LB Nagar : ఎల్బీనగర్‌ను ఏలేదెవరో!
ABN , First Publish Date - 2023-11-28T04:41:26+05:30 IST
ఒకప్పుడు రాజధానికి నగరానికి శివారు ప్రాంతం.. నేడు నగరంలో కీలక ప్రాంతం. స్థానికులతోపాటు ఏపీకి చెందిన సెటిలర్లు, హైదరాబాద్ సమీప జిల్లాలకు చెందిన
మూడో విజయం కోసం సుధీర్‌రెడ్డి ప్రయత్నం
కాషాయ జెండా ఎగరేయాలని సామ రంగారెడ్డి
అసెంబ్లీలో అడుగు పెట్టాలని మధుయాష్కీ తపన
ఒకప్పుడు రాజధానికి నగరానికి శివారు ప్రాంతం.. నేడు నగరంలో కీలక ప్రాంతం. స్థానికులతోపాటు ఏపీకి చెందిన సెటిలర్లు, హైదరాబాద్ సమీప జిల్లాలకు చెందిన సెటిలర్లు పెద్ద సంఖ్యలో ఉన్న లాల్ బహదూర్ నగర్ (ఎల్బీనగర్) నియోజకవర్గం. రాజకీయ చైతన్యం కలిగిన ఓటర్లు ఉన్న నియోజకవర్గం. ఎన్నో అంశాలు ప్రభావం చూపించే ఈ స్థానంలో ప్రధాన రాజకీయ పార్టీలు హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచిన దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఈసారి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన సుధీర్‌రెడ్డి.. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య చేతిలో ఓడిపోయారు. అనంతరం 2018 ఎన్నికల్లో మహాకూటమిలో భాగంగా టీడీపీ మద్దతుతో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి సుధీర్‌రెడ్డి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఆ తరువాత బీఆర్‌ఎ్‌సలో చేరి.. ఈ ఎన్నికల్లో కారు గుర్తుపై పోటీ చేస్తున్నారు.
ఇక గత ఎన్నికల సమయంలో టీడీపీలో ఉండి.. పొత్తులో భాగంగా ఎల్బీనగర్‌లో పోటీ చేసే అవకాశం దక్కని సామ రంగారెడ్డి.. ఆ తరువాత బీజేపీలో చేరి కమలం గుర్తుతో పోటీ చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో బీజేపీ అన్ని డివిజన్లను కైవసం చేసుకోవడం ఆ పార్టీకి సానుకూలాంశంగా ఉంది. మరోవైపు బీసీ ముఖ్యమంత్రి, ఎస్సీ వర్గీకరణకు కమిటీ హామీలు కూడా బీజేపీకి కొంతమేర కలిసి వస్తాయంటున్నారు. గతంలో అభ్యర్థిత్వం విషయంలో జరిగిన అన్యాయంతో రంగారెడ్డిపై ప్రజల్లో కొంత సానుభూతి ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయి నాయకుడిగా పేరున్న మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్.. అనూహ్యంగా ఎమ్మెల్యేగా ఎల్బీనగర్ బరిలో నిలిచారు. జాతీయ స్థాయి నాయకుడు కావడంతో పార్టీలోని నేతలందరూ కలిసివచ్చి పనిచేస్తున్నారు. నియోజకవర్గంలో బలంగా ఉన్న రెండు సామాజికవర్గాల ఓటుబ్యాంకు ఆయనకు కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. సీపీఐ, టీజేఎస్ మద్దతుతో అదనపు బలం చేకూరినట్లయింది. కాగా, ఇక్కడ సెటిలర్ల ప్రభావం స్పష్టంగా ఉండనుంది. ఈ నియోజకవర్గంలో మొత్తం 5,66,816 మంది ఓటర్లుండగా.. వీరిలో పురుషులు 2,96,018మంది, మహిళలు 2,70,697 మంది, ఇతరులు 101 ఉన్నారు.