Rahul Gandhi : నాపై మోదీ ప్రభుత్వం 24 కేసులు పెట్టింది
ABN , First Publish Date - 2023-11-26T17:57:38+05:30 IST
సీఎం కేసీఆర్ ( CM KCR ) మెక్కేసిన నిధులను కక్కిస్తామని ఐఏసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) పేర్కొన్నారు. ఆదివారం నాడు కామారెడ్డి సభలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

కామారెడ్డి: సీఎం కేసీఆర్ ( CM KCR ) మెక్కేసిన నిధులను కక్కిస్తామని ఐఏసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) పేర్కొన్నారు. ఆదివారం నాడు కామారెడ్డి సభలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ...‘‘నాణ్యత లేకపోవడంతో కాళేశ్వరం డ్యాం కుంగి పోయింది.హైదరాబాద్‌ను సాంకేతిక నగరంగా తీర్చిదిద్దాం. ప్రపంచంలో విశ్వనగరంగా హైదరాబాద్‌ను మార్చాము. కానీ వారు భూ ఆక్రమణలు, అక్రమాలతో హైదరాబాద్‌ను దోచుకున్నారు. కాంగ్రెస్ ఏం చేసిందని కేసీఆర్ అడుగుతున్నారు. కేసీఆర్ తిరుగుతున్న రోడ్లు, మీరు చదువుకున్న విద్యాసంస్థలు కాంగ్రెస్ కట్టినవే. మోదీ ఏమంటారో కేసీఆర్ అదే అంటారు. మోదీ తెచ్చే చట్టాలకు కేసీఆర్ మద్దతు ఇస్తున్నారు. మోదీకి వ్యతిరేకంగా పోరాడుతున్నాను.నాపై మోదీ ప్రభుత్వం 24 కేసులు పెట్టారు. నా ఇంటిని లాక్కున్నారు. కేసీఆర్ మీద ఎందుకు దాడులు చేయడం లేదు. విచారణలు ఎందుకు చేపట్టడం లేదు’’ అని రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు.
బీజేపీ, బీఆర్ఎస్ డ్రామాలో ఎంఐఎం చేరింది.
‘‘మోదీ, అమిత్ షాలు రెక్కలు కట్టుకుని తిరుగుతున్నారు. బీజేపీ నేతల టైర్ల గాలి తీసేశాం. బీజేపీ, బీఆర్ఎస్ డ్రామాలో ఎంఐఎం చేరింది. ఎంఐఎం కేవలం మమ్మల్ని ఓడ గొట్టడానికే ఉంటుంది. మా ప్రభుత్వం రాగానే మేమిచ్చిన ఆరు గ్యారంటీలను చట్టలుగా మారుస్తాం.కేసీఆర్ ప్రభుత్వంలో నెలకు 2000 బస్సు ఛార్జీలు ఖర్చు చేశారు. మేము మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తాం. తెలంగాణ అమరవీరులకు 250 గజాల స్థలం ఇస్తాం. యువతకు విద్యా భరోసా కార్డు ఇస్తాం. కార్డు ఉన్నవారికి పై చదువుల కోసం 5 లక్షలు ఇస్తాం.మీరు కలలుగన్న ప్రజా తెలంగాణ సాధిస్తాం.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయం. రేవంత్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించండి’’ అని రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు.
దేశమంతా కామారెడ్డి వైపు చూస్తోంది: రేవంత్‌రెడ్డి
కాగా... రేవంత్‌రెడ్డి కోసం సభా వేదికపైకి రాహుల్‌గాంధీ తిరిగి వచ్చారు. రాహుల్ ప్రసంగం పూర్తి కాగానే స్టేజి దిగి వెళ్లిపోయారు. రేవంత్‌రెడ్డి ప్రసంగం ప్రారంభించడంతో రాహుల్ వెనక్కి తిరిగి వచ్చారు. కామారెడ్డి సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... ‘‘దేశమంతా కామారెడ్డి వైపు చూస్తోంది.మీ తీర్పు తెలంగాణ చరిత్రను తిరగ రాస్తుంది. కేసీఆర్‌ను వేటాడడానికి కాంగ్రెస్ పార్టీ నన్ను కామారెడ్డికి పంపింది. కేసీఆర్ ప్రభుత్వాన్ని కామారెడ్డి గడ్డపై బొంద పెట్టాలి’’ అని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి