రామ రామ.. గోవిందా గోవిందా

ABN , First Publish Date - 2023-06-26T00:56:17+05:30 IST

రాష్ట్ర ఆవిర్భావం జరిగి దశాబ్దమైంది. కేసీఆర్‌ రెండుసార్లు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. మరోసారి ఎన్నికల రణరంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చిన పలు హామీలు ఇప్పుడు ప్రస్తావనకొస్తున్నాయి.

రామ రామ.. గోవిందా గోవిందా

04kmm20templesstory.jpgఎర్రుపాలెం మండలంలోని జమలాపురం వేంకటేశ్వరాలయం

భద్రాద్రి అయోధ్య అయ్యేదెన్నడో?

జమలాపురం తెలంగాణ తిరుపతిగా మారేదెప్పుడో?

మాటలుగానే మిగిలిన సీఎం హామీలు

దేవస్థానాల అభివృద్ధి కోసం ఎదురుచూస్తున్న భక్తులు

ఖమ్మం, జూన 25 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): రాష్ట్ర ఆవిర్భావం జరిగి దశాబ్దమైంది. కేసీఆర్‌ రెండుసార్లు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. మరోసారి ఎన్నికల రణరంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చిన పలు హామీలు ఇప్పుడు ప్రస్తావనకొస్తున్నాయి. అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సీఎం కేసీఆర్‌ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఇచ్చిన హామీల్లో కొన్ని కొన్ని నెరవేర్చినా.. ప్రధానమైనవి మరికొన్ని మిగిలేఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రెండు ప్రముఖ పుణ్యక్షేత్రాల అభివృద్ధికి ఆయన ఇచ్చిన హామీలు కార్యరూపం దాల్చని పరిస్థితి. ప్రముఖ రామక్షేత్రమైన భద్రాచలాన్ని దక్షిణ అయోధ్యగా.. ఏపీలోని కృష్ణా జిల్లాకు సరిహద్దున ఉన్న ఎర్రుపాలెంలోని జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని తెలంగాణ తిరుపతిగా తీర్చిదిద్దుతానని చెప్పిన మాటలు మాటలుగానే మిగిలాయి. ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయని, భద్రాద్రి, జమలాపురం ఆలయాల దశ మారుతుందని భక్తులు ఎదురుచూస్తున్నా.. మోక్షం మాత్రం లభించ డంలేదు.

భద్రాద్రికి గుర్తింపేదీ?

శతబ్దాల చరిత్ర ఉన్న భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయం ఉమ్మడిరాష్ట్రంలో ఒక వెలుగు వెలిగింది. తిరుపతి తర్వాత భద్రాచలానికి వేలాది మంది భక్తులు వచ్చి సీతారామచంద్రస్వామిని దర్శించుకునేవారు. ఈ క్రమంలో కానీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పరిస్థితి మారిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి తప్ప కొత్తగా ఎలాంటి ఆలయ అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో భక్తులు ఆవేదనకు గురవుతున్నారు. దీంతో రామా.. శ్రీరామ.. జయరామ అంటూ నిత్యం రామనామంతో మారుమోగే భద్రాచలం ఆదరణకు నోచుకోవడంలేదంటూ ఆక్షేపణలు వ్యక్తం చేస్తున్నారు. దక్షిణఅయోధ్య అని పేర్కొంటున్నా.. ఆమేరకు భద్రాద్రికి ప్రాచుర్యం కల్పించలేకపోవడంతో పాటు వైకుంఠం నుంచి వెలిసిన శ్రీరాముడిగా ఎంతో విశిష్టత కలిగి ఉన్న భద్రాచలం అటు అభివృద్ధికి ఇటు గుర్తింపునకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తమవుతోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత భద్రాచలానికి మరింత గుర్తింపు వస్తుందని, దేవస్థాన అభివృద్ధి జరుగుతుందని ఆశించారు. కానీ రాష్ట్ర విభజనతో భద్రాచలం పట్టణ మినహా చుట్టుపక్కల మండలాలు గ్రామాలు ఏపీలోకి వెళ్లడం, మరోవైపు గోదావరి నది సరిహద్దుగా ఉండడంతో భద్రాచలం ఒక ద్వీపకల్పంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2015-16లో జరిగిన శ్రీరాముడి కల్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. 2017లో రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలతో పాటు భద్రాచల ఆలయ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తుందని రూ.100కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. బడ్జెట్‌లో కూడా రూ.100కోట్లు పెట్టి ఇప్పటి వరకు నిధులు మంజూరు చేయలేదు. చిన జీయర్‌ స్వామితో పాటు పలువురు శిల్పి ఆనందసాయితోపాటు అప్పటి మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కూడా వచ్చి ఈ ఆలయ అభివద్ధికి ప్రణాళిక రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం యాదగిరిగుట్ట ఆలయాన్ని ప్రముఖ పుణ్యక్షేత్రంగా పెద్దఎత్తున నిధులు కేటాయించి అబివృద్ధి చేశారు. అదేవిధంగా సరస్వతి అమ్మవారు కొలువైన బాసర ఆలయ అభివృద్ధికి కూడా నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నారు. భద్రాచల ఆలయ అభివృద్ధికి మాత్రం నిధులు కేటాయించకపోవడం, ఆలయ అభివృద్ధి పనులు చేపట్టకపోవడం, ప్రభుత్వం భద్రాద్రిపై దృష్టి సారించకపోవడంతో భద్రాద్రి ఆలయ అభివృద్ధి ఆశించిన రీతిలో ముందడుగు వేయలేకపోతోంది.

