Share News

Mobile Number: మొబైల్ నంబర్‌లో 10 సంఖ్యలు ఎందుకుంటాయి.. అసలు విషయం తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే

ABN , Publish Date - Apr 04 , 2025 | 02:31 PM

నేటి కాలంలో మొబైల్ ఫోన్ వాడని వారు చాలా అరుదు. కొందరికి రెండు, మూడు ఫోన్లు కూడా ఉంటాయి. అయితే ఏ నంబర్‌కు ఆ నంబర్‌ ప్రత్యేకం. మరి మొబైల్ నంబర్‌లో పది అంకెలు మాత్రమే ఎందుకుంటాయి.. దాని వెనక ఏదైనా ప్రత్యేక కారణం ఉందా.. అంటే ఉంది.. ఆ వివరాలు..

Mobile Number: మొబైల్ నంబర్‌లో 10 సంఖ్యలు ఎందుకుంటాయి.. అసలు విషయం తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే
Mobile Number

ఒకప్పుడు మనుషుల మధ్య సంభాషణ అనేది కేవలం ఉత్తరాల ద్వారా జరిగేది. మరి నేటి కాలంలో ఇంట్లో పక్కపక్క గదుల్లో ఉన్న వారు సైతం.. ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకుండా.. ఫోన్ ద్వారా మాట్లాడుకుంటున్నారు. మొబైల్ మనుషుల మధ్య దూరాన్ని తగ్గించిందని చెప్పవచ్చు. మొబైల్ కనిపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దానిలో అనేక మార్పులు వచ్చాయి. ఒకప్పుడు కేవలం మాట్లాడుకోవడానికే పరిమితమైన సెల్‌ఫోన్‌లో ఇప్పుడు వీడయో కాల్స్ చేసి.. వేరే దేశాల్లో ఉన్న వారితో సైతం మాట్లాడగలుగుతున్నాం. అయితే మారుతున్న కాలంతో పాటు మొబైల్ ఫోన్‌లో కూడా అనేక మార్పులు వచ్చాయి. అయితే ఎన్ని మారినా.. మారనది మాత్రం ఫోన్ నంబర్‌లోని నంబర్ల సంఖ్య. మన దేశం వరకు చూసుకుంటే.. ఎవరి మొబైల్‌కైనా 10 నంబర్లే ఉంటాయి. మరి 10 అంకెలనే ఎందుకు సెలక్ట్ చేసుకున్నారు.. దీని వెనక ఉన్న సాంకేతిక, ఆర్థిక, పరిపాలనాపరమైన కారణాలు మీకోసం..


మన దేశంలో ప్రతి మొబైల్ నంబర్‌ కూడా పది సంఖ్యలతో ఉంటుంది. ఉదా.. 98*** ***** ఇలా ఉంటుంది. ఈ పది నంబర్లలో ఒక్కో అంకెకు ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది.

10 అంకెల విధానం ఎలా వచ్చిందంటే..

ఇండియాలో సెల్‌ఫోన్ సేవలు.. 1995లో ప్రారంభమయ్యాయి. అయితే ఆ సమయంలో మొబైల్ నంబర్‌లో 8 అంకెలు మాత్రమే ఉండేవి. అంటే 98*** ***. మొబైల్ వాడుకలోకి వచ్చిన ప్రారంభంలో మన దేశంలో సెల్ వినియోగదారులు చాలా తక్కువ మంది ఉండేవారు. అయితే 2000వ సంవత్సరం తర్వాత.. దేశంలో సెల్ వినియోగదారుల సంఖ్య పెరిగింది. మూడేళ్ల తర్వాత అనగా.. 2003 నాటికి, భారత టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (టీఆర్ఏఐ), టెలికాం ఆపరేటర్లు 8 అంకెల విధానం సరిపోదని గుర్తించారు. దాంతో జూలై 20, 2003 నుంచి అన్ని మొబైల్ నంబర్లు 10 అంకెలకు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక అప్పటికే ఉన్న నంబర్ల ముందు ఒక అంకెను (9)జోడించారు.

ప్రపంచవ్యాప్తంగా.. ఇప్పటికే వినియోగంలో ఉన్న, రానున్న కాలంలో రాబోయే నంబర్లు ఏవైనా సరే.. వాటిని ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) నిర్దేశించిన ఈ.164 సిఫార్సుల ప్రకారం రూపొందిస్తారు. ఐటీయూ నియమాల ప్రకారం.. ఒక దేశంలోని ఫోన్ నంబర్‌లో (కంట్రీ కోడ్‌తో సహా) గరిష్ఠంగా 15 అంకెలు ఉండాలి. ఇక ఐటీయూ నిబంధనల ప్రకారం.. భారతదేశ కంట్రీ కోడ్ +91 కాగా.. దీనికి 10 అంకెల మొబైల్ నంబర్ కలిపితే.. మొత్తం 12 అంకెలు అవుతాయి.


పది అంకెలే ఎందుకు..

మన దేశంలో మొబైల్ నంబర్లకు పది అంకెలు ఎంచుకోవడం వెనక ప్రధాన కారణం.. మన దేశ జనాభ, అలానే మొబైల్ వినియోగదారుల సంఖ్య. ఒక 10-అంకెల నంబర్ తయారు చేయడం కోసం.. 0-9 వరకు ప్రతి స్థానంలో ఒక అంకెను ఉపయోగించడం ద్వారా మొత్తం 10 బిలియన్ (1000 కోట్లు) వేర్వేరు నంబర్లను సృష్టించవచ్చు (10¹⁰). ప్రారంభంలో ఉన్న 8 అంకెల విధానంతో కేవలం 10 కోట్ల నంబర్లు మాత్రమే తయారు చేయగలం. అయితే అది ప్రస్తుత అవసరాలకు సరిపోదు. అదే 10 అంకెలు ఎంచుకోవడం వల్ల భవిష్యత్‌లో మరిన్ని కనెక్షన్లకు స్థానం లభిస్తుంది. ఇక భారతదేశంలో 2025 నాటికి మొబైల్ కనెక్షన్ల సంఖ్య సుమారు 120 కోట్లు దాటినట్లుగా ట్రాయ్ అంచనా వేస్తోంది.

