పరిశ్రమల ఖిల్లా.. మేడ్చల్!
ABN , First Publish Date - 2023-10-30T23:29:57+05:30 IST
కరోనా సమయంలో ప్రపంచానికి వ్యాక్సిన్ అందించిన ఘనత... ప్రముఖ పరిశ్రమలకు కేంద్ర బిందువు మేడ్చల్. ఒకవైపు పట్టణ ప్రాంతాలు, మరోవైపు గ్రామీణ ప్రాంతాల కలయికతో ఉన్న నియోజకవర్గం ప్రస్తుతం అంచెలంచలుగా ఎదుగుతోంది. పారిశ్రామిక రంగంలో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. అంతే కాకుండా రాష్ట్ర రాజకీయాలను శాసించే నేతలకు పుట్టినిల్లు మేడ్చల్ నియోజకవర్గం. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన వారిలో ముఖ్యమంత్రి నుంచి పలు శాఖల మంత్రి పదవులు చేపట్టిన ఉద్దండులు ఉన్నారు. 1952 నుంచి 2018 వరకు నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించిన నేతలు స్థానికుల హృదయాల్లో నేటికీ తమ స్థానాన్ని పదిలం చేసుకున్నారు.

ప్రపంచ ప్రసిద్ధ్దిగాంచిన కంపెనీలకు నిలయం
కరోనా వ్యాక్సిన్ తయారీకి కేంద్ర బిందువు
రాష్ట్రానికి రాజకీయ ఉద్దండులనందించిన నియోజవర్గ ప్రజలు
చెన్నారెడ్డి, తూళ్ల దేవేందర్‌గౌడ్ వంటి ప్రముఖుల ప్రాతినిఽథ్యం
ఏడు సార్లు కాంగ్రెస్, నాలుగు సార్లు టీడీపీ, రెండు సార్లు టీఆర్‌ఎస్‌కు పట్టం
స్థానికేతరులను ఆదరించిన ఘనత ఇక్కడి ప్రజలకే సొంతం
శాసన సభ్యులుగా ప్రాతినిధ్యం వహించిన వారిలో వారే అధికం
అభ్యర్థుల గెలుపోటములపై పట్టణ ఓటర్ల ప్రభావం
కరోనా సమయంలో ప్రపంచానికి వ్యాక్సిన్ అందించిన ఘనత... ప్రముఖ పరిశ్రమలకు కేంద్ర బిందువు మేడ్చల్. ఒకవైపు పట్టణ ప్రాంతాలు, మరోవైపు గ్రామీణ ప్రాంతాల కలయికతో ఉన్న నియోజకవర్గం ప్రస్తుతం అంచెలంచలుగా ఎదుగుతోంది. పారిశ్రామిక రంగంలో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. అంతే కాకుండా రాష్ట్ర రాజకీయాలను శాసించే నేతలకు పుట్టినిల్లు మేడ్చల్ నియోజకవర్గం. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన వారిలో ముఖ్యమంత్రి నుంచి పలు శాఖల మంత్రి పదవులు చేపట్టిన ఉద్దండులు ఉన్నారు. 1952 నుంచి 2018 వరకు నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించిన నేతలు స్థానికుల హృదయాల్లో నేటికీ తమ స్థానాన్ని పదిలం చేసుకున్నారు.