జమలాపురంపై శీతకన్ను..

ముఖ్యమంత్రి కేసీఆర్‌ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2018డిసెంబరు3న మధిరలో భారీబహిరంగసభ నిర్వహించారు. మధిర నియోజకవర్గ అభివృద్ధికి పలు హామీలు ఇచ్చిన ఆయన ఎర్రుపాలెం మండలం జమలాపురంలో కొలువుదీరిన శ్రీ వేంకటేశ్వర ఆలయాన్ని తెలంగాణ తిరుపతిగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. ఏపీలోని కృష్ణా జిల్లాకు సరిహద్దున ఉన్న జమలాపురం క్షేత్రానికి తెలంగాణ భక్తులతోపాటు ఏపీలోని పలు జిల్లాల నుంచి భక్తులు అధికసంఖ్యలో వస్తుంటారు. సాలగ్రామ శిలారూపంలో వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం కాగా.. భక్తుల ఇలవేల్పుగా.. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారమని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయానికి కూడా శతాబ్దాల చరిత్ర ఉన్నా ఆలయ అభివృద్ధికి ప్రత్యేక నిధులు లేకపోవడం, మౌలిక సదుపాయాలు లేకపోవడంతో భక్తులు తీవ్ర అసౌకర్యాలు ఎదుర్కొంటున్నారు. భక్తులు బసచేసేందుకు ఎలాంటి వసతులు లేవు. మధిరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ బహిరంగ సభ పెట్టినప్పుడుజమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ విశిష్టతను తెలుసుకుని తెలంగాణ తిరుపతిగా చేస్తానని సభలో ప్రకటించారు. తిరిగి రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా ఇప్పటి వరకు జమలాపురం ఆలయ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. తెలంగాణ తిరుపతిగా అభివృద్ధి చేసేందుకు ఎలాంటి కార్యచరణ, ప్రణాళిక సిద్ధంచేయలేదు. మరో ఐదు నెలల్లో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో జమలాపురం వెంకటేశ్వరస్వామి భక్తులు.. గత ఎన్నికల సమయంలో కేసీఆర్‌ ఇచ్చిన హామీలను గుర్తుచేసుకుంటున్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్‌ స్పందించి.. అటు భద్రాచలం.. ఇటు జమలాపురం ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని, ఈ పుణ్యక్షేత్రాలకు విశేష ప్రాచుర్యం కల్పించాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది.

Updated Date - 2023-06-26T00:56:17+05:30 IST