వైరాలో ఐక్యతారాగం

ABN , First Publish Date - 2023-01-13T23:30:19+05:30 IST

వైరా ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు ఐక్యతారాగాన్ని ఆలపించారు. ప్రస్తుత ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ తన ప్రసం గంలో నవ్వులు పూయించారు.

వైరాలో ఐక్యతారాగం
ఒకే వేదికపై రాములు నాయక్‌, మదన్‌లాల్‌, చంద్రావతి

వైరా, జనవరి 13: వైరా ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు ఐక్యతారాగాన్ని ఆలపించారు. ప్రస్తుత ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ తన ప్రసం గంలో నవ్వులు పూయించారు. మాజీ ఎమ్మెల్యే బాణోతు మదన్‌లాల్‌ తనకు బావ అని, తామిద్దరం బావబామ్మర్దులం అని అలా కాదని అంటే చంపేస్తానని అనడంతో వేదికపై ఉన్న మంత్రి హరీష్‌రావు సహా ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు ఒక్కసారిగా గొల్లున నవ్వారు. ఈ సభలో మొదట ప్రసంగించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బాణోతు చంద్రావతి వైరా లో ప్రస్తుత ఎమ్మెల్యే రాములు నాయక్‌ తనను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్నారని ఈ విధంగా ఆయన వ్యవహరిస్తారని తాను ఊహిం చలేదని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత మదన్‌లాల్‌ మాట్లాడుతూ వైరా నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌కు ఎదురు లేదని, 2018 ఎన్నికల్లో తనకు, ఎ మ్మెల్యే రాములు నాయక్‌కు ఇద్దరకు కలిపి లక్ష ఓట్లకుపైగా వచ్చాయని గణాంకాలు వివరించారు. జనసమీకరణలో తాము కూడా ముందుం టామని మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరూ ప్రకటించారు. ఆ తర్వాత మాట్లాడిన ఎమ్మెల్యే రాములునాయక్‌ సోదరి చంద్రావతి అలాగే మా బావ మదన్‌ లాల్‌ అంటూ సంబోధించారు. ఆ తర్వాత మంత్రి హరీష్‌రావు తన ప్రసం గంలో రాములునాయక్‌, మదన్‌లాల్‌పై జోకులు వేశారు. ఆయన కూడా నవ్వులు పూయించారు. మీ బావబామ్మర్దుల ఫైట్‌ మంచిగానే ఉందని, ఇ దే స్ఫూర్తితో ముందుకు సాగాలని, బీఆర్‌ఎస్‌ బలోపేతానికి కృషిచేయాలని అంటూనే మీరిద్దరు మంచిగా ఉన్నారని, కింద ఉన్న జనమే ఆగమాగం అవుతున్నారని చమత్కరించారు.

Updated Date - 2023-01-13T23:30:21+05:30 IST