరావుని సమర్థించలేదు
‘‘తాజాగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. దేశ, రాష్ట్ర రాజకీయ విధానాలపై సీపీఐ ఒకే విధానం తీసుకున్నది. అందులో భాగంగానే కొత్తగూడెం స్థానాన్ని కాంగ్రెస్ మనకు కేటాయిస్తే అక్కడ సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ సాంబశివరావును పోటీకి పెట్టింది. మీ తర్వాత కామ్రేడ్ సాంబశివరావు సీపీఐలో క్రియాశీలక పాత్ర వహించగలరు. అందుకు మీరు గర్వపడతారని ఆశించాం. మీరు తద్విరుద్ధంగా బీఆర్ఎస్ అభ్యర్థి అజయ్ కుమార్‌ని బలపరుస్తూ వివిధ పద్ధతుల్లో ప్రచారం చేస్తున్నారు. కనీస మర్యాదకైనా కొత్తగూడెం స్థానం బలపడే విధంగా ఈ ఎన్నికల్లో సీపీఐ విధానాన్ని సమర్థిస్తూ ఒక ప్రకటన చేయకపోగా, ఏ పద్ధతుల్లో సమర్ధించలేదు. సహజంగా మీ పైన ఉన్న గౌరవం కొద్ది కొంతమంది సీపీఐ నేతలు కాంగ్రెస్ పార్టీ విధానాలను అమలు చేయలేకపోతున్నారు. ఇంత జరుగుతున్నా పార్టీకి చెడ్డ పేరు వస్తున్నా, చూస్తూ ఊరుకోలేక ఈ ఉత్తరాన్ని రాస్తున్నాను. నా ఉత్తరాన్ని ఏ విధంగా పరిగణించినా ఫర్వాలేదు. మీరు నాటిన చెట్టుని మీరే నరుక్కుంటున్నారు. మీకు మీరు నరుకుంటే నాకు అభ్యంతరం లేదు. పార్టీ కార్యకర్తలను, పార్టీ ప్రభావాన్ని కించపరచకండి. జిల్లా పార్టీ కార్యాలయం ముందున్న మీ ఫ్లెక్సీని మీరే తీయించేసుకోండి’’ అని లేఖలో నారాయణ తెలిపారు.
మరిన్ని తెలంగాణ ఎన్నికల వార్తల కోసం క్లిక్ చేయండి