TS News: భగ్గుమన్న భానుడు
ABN , First Publish Date - 2023-05-14T16:24:07+05:30 IST
భానుడు నిప్పులు చెరిగాడు. ఎండకు తోడు వడగాలులతో జనం అల్లాడారు. మధ్యాహ్నానికి రోడ్లన్నీ బోసిపోయాయి. రోహిణికి ముందే ఎండలు ఇలా ఉంటే రోహిణికార్తెలో ఇంకెలా ఉంటాయోనని..
హైదరాబాద్: భానుడు నిప్పులు చెరిగాడు. ఎండకు తోడు వడగాలులతో జనం అల్లాడారు. మధ్యాహ్నానికి రోడ్లన్నీ బోసిపోయాయి. రోహిణికి ముందే ఎండలు ఇలా ఉంటే రోహిణికార్తెలో ఇంకెలా ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో రెండు రోజులుగా భానుడు నిప్పులు కక్కుతున్నాడు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో రాష్ట్రం అగ్నిగుండంగా మారుతోంది. ఎండ తీవ్రత, తీవ్ర వడగాడ్పులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత పెరిగిపోతుండడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఉక్కబోతతో సతమతమవుతున్నారు. ఆదివారం ఉత్తర తెలంగాణ (North Telangana)లోని పలు జిల్లాల్లో 40 నుంచి 45.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. వచ్చే వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
సాధారణంగా ప్రజలతో పాటు వీధి వ్యాపారులు, వివిధ పనులకు వెళ్లే కూలీలు ఎండ తీవ్రతకు ఇబ్బందులు పడుతున్నారు. అత్య వసరమైతే తప్ప బయటకు రావడం లేదు. ప్రయాణాలకు దూరంగా ఉంటున్నారు. గతేడాది కంటే ఈ సారి గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడు భగభగమంటుండటంతో వివాహాలకు వెళ్లేందుకు కూడా ప్రజలు భయపడుతున్నారు. ముఖ్యంగా ఎండ తీవ్రతనుంచి చిన్నారులు, వృద్ధులు సరైన రక్షణ చర్యలు తీసుకోవాలని వైద్యులు పేర్కొంటున్నారు. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మరో వారం పాటు ఎండలు ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందని ప్రజలు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎండదెబ్బకు జనం చెట్లను ఆశ్రయిస్తున్నారు. ఏసీలు, కూలర్ల కొనుగోళ్లు పెరిగాయి.