Kaleshwaram : కాళేశ్వరం.. రివర్స్‌!

ABN , First Publish Date - 2023-07-29T03:23:57+05:30 IST

‘‘ఏటా నాలుగు వేలకుపైగా టీఎంసీల గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలిసి పోతున్నాయి. వాటిని ఒడిసి పట్టుకుంటే తెలంగాణ భూములు సస్యశ్యామలమే. అందుకే, ఆ గోదావరి జలాలను ఒడిసి పట్టుకునేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును కట్టుకుంటున్నాం. దీని ద్వారా ఏటా దాదాపు 200 టీఎంసీలను ఎత్తిపోసుకుంటాం’’

 Kaleshwaram : కాళేశ్వరం.. రివర్స్‌!
Kaleshwaram

  • పైకి ఎత్తి పోయాల్సిన సమయంలో గోదావరి నీళ్లన్నీ కిందికి

  • బిజీగా ఉండాల్సిన సమయంలో బజ్జుంటున్న బాహుబలి మోటార్లు

  • ప్రాజెక్టు కట్టక ముందు, తర్వాత 4,000 టీఎంసీలు సముద్రంలోకే

  • ఐదేళ్లలో వెయ్యి టీఎంసీలకూ నికర వినియోగం కేవలం 50 టీఎంసీలే

  • అవన్నీ మెదక్‌ జిల్లాలోని రిజర్వాయర్లలో నిల్వ, సాగుకే వినియోగం

  • ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూపకల్పనలో రివర్స్‌ ఇంజనీరింగ్‌ బూమె‘రాంగ్‌’