10 అంకెలు.. వాటి ప్రాముఖ్యత..

మొబైల్ నంబర్‌లో ఉండే పది అంకెల్లో మొదటి సంఖ్య (ఉదా:7, 8, 9) అనేవి ఆపరేటర్ కోడ్‌ను సూచించగా.. తర్వాతి 2-3 అంకెలు మొబైల్ సర్వీస్ కోడ్ (ఎమ్ఎస్‌సీ)ను, మిగిలినవి వినియోగదారుని గుర్తించే యూనిక్ ఐడెంటిఫైయర్‌(యూఐడీ)ని సూచిస్తాయి. ఉదాహరణకు, 98*** *****లో “98” ఒక ఆపరేటర్‌కు సంబంధించినది, తర్వాతి మూడు నంబర్లు.. సర్వీస్ ఏరియాను.. ఆ తర్వాత వచ్చే ఐదు నంబర్లు.. వినియోగదారుడి ఐడీని సూచిస్తాయి.


సాంకేతిక, ఆర్థిక కారణాలు..

మొబైల్ నంబర్ కోసం భారతదేశం ఎంచుకున్న పది అంకెల విధానం సాంకేతికంగా ఎంతో సమర్థవంతమైనది అంటున్నారు టెలికాం రంగ నిపుణులు.టెలికాం నెట్‌వర్క్‌లలో స్విచ్చింగ్ సిస్టమ్స్, రూటింగ్ ప్రక్రియలు ఈ పొడవును సులభంగా నిర్వహించగలవు. పది కంటే తక్కువ అంకెలు ఉంటే నంబర్ల కొరత ఏర్పడుతుంది, అందే అంకెలు ఎక్కువైతే డయల్ చేయడం, గుర్తుంచుకోవడం కష్టమవుతుంది. ఇండియా ఎంచుకున్న పది అంకెల విధానం.. కస్టమర్లకు సౌలభ్యంగా ఉండటంతో పాటు ఆపరేటర్లకు లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే ఇది వారి కస్టమర్ బేస్‌ను విస్తరించడానికి సహాయపడుతుంది.

ఇక అమెరికా వంటి దేశాల్లో మొబైల్ నంబర్‌లో 10 అంకెలు, ప్లస్ కంట్రీ కోడ్ (కంట్రీ కోడ్ +1తో) కలిపి 11 ఉంటాయి. ఇది ఇండియాతో సమానంగా ఉంటుంది. మనదేశంలో ల్యాండ్‌లైన్ నంబర్లలో 6-8 అంకెలు ఉంటాయి. కానీ మొబైల్ విస్తరణ కోసం 10 అంకెల విధానాన్ని తప్పనిసరి చేశారు.


భవిష్యత్ సవాళ్లు..

2025 నాటికి భారత్‌లో 120 కోట్ల మొబైల్ కనెక్షన్లు ఉన్నాయి. అయితే 10 అంకెల విధానం ప్రకారం.. మన దేశంలో 1000 కోట్ల మొబైల్ నంబర్లను తయారు చేసుకోవచ్చు. అంటే దీని ప్రకారం చూసుకుంటే మనం ఇప్పటి వరకు కేవలం 120 కోట్ల మొబైల్ నంబర్లను క్రియేట్ చేశాము.. ఇంకా 880 కోట్ల నంబర్లు తయారు చేసుకోవచ్చు. అయితే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ), 5జీ వంటి సాంకేతికతల కారణంగా ప్రతి డివైస్‌కు ఒక నంబర్ అవసరమవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని.. రానున్న రోజుల్లో..11 అంకెల విధానానికి మారే అవకాశం గురించి ట్రాయ్ చర్చలు జరుపుతోంది. అయితే 11 అంకెల విధానం గురించి 2019లో ప్రతిపాదన వచ్చినప్పటికి.. ఆపరేటర్ల నుంచి వ్యతిరేకత రావడంతో అది ముందుకు కదలలేదు.


భారతదేశంలో.. మొబైల్ నంబర్‌లో 10 అంకెలు ఉండటం వెనుక జనాభా అవసరాలు, సాంకేతిక సామర్థ్యం, వినియోగ సౌలభ్యం ముఖ్యమైన కారణాలు. 2003లో ప్రారంభమైన ఈ విధానం భారత టెలికాం విప్లవానికి బాటలు వేసింది. రానున్న రోజుల్లో కనెక్షన్ల సంఖ్య పెరిగితే.. మరో అంకె జోడించే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మనం అవలంబిస్తున్న పది అంకెల విధానం మన దేశ అవసరాలను సమర్థవంతంగా తీరుస్తుంది.

ఇవి కూడా చదవండి:

గన్ వాడాలంటే వీడి తర్వాతే ఎవరైనా.. ఎలా ఫైర్ చేశాడో చూస్తే షాకవ్వాల్సిందే..

Summer Superfood: పీఎం మోదీ ఏడాదిలో 300 రోజులు తినే మఖానా స్పెషల్ రెసిపీ ఇదే..

Updated Date - Apr 04 , 2025 | 02:41 PM