మేడ్చల్ అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతి గాంచిన పరిశ్రమలకు నిలయంగా మేడ్చల్ నియోజకవర్గం నిలిచింది. కరోనా సమయంలో ప్రపంచానికి వ్యాక్సిన్ అందించిన జీనోమ్ వ్యాలీ వంటి అంతర్జాతీయ సంస్థలు మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నాయి. వేలాది మందికి ఉపాధితో పాటు రాష్ట్రానికి రాజకీయ ఉద్దండులను అందించిన ఘనత కూడా మేడ్చల్‌కు ఉంది. తాము నమ్మిన నాయకుడికి, పార్టీకి వెన్నంటి ఉంటారన్న పేరు మేడ్చల్ నియోజకవర్గ ఓటర్లకు ఉంది. గతంలో జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే మేడ్చల్ నియోజకవర్గ ఓటర్లు ఇచ్చిన తీర్పు వైవిధ్య భరితంగా ఉంటుందనేది స్పష్టమవుతోంది. మేడ్చల్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన వారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి పలు శాఖల మంత్రి పదవులు చేపట్టి తమ సత్తాను చాటుకున్న దాఖలాలు ఉన్నాయి. 1952 నుంచి 2018 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన అభ్యర్ధులు తమ తలరాతను మార్చుకోవటంతో పాటు నియోజకవర్గ రూపు రేఖలు మార్చారు. వీరిలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి 1978లో పోటీ చేసిన మర్రి చెన్నారెడ్డి గెలిచాక ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. దీంతో మేడ్చల్ నియోజకవర్గానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రత్యేక గుర్తింపు లభించింది. అనంతరం 1994 ఎన్నికల్లో మొదటి సారిగా తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన తూళ్ల దేవేందర్‌గౌడ్ వరుసగా మూడు సార్లు ఇక్కడి నుంచి విజయం సాధించి ఒకసారి రెవెన్యూ, మరోసారి హోం మంత్రి పదవిని చేపట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు తరువాత నెంబర్ టూ నేతగా ఎదిగారు. చెన్నారెడ్డి , దేవేందర్‌గౌడ్‌లు అభివృద్ధ్ది విషయంలో నియోజకవర్గంలో తమ కంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ వదిలి వెళ్లారు. చెన్నారెడ్డి హయాంలో నియోజకవర్గంలోని మేడ్చల్, కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీలోని జీడిమెట్ల, కాప్రా మున్సిపాలిటీ పరిధిలోని నాచారం, మౌలాలిల్లో పెద్ద పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేసి లక్షలాది మందికి ఉపాది కల్పించారు. దీంతో నియోజకవర్గం ఉపాది కేంద్రంగా మారింది. అదే విదంగా దేవేందర్ గౌడ్ హాయాములో నియోజకవర్గంలోని ప్రతీ గ్రామానికి బీటీ రోడ్డు, పాఠశాల భవనాలు, మంచినీటి ట్యాంకుల నిర్మాణంతో పాటు పెద్ద పరిశ్రమలు, అపరెల్ ఎక్స్‌పోర్టు పార్కులు వచ్చాయి. దీంతో 1952 నుంచి 2018 వరకు నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించిన వారిలో ఈ నేతలు స్థానికుల హృదయాల్లో నేటికీ తమ స్థానాన్ని పదిలం చేసుకున్నారు.
రాష్ట్రంలోనే రెండవ అతి పెద్ద నియోజకవర్గం
మేడ్చల్ నియోజకవర్గం రాష్టంలోనే అతిపెద్ద రెండో నియోజకవర్గం. దీంతో ఇక్కడ అభివృద్ధ్ది పరచటం ఎమ్మెల్యేలకు కూడా పెద్ద తలనొప్పిగా మారేది. ఉమ్మడి రాష్ట్రంలో ఖైరతాబాద్ తరువాత మేడ్చల్ అతిపెద్ద నియోజకవర్గం కావడం విశేషం. మేడ్చల్, శామీర్‌పేట, కీసర, ఘట్‌కేసర్, కుత్బుల్లాపూర్ మండలాలతో పాటు, కాప్రా, ఉప్పల్, కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీలతో పాటు, కూకట్‌పల్లి, హయాత్‌నగర్‌కు చెందిన పలు వార్డులు నియోజకవర్గం పరిధిలో ఉండేవి. దీంతో ఈప్రాంతం అభివృద్ధి శాసన సభ్యులకు తలకుమించిన భారంగా మారింది. ఒకవైపు పట్టణ ప్రాంతాలు, మరోవైపు గ్రామీణ ప్రాంతాల కలయికతో ఉన్న నియోజకవర్గం ప్రస్తుతం అంచెలంచలుగా ఎదుగుతోంది. పారిశ్రామిక రంగంలో గణనీయంగా అభివృద్ధి చెంది లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోంది.
