Telangana New Secretariat : మయసభను తలపిస్తున్న తెలంగాణ సచివాలయం.. ఒక్కసారి ఈ ఫొటోలు చూస్తే...
ABN , First Publish Date - 2023-01-27T19:11:16+05:30 IST
తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ భవన నిర్మాణం (Dr BR Ambedkar) చివరి దశకు చేరుకుంది..
తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ భవన నిర్మాణం (Dr BR Ambedkar) చివరి దశకు చేరుకుంది. తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతిబింబంగా హైదరాబాద్‌లో ఈ నిర్మాణం జరుగుతోంది. తుదిమెరుగులు పూర్తయితే.. సచివాలయం ఎలా ఉంటుంది..? భవనంలోపల ఏమేం ఉన్నాయి..? ఇందులో ఏవేవి సచివాలయానికి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవబోతున్నాయ్..? అని తెలుసుకోవాలని జనాల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో నిర్మాణం పూర్తయితే ఎలా ఉంటుందో తెలిపేలా కొన్ని నమూనా చిత్రాలను భవన డిజైన్ రూపొందించిన ఆస్కార్ అండ్ పొన్ని ఆర్కిటెక్ట్స్ సంస్థ (oscar and ponni architects) రిలీజ్ చేసింది.
తెలంగాణ కొత్త సచివాలయం ఫొటోల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..
ఇలా ఉంటుంది..!
భాగ్యనగరం (Hyderabad) నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్ తీరంలో తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం నిర్మాణం (Telangana Secretariat) జరుగుతోంది. చారిత్రాత్మక నిర్మాణ శైలితో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం నిర్మిస్తోంది. గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు ఆరు అంతస్తుల్లో సచివాలయ ప్రధాన భవన నిర్మాణం జరుగుతోంది. ఏయే అంతస్థుల్లో ఏమేం ఉంటాయనేదానిపై పూర్తి వివరాలు సంస్థ చెప్పలేదు. మధ్యలో భవనం పైన ఐదు అంతస్థుల మేర భారీ గుమ్మటాలతో కూడిన సెంట్రల్ టవర్స్ నిర్మాణం జరుగుతోంది. సచివాలయం ప్రాంగణం మొత్తం విస్తీర్ణం 26.98 ఎకరాలు.
మయసభను తలపించేలా..!
వాస్తు దోషాలను నివారించి.. దీర్ఘ చతురస్రాకారంలో 20 ఎకరాల్లో కాంప్లెక్స్ నిర్మాణాన్ని చేపడుతోందని చెన్నైకి చెందిన ఆర్కిటెక్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. అతిథుల కోసం నిర్మిస్తున్న ఈ పోర్టీకో టవర్స్‌ను.. ఆర్నమెంటల్ డోమ్స్, కార్వింగ్స్‌తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతోంది తెలంగాణ సర్కార్. భవనంపై మొత్తం 34 గుమ్మటాలు ఏర్పాటు చేస్తోంది. తూర్పు, పశ్చిమ వైపుల్లో భవనం మధ్యలో రెండు అతిపెద్ద గుమ్మటాలు, వాటిపై జాతీయ చిహ్నాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 150 ఏళ్లు నిలిచేలా, ప్రకంపనలు తట్టుకునేలా డిజైన్ చేసింది నిర్మాణ సంస్థ. నీలకంఠేశ్వరాలయం, వనపర్తి ప్యాలెస్, సారంగాపూర్ హనుమాన్ (Hanuman Temple) ఆలయం స్ఫూర్తిగా సచివాలయం నిర్మాణం సాగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. సచివాలయం మయసభను తలపించేలా ఉందని చెప్పుకోవచ్చు. మీటింగ్ హాల్, డైనింగ్ హాల్ ఇవన్నీ అదిరిపోయేలా ఉన్నాయి. మరీ ముఖ్యంగా.. సచివాలయం చుట్టూ గ్రీనరీ మాత్రం అదిరిపోయింది. సచివాలయం ప్రాంగణంలోనే.. హెలీప్యాడ్ కూడా ఉంది. సచివాలయం ముందు, వెనుక భాగాలు ఎలా ఉంటాయి.. మొత్తం ఏరియల్ వ్యూ ఎలా ఉంటుందనేది ఈ చిత్రాల్లో మనం చూడొచ్చు.
రూపు రేఖలు మారిపోతున్నాయ్..!
