111 GO: బడా బాబులకు వందల ఎకరాలు
ABN , First Publish Date - 2023-05-20T02:25:33+05:30 IST
రాష్ట్రం ప్రభుత్వం 111 జీవోను ఎత్తేయాలని తాజాగా తీసుకున్న నిర్ణయం బడా బాబులకు భారీగా లబ్ధి చేకూర్చనుంది. ఈ జీవో పరిధిలోని 84 గ్రామాల్లోని లక్ష ఎకరాల ప్రైవేటు భూముల్లో దాదాపు 70% ఈ బడా బాబులవే.

111 జీవో పరిధిలో 70 శాతం భూములు వారి చేతుల్లోనే
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హవా
అధికార పార్టీ ఎంపీకి 650 ఎకరాలు
ఓ ఎమ్మెల్సీకి 600 ఎకరాల భూమి
ఐదుగురు మంత్రులకు భారీగా భూములు
జీవో ఎత్తివేతతో వారికే ప్రయోజనం
నిరుడు వందల ఎకరాలు కొన్న ఒక ఎంపీ
చాలా గ్రామాల్లో రైతులకు భూమి నిల్
ఎన్నికల నిధుల సమీకరణకు
మార్గంగా ఎంచుకున్న బీఆర్‌ఎస్ పార్టీ?
111 జీవో ఎత్తివేతతో రాష్ట్రంలోని బడాబాబుల పంట పండింది. ఎన్నికల ముందు తీసుకున్న ఈ నిర్ణయంతో ముఖ్యంగా అధికార పార్టీ నేతల కరవు తీరింది. ముందే అనుకున్న స్కీమ్ ప్రకారం ఇప్పటికే జీవో పరిధి గ్రామాల్లో వందల ఎకరాలు పోగేసిన ప్రజాప్రతినిధులు, కంపెనీలు, అధికారులు, రియల్టర్లకు వేల కోట్ల రూపాయలు సంపాదించుకొనే మార్గం ఏర్పడింది. లక్షా 32 వేల ఎకరాల భూమిలో రియల్ ఎస్టేట్‌పై పాతికేళ్లుగా ఉన్న ఆంక్షలను ఎలాంటి షరతులు లేకుండా ఒక్కసారిగా ఎత్తేయడంతో ఊహించిన దానికన్నా ఎక్కువ లాభాన్ని అధికార పార్టీ నేతలు పొందబోతున్నారు. ఏడాది క్రితమే జీవో ఎత్తేస్తున్నట్లు ప్రకటించినా 50 శాతం భూమిలో మాత్రమే నిర్మాణాలకు అనుమతి ఇస్తారనే ప్రచారం జరిగింది. తాజా నిర్ణయంలో మాత్రం ఎలాంటి షరతులు లేవని తేల్చారు. ఆ సమాచారం తెలిసిన వర్గాలు ఎడాపెడా వందల ఎకరాలు ఈ ఏడాది వ్యవధిలోనూ కొనేశాయి. తరతరాలకూ తరగని విధంగా సంపాదించేశాయి.
హైదరాబాద్, మే 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం ప్రభుత్వం 111 జీవోను ఎత్తేయాలని తాజాగా తీసుకున్న నిర్ణయం బడా బాబులకు భారీగా లబ్ధి చేకూర్చనుంది. ఈ జీవో పరిధిలోని 84 గ్రామాల్లోని లక్ష ఎకరాల ప్రైవేటు భూముల్లో దాదాపు 70% ఈ బడా బాబులవే. రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్‌లు, ఐపీఎస్, ఐఆర్‌ఎస్ అధికారులు, వ్యాపారులు, రియాల్టర్లదే అక్కడి భూముల్లో సింహభాగం. ఈ జీవో పరిధిలో ఉన్న గ్రామాల్లో మొత్తంగా సుమారు 1.32 లక్షల ఎకరాలు ఉంటుందని అంచనా. ఇందులో గ్రామ కంఠం, ప్రభుత్వ భూములు తదితర స్థలాలు తీసేస్తే లక్ష ఎకరాలు నికరంగా ఉంటుంది. ఇందులో 70 వేల ఎకరాలు పెద్దోళ్ల చేతుల్లోనే ఉంది. మిగిలిన 30% భూమి మాత్రమే రైతుల చేతుల్లో ఉంది. కొన్ని గ్రామాల్లో అయితే గ్రామ కంఠం భూమి తప్ప మిగిలిన భూమి అంతా పెద్దోళ్ల చేతుల్లోనే ఉంది. కొన్ని గ్రామాల్లో 70%, మరికొన్ని గ్రామా ల్లో 50% భూములు వీరి చేతుల్లో ఉన్నాయి.
