Tanduru Kandi Pappu: తాండూరు కంది పప్పు తడాఖా!
ABN , First Publish Date - 2023-03-15T04:21:39+05:30 IST
దేశ రాజధానిలో మంగళవారం నుంచి ఈనెల 18 వరకు జరుగుతున్న 37వ అంతర్జాతీయ ఆహార ఉత్పత్తుల ప్రదర్శన-2023లో వికారాబాద్ జిల్లా తాండూరు కంది పప్పుకు చోటు లభించింది.
అంతర్జాతీయ ఆహార ఉత్పత్తుల ప్రదర్శనలో చోటు
రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక వ్యవసాయ ఉత్పత్తి
తాండూరు, మార్చి 14 : దేశ రాజధానిలో మంగళవారం నుంచి ఈనెల 18 వరకు జరుగుతున్న 37వ అంతర్జాతీయ ఆహార ఉత్పత్తుల ప్రదర్శన-2023లో వికారాబాద్ జిల్లా తాండూరు కంది పప్పుకు చోటు లభించింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఢిల్లీ ప్రగతి మైదాన్‌లో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో ఇటీవల భౌగోళిక(జీఐ) గుర్తింపు పొందిన తాండూరు కంది పప్పును ప్రదర్శించేందుకు తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానానికి ఆహ్వానం అందింది. ఈ ఆర్గానిక్ కందిపప్పు ప్రదర్శనకు యాలాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు గుర్రాల శ్రీనివా్‌సరెడ్డి, షేర్ ఎన్జీవో వ్యవస్థాపకుడు మరాఠి నర్సింహులును తాండూరు వ్యవసాయ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు ఎంపిక చేసి పంపించారు. భారత ప్రభుత్వం ద్వారా అందజేయబడిన జీఐ ధృవీకరణ పత్రాన్ని అక్కడ ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకు రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక వ్యవసాయ ఉత్పత్తి తాండూరు కందిపప్పు కావడం గమనార్హం.