ఏడు సార్లు కాంగ్రెస్‌ను ఆదరించిన ప్రజలు
1952లో ఏర్పడిన మేడ్చల్ నియోజకవర్గంలో 14 సార్లు శాసనసభ ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏడు సార్లు కాంగ్రెస్, నాలుగు సార్లు టీడీపీ, రెండు సార్లు టీఆర్‌ఎస్ (ప్రస్తుత బీఆర్‌ఎస్), ఒక సారి స్వతంత్ర అభ్యర్థికి నియోజక వర్గ ప్రజలు పట్టం కట్టారు.
నేతల తల రాతలు మార్చిన మేడ్చల్
మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించిన నేతల తలరాతలు మారాయి. 1952 నుంచి 2018 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు సార్లు, కాంగ్రెస్, నాలుగు సార్లు, తెలుగు దేశం ఒక సారి స్వతంత్ర అభ్యర్ధి , రెండు సార్లు టీఆర్‌ఎ్‌స(బీఆర్‌ఎస్) పార్టీల అభ్యర్ధులు గెలిచారు. కాంగ్రెస్ పార్టీ తరపున 1978లో విజయం సాధించిన చెన్నారెడ్డి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. 1983లో గెలిచిన ఉమావెంకట్ రాంరెడ్డి(కాంగ్రె స్), 1985లో తెలుగు దేశం నుంచి గెలిచిన సురేందర్‌రెడ్డి, 1994, 1909లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన టి.దేవేందర్‌గౌడ్, 20218లో బీఆర్‌ఎస్ నుంచి విజయం సాధించిన చామకూర మల్లారెడ్డిలు మంత్రి పదవులను చేపట్టారు.
స్థానికేతరులకు కలిసొచ్చిన మేడ్చల్
మేడ్చల్ నియోజకవర్గం నుంచి శాసన సభ్యులుగా ప్రాతినిథ్యం వహించిన వారిలో స్థానికేతరులే అధికంగా ఉండటం గమనార్హం. 14 మందిలో తెలుగుదేశం పార్టీకి చెందిన సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉమావెంకట్ రాంరెడ్డి, టీఆర్‌ఎస్ ప్రస్తుత బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మలిపెద్ది సుధీర్ రెడ్డిలు తప్ప మిగతా వారందరు స్థానికేతరులు కావటం గమనార్హం. బయటి నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసిన వారికి మేడ్చల్ ప్రజలు ఆదరించి గెలిపించారు.
ఓటరు జాబితాలో ఇప్పటికీ నెంబర్ టూ
ఉమ్మడి రాష్ట్రంలో మేడ్చల్ నియోజకవర్గం విస్తీర్ణంలో మొదటి స్థానంలో ఉండగా ఓటర్ల సంఖ్యలో రెండో స్థానాన్ని కైవశం చేసుకుంది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నియోజకవర్గాన్ని మూడు భాగాలుగా విభజించి మేడ్చల్ , కుత్బుల్లాపూర్, ఉప్పల్‌గా రెండు కొత్త నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ మేడ్చల్ నియోజకవర్గం ఓటర్ల జాబితాలో రెండవ అతిపెద్ద నియోజకవర్గంగా తన స్థానాన్ని పదిలం చేసుకుంది.
పట్టణ ప్రాంతాల ఓటర్ల తీర్పు కీలకం
మేడ్చల్ నియోజకవర్గం నగరానికి ఆనుకుని ఉన్నందున గ్రామీణ ప్రాంతాల ఓటర్ల తీర్పు కన్న, పట్టణ ప్రాంతాల ఓటర్ల ప్రభావం ఎక్కువ ప్రభావితం చేస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో కుత్బుల్లాపూర్, ఉప్పల్, కాప్రా మున్సిపాలిటీలో ఓటర్లు అభ్యర్థుల గెలుపులో కీలకం, కాగా ప్రస్తుతం జవహర్‌నగర్, బోడుప్పల్, దమ్మాయిగూడ, నాగారం మున్సిపాలిటీల ఓటర్లు అభ్యర్ధుల తలరాతలను మార్చుతున్నాయి. దీనిక ప్రధాన కారణం ఇక్కడ ఉన్న పారిశ్రామివాడల్లో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చి ఉపాధి కోసం స్థిరపడిన వారు కావటం విశేషం.