TSPSC: మీ చేతగానితనం మా కుట్రా?

ABN , First Publish Date - 2023-03-20T02:17:27+05:30 IST

‘పరీక్షలు పక్కాగా నిర్వహించలేని మీ చేతగానితనాన్ని మా కుట్ర అంటారా? అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి..రాష్ట్ర మంత్రి కేటీఆర్‌పై ధ్వజమెత్తారు.

TSPSC: మీ చేతగానితనం మా కుట్రా?

మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలు దివాళాకోరుతనానికి నిదర్శనం: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): ‘పరీక్షలు పక్కాగా నిర్వహించలేని మీ చేతగానితనాన్ని మా కుట్ర అంటారా? అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి..రాష్ట్ర మంత్రి కేటీఆర్‌పై ధ్వజమెత్తారు. ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు వల్లే టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాలు లీక్‌ అయ్యాయని కేటీఆర్‌ వ్యాఖ్యపై మండిపడ్డారు. ‘మాకేం సంబంధమని తప్పించుకోవడం మంచిది కాద’ని హితవు పలికారు. ‘రాష్ట్రంలో అధికారంలో ఉన్నది మీరు.. అవినీతిపరులకు కొమ్ముగాస్తూ వ్యవస్థను నడుపుతున్నది మీరు..దోషులను శిక్షించాలని తెలంగాణ సమాజం డిమాండ్‌ చేస్తుంటే మాకేం సంబంధం అనడం దివాళాకోరుతనమే’ అని విమర్శించారు. హైకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తి ఆధ్వర్యంలో విచారణ జరిపితే ఇద్దరు తప్పు చేశారా? ముగ్గురు చేశారా? అన్నది తేలుతుందన్నారు.

ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో కిషన్‌‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్రానికి ఏదైనా మంచి జరిగితే తమ వల్లేనని తండ్రీకొడుకులు ప్రచారం చేసుకుంటారని, తప్పు జరిగితే బీజేపీ కుట్ర అని ఎదురుదాడి చేస్తారని సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌లపై మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్‌‌స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారిస్తే కేంద్ర ప్రభుత్వానికేం సంబంధమని ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబం ఇక్కడ మద్యం మాఫియాకు కొమ్ముగాస్తుందని తెలుసుగానీ, ఢిల్లీలో లిక్కర్‌ దందా చేస్తుందని సీబీఐ దర్యాప్తులో వెల్లడయ్యేదాకా తమకు కూడా తెలియదన్నారు. అబద్ధాలకు ప్రతిరూపం కల్వకుంట్ల కుటుంబమని విమర్శించారు. మహిళలను దర్యాప్తు సంస్థల కార్యాలయాల్లో విచారించరాదన్న వాదనను తొలిసారిగా వింటున్నానని అన్నారు.

ఒక్క మహిళా మంత్రి కూడా లేకుండా ఐదేళ్ల పాటు క్యాబినెట్‌ను కొనసాగించిన ఘన చరిత్ర బీఆర్‌ఎస్‌దని విమర్శించారు. ప్రధాని మోదీ వచ్చే నెలలో రాష్ట్రంలో పర్యటిస్తారని కిషన్‌రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ, పలు జాతీయ రహదారుల పనులకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి రాగానే వరంగల్‌లో విమానాశ్రయం ఏర్పాటు చేస్తామన్నారు. కాగా, ఇటీవల అగ్నిప్రమాదం జరిగిన సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ను కిషన్‌రెడ్డి పరిశీలించారు.

Updated Date - 2023-03-20T02:17:27+05:30 IST