ఎమ్మెల్యేలు, ఎంపీ నుంచి మంత్రుల వరకు జీవో 111 పరిధిలోభూములను కొనుగోలు చేశారు. రాష్ట్ర మంత్రివర్గంలో కీలక పాత్ర పోషిస్తున్న ఐదుగురు మంత్రులకు పెద్ద ఎత్తున భూములు ఉన్నాయి. కొందరు ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, ప్రస్తుత ఎంపీలు వందల ఎకరాల భూమి ఫాంహౌజ్‌ల రూపంలో ఉంచుకున్నారు. అధికార పక్షమే కాకుండా ప్రతిపక్షానికి చెందిన ప్రజాప్రతినిధులకు కూడా భారీగా భూములు ఉన్నాయి. గత ఏడాది ఒక ఎంపీ వందల ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈ ఏడాదిలోనూ అధికార పార్టీకి చెంది న కొందరు ప్రజా ప్రతినిధులు పదుల ఎకరాల నుంచి వందల ఎకరాలు కొన్నారు. అంటే వీరికి 111 జీవోను ఎత్తేస్తారని సమాచారం ముందుగానే ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రముఖులంతా జీవో 111 పరిధిలోనే వేల ఎకరాల భూములు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న మొయినాబాద్, శంకర్‌పల్లి, చేవెళ్ల, గండిపేట, శంషాబాద్, షాద్‌నగర్, షాబాద్ మండలాల్లో రాజకీయ నేతలతో పాటు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున భూములు కలిగి ఉన్నా రు. పేరుమోసిన సినీ నిర్మాతలు, దర్శకులకు సైతం ఈ జీవో పరిధిలో పట్టా భూములున్నాయి.
ఎంపీకి 650 ఎకరాలు
అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీకి ఏకంగా 650 ఎకరాలు భూమి ఉంది. ఈ ఎంపీ గత ఏడాదే వందల ఎకరాల భూములను 111 జీవో పరిధిలో కొనుగోలు చేశారని విశ్వసనీయ సమాచారం. మరోవైపు బీఆర్‌ఎస్‌కే చెందిన ఒక ఎమ్మెల్సీకి 600 ఎకరాల భూమి ఉన్నట్లు సమాచారం. మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా వందల ఎకరాల్లో ఇక్కడ భూములు కలిగి ఉన్నారు. ఈ ప్రజా ప్రతినిధులు సీలింగ్ యాక్ట్ పరిధిలోకి రాకుండా ముందు జాగ్రతగా వారి కుటుంబ సభ్యులు, బినామీల పేర్లమీద రిజిస్ట్రేషన్ చేయించారు. షాబాద్ మండల పరిధిలో ఓ మంత్రిదాదాపు 50 ఎకరాలకు పైగా భూమి కొనుగోలు చేశారు.
ధరణి పోర్టల్‌లో వీరి పేర్లు కనిపించకుండ లాక్
గ్రామాల వారీగా ప్రభుత్వ భూమి ఎంత? పట్టా భూమి ఎంత? అని తెలుసుకునేందుకు ధరణిలో ఆప్షన్ ఉంది. ఏ సర్వే నెంబరులో ఎంత భూమి ఉంది. అది ఎవరి పేరునా ఉందో కూడా తెలుసుకోవచ్చు. దీంతో పాటు ప్రైవేట్ ప్రైవసీ ఆప్షన్‌తో యజమాని తన భూమి వివరాలు ధరణిలో కనిపించకుండాపెట్టుకోవచ్చు. రాజకీయ ప్రముఖులు, అధికారులు, సినీ ప్రరిశ్రమకు చెందిన వ్యక్తులు ప్రైవేట్ ప్రైవసీ ద్వారా సర్వే నెంబరు, భూమి విస్తీర్ణం, యజమాని పేరు ధరణి పోర్టల్‌లో కనిపించ కుండా పెట్టుకుంటున్నారు.
