TRS MLAs Poaching Case: కొనసాగుతున్న ఉత్కంఠ
ABN , First Publish Date - 2023-01-09T21:30:52+05:30 IST
సిట్ లో ఉన్న ఐ పి ఎస్ అధికారుల ప్రమోషన్‌లు, ట్రాన్స్ఫర్లు సీఎం చేతిలో ఉంటాయి కాబట్టే, అధికారులను ప్రభావితం చేసే అవకాశం ఉందని...
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర ఆరోపణల కేసు(TRS MLAs Poaching Case)ను సీబీఐ(CBI)కి అప్పగిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్ట్ (Telangana High Court) డివిజన్ బెంచ్‌లో ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై రెండో రోజు వాదనలు వాడీవేడిగా సాగాయి. క్రిమినల్ పిటిషన్‌పై సవాల్ చేసినప్పుడు డివిజన్ బెంచ్‌కు విచారణ అర్హత లేదనే ప్రతి వాదుల వాదనలపై ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ దుష్యంత్ దవే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు క్రిమినల్ రిట్ కాదని, అది మండమాస్ ఆర్డర్ మాత్రమే అని కోర్ట్ దృష్టికి తెచ్చారు. కాబట్టి అప్పీల్ విచారణ జరిపే అధికారం డివిజన్ బెంచ్‌కి ఉందని చెపుతూ ఆర్టికల్ 226 ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుందని వాదనలు వినిపించారు. దుష్యంత్ దవే వాదనలు ఇంకా మిగిలి ఉండడంతో హైకోర్ట్ తదుపరి విచారణ మంగళవారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది.
ప్రతివాదుల తరుపున సుప్రీం కోర్ట్ న్యాయవాది ఉదయ్ హొల్లా, అలాగే సంజయ్ కూడా వాదనలు వినిపించారు. ఈ కేసులో న్యాయవాది శ్రీనివాస్ తరపున వాదనలు సీనియర్ న్యాయవాది ఉదయ్ హోల్లా ప్రారంభించారు. తన ఇంటికి 30మంది పోలీసులు అక్రమంగా వచ్చారని, తాను టెర్రరిస్ట్‌ని కాకున్నా ఇంతమంది పోలీసులు తన కోసం రావడం ఏంటని శ్రీనివాస్ వాపోయారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై కోర్ట్ దృష్టికి తీసుకొచ్చారు. తాను లేని సందర్భంలో వచ్చి నోటీసును ఇంటికి అంటించాడాన్ని తీవ్రంగా తప్పు బట్టారు. పోలీసులు తనను ముందుగా పిలిచినప్పుడు వాళ్ళు చెప్పినట్లు వినకుంటే ఇబ్బందులు తప్పవని బెదిరింపులకు దిగారని వాదనలు వినిపించారు. అన్నట్లుగానే తాను వినకపోయే సరికి తనను కేసులో నిందితుడుగా చేర్చారని కోర్ట్ దృష్టికి తెచ్చారు. సిట్ ఇచ్చిన నోటీసు తీసుకోనని చెప్పకున్నా గోడకు అతికించి వెళ్లిపోయారని కోర్ట్ ముందు శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఆ సమయంలో ధర్మాసనం కలగ జేసుకొని, ప్రతివాదుల తరపున ఈ వాదనలు ఇంతకు ముందే ఇద్దరు సీనియర్ న్యాయవాదులు వినిపించారని, మళ్ళీ మళ్లీ అవే వాదనలు కాకుండా కొత్తగా ఏమైనా కోర్టుకు చెప్పాలనుకుంటే చెప్పండని ధర్మాసనం సూచించింది.