సాగర తీరంలో, సచివాలయం ముందున్న లుంబినీపార్కు, ఉత్తర భాగంలో ఉన్న ఎన్టీఆర్ గార్డెన్ (Ntr Garden), ఆ పక్కనే నిర్మాణం అవుతున్న భారీ అంబేద్కర్ విగ్రహం, లుంబినీ పార్కు పక్కనే నిర్మాణంలో అమరవీరుల స్థూపం.. ఇలా అన్నింటి రూపురేఖలను సమూలంగా మార్చేలా హెచ్‌ఎండీఏ (HMDA) కార్యాచరణ రూపొందించింది. హుస్సేన్‌సాగర్ (Hussain Sagar) జలాల్లో నూతన సచివాలయం ప్రతిబింబం స్పష్టంగా కనిపించేలా నిర్మాణం జరిగింది. అంతేకాకుండా.. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా సాగర తీరం కొలువై ఉండాలని ఇప్పటికే అధికారులను కేసీఆర్ ఆదేశించారు. ప్రస్తుతం సచివాలయం చుట్టు ఉన్న ప్రాంతాలను సరికొత్తగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా హెచ్‌ఎండీఏ భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకోసం సచివాలయం చుట్టు పక్కల ఉన్న ప్రదేశాలన్నింటినీ సమూలంగా మార్చేస్తూ సరికొత్త ల్యాండ్ స్కేపింగ్‌తో (Landscaping) పార్కులను, ఇతర ఆకర్షణీయమైన ప్రదేశాలను తీర్చిదిద్దాల్సి ఉంది.
కోట్లు పెరిగిపోయాయ్..!
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నట్లు చెబుతున్న నూతన సచివాలయం, అంబేడ్కర్ విగ్రహం, అమరుల చిహ్నాల నిర్మా ణం ఏళ్ల తరబడి ఆలస్యం కావడంతో వీటి నిర్మాణ ఖర్చు, నిర్ణయం తీసుకున్ననాటితో పోలిస్తే నేడు భారీగా పెరిగిపోయింది. వాస్తవానికి కొత్త సెక్రటేరియట్‌ను నిర్మించాలని తలపెట్టినప్పుడు కేవలం రూ.400 కోట్లు సరిపోతాయని కేసీఆర్ సర్కార్ భావించింది. అయితే.. టెండర్ల (Tenders) సమయానికి ఆ వ్యయాన్ని రూ.619కోట్లకు పెంచింది. ఆ తర్వాత మళ్లీ ధరలు పెరిగాయన్న కారణంతో రూ.800 కోట్లకు ఆ మొత్తాన్ని చేర్చింది. అయితే.. ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణ పనులన్నీ పూర్తయ్యే నాటికి రూ.1350 కోట్ల మేర నిధులు ఖర్చు కావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
టీటీడీతో ఒప్పందం..
నూతన సచివాలయంలో తిరుపతి శిల్పాలు కొలువు దీరనున్నాయి. గణపతి, సుబ్రహ్మణ్యస్వామి, అభయాంజనేయస్వామి, సింహ, నంది విగ్రహాలతో పాటు శివలింగం తదితర రాతి శిల్పాలు తయారు చేసి అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం టీటీడీని కోరింది. అంగీకరించిన టీటీడీ (TTD) తిరుపతిలోని ఎస్వీ సాంప్రదాయ ఆలయ నిర్మాణ, శిల్పకళా సంస్థ ద్వారా ఆరు విగ్రహాలు తయారు చేసి అందజేసేలా ఒప్పందం కుదుర్చుకుంది. ఆ మేరకు తిరుపతిలోని (Tirupati) టీటీడీ శిల్ప కళాశాల ప్రాంగణంలో సంబంధిత దేవతా మూర్తుల శిల్పాలు శరవేగంగా రూపు దిద్దుకుంటున్నాయి. దీనికోసం తమిళనాడులోని (Tamilnadu) కంచి ప్రాంతంలో లభ్యమయ్యే కృష్ణశిలలను తెప్పించింది.
ముహూర్తం ఖరారు..
సచివాలయ భవన ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. వేద పండితుల సూచన మేరకు ఫిబ్రవరి 17న ఉదయం 11.30 గంటల నుంచి 12.30 గంటల మధ్య సీఎం కేసీఆర్ చేతులమీదుగా భవన ప్రారంభం జరగనుంది. ఇదే రోజు సీఎం కేసీఆర్ పుట్టిన రోజు (KCR Birth Day) కూడా. ప్రారంభోత్సవానికి ముందు ఉదయం వేద పండితుల ఆధ్వర్యంలో వాస్తుపూజ, చండీయాగం, సుదర్శనయాగం తదితర పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. ప్రారంభోత్సవం రోజు మధ్యాహ్నం సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్‌లో భారీ బహిరంగసభ నిర్వహించనున్నారు. ఈ ప్రారంభోత్సవానికి.. తమిళనాడు, జార్ఖండ్ ముఖ్యమంత్రులు స్టాలిన్ (CM Stalin), హేమంత్‌సోరెన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీయాదవ్ (Tejeswi Yadav), బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌తో (Nitish Kumar) పాటు పలువురు ప్రముఖులు పాల్గొంటారని తెలుస్తోంది.