సద్విమర్శలకు చిరునామా కృష్ణారావు
ABN , First Publish Date - 2023-04-17T02:08:10+05:30 IST
సద్విమర్శలు, సానుకూల దృక్పథంతో కూడిన పాత్రికేయానికి అప్పరాసు కృష్ణారావు చిరునామా అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కృష్ణారావు రాసిన ‘ఇండియా గేట్’ వ్యాసాలను ఇష్టపడతానని చెప్పారు.

ఆయన ‘ఇండియా గేట్’ వ్యాసాలంటే ఇష్టం: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య
ఆంధ్రజ్యోతి అసోసియేట్ ఎడిటర్ కృష్ణారావుకు గోరాశాస్త్రి పురస్కారం ప్రదానం
తెలుగులో మంచి వ్యాసాలను ప్రచురించే ఏకైక పత్రిక ‘ఆంధ్రజ్యోతి’: రామచంద్రమూర్తి
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్16 (ఆంధ్రజ్యోతి): సద్విమర్శలు, సానుకూల దృక్పథంతో కూడిన పాత్రికేయానికి అప్పరాసు కృష్ణారావు చిరునామా అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కృష్ణారావు రాసిన ‘ఇండియా గేట్’ వ్యాసాలను ఇష్టపడతానని చెప్పారు. కృష్ణారావు అభిప్రాయాలతో ఏకీభవించకపోయినా, ఉన్నత ప్రమాణాలకు లోబడి ఉండే ఆయన వ్యాసాలను ఇష్టపడతానని వివరించారు. ఆయా వ్యాసాల్లో తన మీద కూడా విమర్శలు ఉన్నాయని, విమర్శలను స్వీకరించడమే ప్రజాస్వామ్య ప్రథమ లక్షణమని వెంకయ్య పేర్కొన్నారు. ‘నవ సాహితీ ఇంటర్నేషనల్, చెన్నై’ ఆధ్వర్యంలో సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, కవి, ఆంధ్రజ్యోతి అసోసియేట్ ఎడిటర్ కృష్ణారావుకు ‘గోరా శాస్త్రి ఉత్తమ జర్నలిస్టు పురస్కారాన్ని’ వెంకయ్య నాయుడు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంపదను రూపాయల్లోగాక అక్షరాల్లో నిక్షిప్తం చేసిన సంపాదకుడు గోవిందు రామశాస్త్రి (గోరా శాస్త్రి) స్మారక పురస్కారాన్ని కృష్ణారావుకు అందజేయడం ముదావహమని ఆయన అన్నారు. తెలుగులో మంచి వ్యాసాలను ప్రచురించే ఏకైక పత్రిక ‘ఆంధ్రజ్యోతి’ మాత్రమేనని సీనియర్ జర్నలిస్టు కె. రామచంద్రమూర్తి ఈ సందర్భంగా శ్లాఘించారు. ఆంధ్రజ్యోతిలో ప్రచురితమయ్యే కృష్ణారావు ‘ఇండియాగేట్’, కె.శ్రీనివాస్ ‘సందర్భం’, వేమూరి రాధాకృష్ణ ‘కొత్త పలుకు’ కాలమ్స్ తప్పనిసరిగా చదవాల్సినవని తెలిపారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ జాతీయ రాజకీయాలతో పాటు బాబ్రీ మసీదు వంటి ఘటనలను రిపోర్టు చేయడంలో కృష్ణారావు పాత్ర అద్వితీయమైనదని అభినందించారు. ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్ మాట్లాడుతూ.. పాండిత్యాన్ని, పరిశీలనలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడం, మనసులోని ఉద్వేగాలను ఏదో ఒక పద్ధతిలో వ్యక్తం చేయడం గోరా శాస్త్రి నుంచి పాత్రికేయులు నేర్చుకోవాల్సిన విషయాలని అన్నారు. కృష్ణారావు రచనాశైలి గొప్పదని ప్రశంసించారు. ఇక, పురస్కార గ్రహీత కృష్ణారావు మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు అతీతంగా, నేతలను విమర్శిస్తూ, నిష్పక్షపాతంగా సంపాదకీయాలు రాసిన ఆదర్శ సంపాదకుడు గోరా శాస్త్రి స్మారక పురస్కారాన్ని అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. ది హిందూ డిప్యూటీ ఎడిటర్ ఆర్ రవికాంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్‌వీ సూర్యప్రకాశరావు, మా శర్మ, గోరా శాస్త్రి కుమార్తె సునందశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.