మరో నిందితుడి తరపు న్యాయవాది సంజయ్ కూడా తమ వాదనలు, అభ్యంతరాలను కోర్ట్ దృష్టికి తెచ్చారు. ఈ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్‌లో ముగ్గురు ఐ పి ఎస్ అధికారులు ఉన్నారని, దీంతో సీఎం కేసీఆర్ ఈ అధికారులపై ప్రభావం చూపే అవకాశం ఉందని గుర్తు చేశారు. సిట్ లో ఉన్న ఐ పి ఎస్ అధికారుల ప్రమోషన్‌లు, ట్రాన్స్ఫర్లు సీఎం చేతిలో ఉంటాయి కాబట్టే, అధికారులను ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలిపారు. స్వయంగా ముఖ్యమంత్రి ప్రెస్‌మీట్ పెట్టీ ఈ కేస్‌కు చెందిన వీడియోలను మీడియా ముందు పెట్టారని మరోసారి డివిజన్ బెంచ్‌లో గుర్తు చేశారు. సీఎం డిసెంబర్ 3 న ప్రెస్ మీట్ పెట్టారని, ప్రెస్ మీట్ లోనే ఆధారాలు బయట పెడుతున్నాయని ముఖ్యమంత్రి ఆన్ రికార్డ్‌లో చెప్పారని వాదనలు వినిపించారు. సిట్ దగ్గర ఉండాల్సిన ఆధారాలు ముఖ్యమంత్రి చేతికి వెళ్లడంతో సిట్‌పై తమకు నమ్మకం సన్నగిల్లిందని వాదనలు వినిపించారు. ఈ కేసు సింగిల్ బెంచ్‌లో విచారణ జరుగుతున్న సమయంలో ఓ దశలో ఈ వ్యవహారంపై ప్రభుత్వ తరపు న్యాయవాది, సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ దుష్యంత్ దవే క్షమాపణ కోరారని, ఈ విషయాన్ని మరోసారి కోర్ట్ దృష్టికి తెస్తున్నట్లు చెప్పారు.
మరోసారి దవే వాదనలు వినిపిస్తూ, 173(8) కింద విచారణ నిష్పక్షపాతంగా జరగాల్సిందేనని, అక్టోబర్ 29 రోజునే మెజిస్ట్రేట్ ముందుకు సీడీలు వచ్చాయని కోర్ట్ దృష్టికి తెచ్చారు. సీఎం ప్రెస్ మీట్ నవంబర్ 3 న జరిగిందని, కేవలం సీడీలు సీఎం బయట పెట్టారని సిట్ విచారణను తప్పుబట్టడం సరైంది కాదని వాదనలు వినిపించారు. ఎఫ్ ఐ ఆర్ నమోదుపై ఎలాంటి అనుమానాలు లేవు కానీ సీడీల విషయంలోనే ఇంత రాద్దాంతం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని దవే తీవ్ర స్వరంతో వాదనలు వినిపించారు. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆర్డర్‌ను తప్పు బడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక జడ్జిమెంట్‌ను దవే న్యాయస్థానం ముందు ప్రస్తావించారు. బాబు భాయ్ కేసులో ఇలాంటి వివాదమే తలెత్తితే అప్పుడు విచారణ సంస్థను మార్చారని ఇప్పుడు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ కాపీలో పేర్కొన్నారు. ఆ కేసులో రాష్ట్ర ప్రభుత్వం కింద పని చేసే సీఐడీకే కేసు బదిలీ చేశారే తప్ప, కేంద్ర దర్యాప్తు సంస్థకు ఇవ్వలేదని వాదనలు వినిపించారు.
దవే వాదనలు ఇంకా మిగిలి ఉండడంతో తదుపరి విచారణను హైకోర్ట్ మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు వాయిదా వేసింది. మంగళవారం కూడా దవే వర్చువల్ గానే వాదనలు వినిపించునున్నారు. ఇక సీబీఐ కూడా వాదనలు వినిపించే అవకాశం ఉంది.
హైదరాబాద్ నగర శివార్లలోని మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో తమను ఢిల్లీకి చెందిన కొందరు వ్యక్తులు సంప్రదించారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్‌రెడ్డి (తాండూరు), గువ్వల బాలరాజు (అచ్చంపేట), బీరం హర్షవర్ధన్‌రెడ్డి (కొల్లాపూర్), రేగా కాంతారావు (పినపాక) ఆరోపించారు. పార్టీ ఫిరాయిస్తే వారికి ఒక్కొక్కరికీ రూ.100 కోట్ల చొప్పున ఇస్తామని.. దాంతోపాటు కాంట్రాక్టులు కూడా ఇప్పిస్తామని ప్రలోభానికి గురిచేసేందుకు ప్రయత్నించారని చెప్పారు. ఈ కేసులో రామచంద్ర భారతి అలియాస్ సతీశ్ శర్మ, మరొకరు తిరుపతికి చెందిన సింహ యాజులు, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (CV Anand) అధ్యక్షతన సిట్‌ను ఏర్పాటు చేశారు.