Bhadradri శ్రీరామనవమి వేడుకలు.. సీతారాముల కల్యాణం..
ABN , Publish Date - Apr 06 , 2025 | 11:13 AM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం భద్రాద్రి జిల్లాల్లో పర్యటించనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో సీతారామ కల్యాణం కోసం స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచల పుణ్య క్షేత్రంలో శ్రీరామ నవమి (Sri Rama Navami) సందర్భంగా ఆదివారం సీతారాముల కల్యాణ (Sita Ramula Kalyanam) మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయాన్ని విద్యుత్ కాంతులతో ఆలంకరించారు. మిథిలా స్టేడియం (Mithila Stadium)లోని శిల్పకళాశోభితమైన కల్యాణమండపంలో ఉదయం 10.30 గంటలకు తిరుకల్యాణ మహోత్సవం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు చుట్టుప్రక్కల ప్రాంతాలనుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మధ్యాహ్నం అభిజిత్ లగ్నం (Abhijit Lagna)లో కల్యాణం జరుగుతుంది. ఈ ఉత్సవాలకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 1,800 మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేసింది. దేవస్థానం భక్తుల కోసం 2 లక్షల లడ్డూలను, 200 క్వింటాళ్ల తలంబ్రాలను పంపిణీకి సిద్ధం చేసింది. ఆర్టీసీ ఖమ్మం రీజియన్ పరిధిలో భద్రాచలానికి 197 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. సోమవారం నిర్వహించే పట్టాభిషేక మహోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ విచ్చేయనున్నారు.
Also Read..: ఒంటిమిట్ట కోదండరామ బ్రహ్మోత్సవాలు
భద్రాద్రి రామయ్యకు టీటీడీ పట్టువస్త్రాలు
కాగా శ్రీరామ నవమి సందర్భంగా ఆదివారం భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి వారికి టీటీడీ తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అధికారులు ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి పర్యటన..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం భద్రాద్రి జిల్లాల్లో పర్యటించనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో సీతారామ కల్యాణం కోసం స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. కల్యాణం అనంతరం బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన బూరం శ్రీనివాసరావు అనే సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సన్న బియ్యం పంపీణిని ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన నేపథ్యంలో సన్న బియ్యం అందుకున్న లబ్ధిదారుల ఇళ్లలో ప్రజాప్రతినిధులు భోజనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆదివారం భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామ కల్యాణానికి విచ్చేస్తున్న సీఎం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
శనివారం లబ్ధిదారుడి ఇంటిని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సహ పలువురు ఉన్నతాధికారులు పరిశీలించి పలు సూచనలు చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కాగా, దేశంలోనే మొట్టమొదటిసారిగా కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఎర్త్‌సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుకు సీఎం రేవంత్‌రెడ్డి శనివారం ఆమోదం తెలిపారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం భద్రాచలం విచ్చేస్తున్న సీఎం ఎర్త్‌సైన్సెస్ యూనివర్శిటీ మంజూరు ప్రకటన చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రి తుమ్మల ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పాలకుడు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి..
20వ విడత డబ్బుల కోసం రైతులు ఎదురుచూపు..
ఒంటిమిట్లలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు
For More AP News and Telugu News