ఏ గ్రామం చూసినా పెద్దల చేతుల్లోనే భూమి
జీవో 111 పరిధిలోని గ్రామాల్లో రైతుల చేతుల్లో కేవలం 30% భూమి మాత్రమే ఉంది. ఇక్కడ ఉన్న భూముల్లో అగ్రభాగం ఎవరి చేతుల్లో ఎంతెంత ఉందో ‘‘ఆంధ్రజ్యోతి’’ తెలుసుకునే ప్రయత్నం చేసింది. అందు లో భాగంగా కొన్ని ఎంపిక చేసిన గ్రామాలను పరిశీలించగా తెలిసిన సమాచారం ఇది. మొయినాబాద్ మండలంలో 48,335 ఎకరాల భూమి ఉంటే 75% భూమి వీఐపీల చేతుల్లో ఉంది. ఈ మండలంలోని తొల్‌కట్ట గ్రామంలో 2066 ఎకరాల భూమి ఉంటే, అందులో అటవీ, గ్రామ కంఠం, ప్రభుత్వ భూమి, అసైన్ట్ భూమి పోను మిగిలిన భూమిలో 90% పెద్దల చేతుల్లోనే ఉంది. పెద్దమంగళారం, రెడ్డిపల్లి గ్రామాల్లో 8–10% భూమి మాత్రమే రైతుల చేతుల్లో ఉంది. చేవెళ్ల మండలం ముడిమ్యాల, రావులపల్లి, కమ్మెట, ఎన్నెపల్లి, ఈర్లపల్లి గ్రామాల్లోని 75–80% భూమి రియాల్టర్ల చేతుల్లో ఉంది. రాష్ట్రంలోనే ప్రముఖ రియల్టర్ 150 ఎకరాల భూమి కలిగి ఉన్నారు. శంకర్‌పల్లి, చేవెళ్ల మండలాల పరిధిలోని 7 గ్రామాల్లో మరో రియల్ ఎస్టేట్ సంస్థ 350 ఎకరాలకు పైగా కలిగి ఉంది. శంకర్‌పల్లి మండలం మహరాజ్‌పేట, జన్వాడ గ్రామాల్లో 3350 ఎకరాల భూమిలో వీఐపీలు, సినీ హీరోలు, రియల్టర్లు దాదాపు 80% భూమిని కలిగి ఉన్నారు. బడా బాబులు కొనుగోలు చేసిన ఈ భూముల్లో కొన్నింటిని దశాబ్దాల క్రితమే కొనుగోలు చేయగా.. 111జీవో రద్దు చేస్తారనే విషయం తెలిశాక కొనుగోలు చేసిన వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారని సమాచారం. .రైతుల వద్ద ఎకరం నుంచి ఐదెకరాల లోపులోనే ఎక్కువుగా ఉంది. భూములకు భారీగా విలువ రావడంతో వాళ్లు కూడా సంతోషంగానే ఉన్నారు.
గచ్చిబౌలి సంగతేంటి?
111 జీవో పరిధిలో లక్ష ఎకరాలు అందుబాటులోకి వచ్చాక గచ్చిబౌలి చుట్టుపక్కల ఐటీ ప్రధానంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ పరిసరాల్లో ఎక్కడ చూసినా గజం లక్ష రూపాయల విలువ పలుకుతోంది. పైగా రియల్ ఎస్టేట్ సంస్థలు భారీగా బహుళ అంతస్తుల భవనాలను చేపట్టాయి. లక్ష ఎకరాలు అందుబాటులోకి వచ్చాక వీటి పరిస్థితి ఏంటనేది
రేపటి కథనం...!