హైదరాబాద్‌, జూలై 28 (ఆంధ్రజ్యోతి): ‘‘ఏటా నాలుగు వేలకుపైగా టీఎంసీల గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలిసి పోతున్నాయి. వాటిని ఒడిసి పట్టుకుంటే తెలంగాణ భూములు సస్యశ్యామలమే. అందుకే, ఆ గోదావరి జలాలను ఒడిసి పట్టుకునేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును కట్టుకుంటున్నాం. దీని ద్వారా ఏటా దాదాపు 200 టీఎంసీలను ఎత్తిపోసుకుంటాం’’ అని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టక ముందు.. కట్టిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. విచిత్రం ఏమిటంటే, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టక ముందు.. కట్టిన తర్వాత కూడా అక్కడి నుంచి దాదాపు 4000 టీఎంసీల గోదావరి జలాలు వృథాగా కిందికి పోతూనే ఉన్నాయి. చివరికి, సముద్రంలో కలుస్తూనే ఉన్నాయి. అంతేనా, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ఐదేళ్లయింది. ఈ ఐదేళ్లలో కూడా ఏటా దాదాపు 4000 టీఎంసీల వరద పోటెత్తింది. నీటికి ఏమాత్రం కొదవ లేదు కనక.. ఈ ఐదేళ్లలో ప్రభుత్వం చెప్పినట్లు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి దాదాపు వెయ్యి టీఎంసీలను ఎత్తి పోసి ఉండాలి! వాటిని రిజర్వాయర్లలో నింపి ఉండాలి! తద్వారా, కోటి ఎకరాలు సస్యశ్యామలమై ఉండాలి! గోదావరికి వరద పోటెత్తుతున్న ప్రస్తుత సమయంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రోజుకు 2 టీఎంసీలను ఎత్తి పోస్తూ.. రిజర్వాయర్లను నింపుతూ ఉండాలి! కానీ, వాస్తవంలో ఏటా అందుకు పూర్తి భిన్నంగా జరుగుతోంది! వరద పోటెత్తుతున్నప్పుడు గోదావరి నీటిని ఎత్తి పోయడానికి బదులుగా ఎత్తి పోసిన నీటిని కిందికి వదిలేస్తున్నారు! వరద పోటెత్తుతున్న సమయంలో నీటిని ఎత్తునకు ఎత్తి పోస్తూ బిజీ బిజీగా ఉండాల్సిన బాహుబలి మోటార్లన్నీ గుర్రు పెట్టి మరీ బజ్జుంటున్నాయి! వరదల సమయంలో కింది నుంచి పైకి రావాల్సిన నీరు.. పైనుంచి కిందికి జారిపోతోంది! వరద పోటెత్తినప్పుడు నీటిని ఎత్తిపోయని ఈ ప్రాజెక్టును దాదాపు లక్ష కోట్ల రూపాయలతో ఎందుకు నిర్మించారో అర్థం కాని పరిస్థితి! కింది నుంచి తెలంగాణలోనే ఎత్తయిన ప్రదేశానికి నీటిని ఎత్తి పోస్తారు కనక ముఖ్యమంత్రి కేసీఆర్‌ డిజైన్‌కు ‘రివర్స్‌ ఇంజనీరింగ్‌’గా పేరు పెట్టారు! ఎత్తి పోయాల్సిన సమయంలో కిందికి వదిలేయడం ద్వారా.. ఎత్తి పోసిన నీటిని మళ్లీ గోదావరిలోకే తరలించడం ద్వారా ఇప్పుడు ఇది నిజంగానే ‘రివర్స్‌’ ఇంజనీరింగ్‌గా పేరు తెచ్చుకుంటోంది. గోదావరికి కొత్త నడకలు నేర్పుతుందని అభివర్ణించిన ప్రాజెక్టు.. అందుకు భిన్నంగా గోదారి బాటలోనే సాగుతోంది. ఇప్పటి వరకూ ఈ ప్రాజెక్టు సాధించిన అతి గొప్ప ప్రయోజనం ఏమిటంటే.. మెదక్‌ జిల్లాలోని రంగనాయక్‌ సాగర్‌, కొండ పోచమ్మ సాగర్‌, మల్లన్న సాగర్‌లలో 25 టీఎంసీల వరకూ నిల్వ చేయడమే! మరో 25 టీఎంసీల వరకూ సాగుకు నీటిని అందించడమే! నిజానికి, ఐదేళ్లలో దాదాపు వెయ్యి టీఎంసీలను ఎత్తి పోయాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటి వరకూ ఎన్ని గోదావరి నీళ్లను ఎత్తి పోసిందో తెలుసా!? కేవలం 168 టీఎంసీలు! ఇందులో మళ్లీ దాదాపు 118 టీఎంసీలను తిరిగి గోదావరిలోకే వదిలేశారు. మిగిలిన 50 టీఎంసీల్లో సగం రిజర్వాయర్లలో ఉంటే సగం సాగుకు వినియోగించారు. మరీ ముఖ్యంగా, శ్రీరాం సాగర్‌ పునరుజ్జీవన పథకంలో భాగంగా 2.5 టీఎంసీలను మేడిగడ్డ బ్యారేజీ నుంచి ఎత్తిపోశారు. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో ఆ నీటిని కూడా ఇప్పుడు గోదావరిలోకి వదిలేశారు. అంతేనా, జూన్‌ 21వ తేదీ నుంచి కాళేశ్వరం నుంచి పంపింగ్‌ ప్రారంభమైంది. రోజుకు అర టీఎంసీ చొప్పున దాదాపు ఏడు టీఎంసీలను ఎత్తి పోశారు. మానేరుకు దిగువన ఉన్న రిజర్వాయర్లలో కొంతమేర నీరుండగా.. శ్రీరాంసాగర్‌, శ్రీపాద ఎల్లంపల్లి సాగర్‌, సుందిళ్ల, అన్నారంలలో ఎత్తిపోసిన నీరంతా గోదావరిలోకి తిప్పి పంపించేయాల్సిన పరిస్థితి.

ఎస్సారెస్పీ జలకళ కేసీఆర్‌ ఖాతాలోనేనటా..

‘ఎస్సారెస్పీకి జలకళ కేసీఆర్‌తోనే సాధ్యమైంది’.. ఈ మాటలన్నది ఎవరో కాదు.. రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి. ఎస్సారెస్పీని నిర్మించి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈనెల 26న ప్రాజెక్టు వద్ద జరిగిన వేడుకల్లో ఆయన నోటి నుంచి ఈ మాటలు వచ్చాయి. వాస్తవానికి, ఎస్సారెస్పీ నిర్మాణం 60 ఏళ్ల కిందటే జరగ్గా.. రెండో దశలో 10 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే పనులు 80 శాతానికిపైగా ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తయ్యాయి. ఎస్సారెస్పీ రెండో దశకు రూ.1,194 కోట్లు వ్యయం కాగా.. అందులో 2014 జూన్‌ 2వ తేదీ నాటికి రూ.887.95 కోట్లను ఉమ్మడి రాష్ట్రంలోనే ఖర్చు పెట్టారు. మిగిలిన రూ.306 కోట్లను తొమ్మిదేళ్లలో ఖర్చు చేశారు. కానీ, ఎస్సారెస్పీ పనులన్నీ కేసీఆర్‌ వల్లే పూర్తయినట్లు మంత్రి బిల్డప్‌ ఇచ్చారు. అంతేనా.. ఎస్సారెస్పీ పూర్తిస్థాయి సామర్థ్యం 90.300 టీఎంసీలు. అందులో కాళేశ్వరం నుంచి ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం కింద ఎత్తిపోసిన నీళ్లు కేవలం 2.5 టీఎంసీలు మాత్రమే. ఈనెల 26వ తేదీకే (మంత్రి వేముల ప్రకటన వచ్చేనాటికి) అందులో 72 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కానీ, ఎస్సారెస్పీ నిండడానికి 2.50 టీఎంసీలు కారణమనేలా అధికార పార్టీ ప్రచారం ఉంది. నిజానికి, ఆ రెండున్నర టీఎంసీలు కూడా గురువారంనాటి వరదతో గోదావరి పాలైంది.

కాళేశ్వరం నిరర్థక ప్రాజెక్టు..

- పొన్నాల లక్ష్మయ్య,

నీటిపారుదల శాఖ మాజీ మంత్రి

కాళేశ్వరం నిరర్ధక ప్రాజెక్టు. దీని నుంచి ఎత్తిన నీటికన్నా ఎల్లంపల్లి నుంచి పోయిన నీరే అధికం. కేవలం కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ప్రాణహిత- చేవెళ్ల నుంచి గ్రావిటీ ద్వారా తరలించే అవకాశం ఉన్నా.. కిందికి వెళ్లి అత్యంత ఖరీదైన ఎత్తిపోతల పథకాలతో నీటిని తరలించి.. వరదల సమయంలో నీటిని మళ్లీ దిగువకు వదిలిపెట్టడం తప్ప మరే ప్రయోజనం లేదు.

రూ.75 కోట్ల విద్యుత్తు ఖర్చు వృథా

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ఒక్క టీఎంసీ నీటిని ఎత్తిపోయాలంటే దూరాన్ని బట్టి వ్యయం పెరుగుతుంది. ఈ ఏడాది 7 టీఎంసీలు ఎత్తి పోశారు. మేడిగడ్డ నుంచి కొండపోచమ్మసాగర్‌కు ఒక టీఎంసీ నీటిని తరలించాలంటే రూ.50 కోట్ల విద్యుత్‌ బిల్లు అవుతుంది. అదే మిడ్‌ మానేరుకు రూ.25 కోట్లు, ఎల్లంపల్లికి రూ.12 కోట్లు, మల్లన్న సాగర్‌కు రూ.40 కోట్లు, శ్రీపాద ఎల్లంపల్లికి రూ.12 కోట్లు అవుతుంది. ఎస్సారెస్పీకి పునరుజ్జీవన పథకం కింద 2.5 టీఎంసీలు తరలించగా.. ఒక టీఎంసీకి రూ.30 కోట్ల చొప్పున ఆ నీళ్ల వ్యయం రూ.75 కోట్లు కరెంట్‌ బిల్లులకే కట్టాల్సి ఉంటుంది.

Updated Date - 2023-07-29T03:23:57+05:30 IST