దూరం.. దూరం!
ABN , Publish Date - Jul 18 , 2024 | 03:58 AM
ఎన్నికల సమయంలో ‘మా ఎస్టీలు, మా ఎస్సీలు..’ అంటూ ఊకదంపుడు ప్రచారం చేసిన వైసీపీ నేతల నిజస్వరూపం బయటపడింది.
పారిశుధ్య కార్మికుల పట్ల రోజా అనుచిత ప్రవర్తన
సెల్ఫీ కోసం వచ్చినవారిని వారించిన మాజీ మంత్రి
దూరంగా నిలబెట్టి వారితో సెల్ఫీ దిగిన వైనం
తమిళనాట ఘటన.. ఎండగట్టిన తమిళ మీడియా
చెన్నై, జూలై 17 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సమయంలో ‘మా ఎస్టీలు, మా ఎస్సీలు..’ అంటూ ఊకదంపుడు ప్రచారం చేసిన వైసీపీ నేతల నిజస్వరూపం బయటపడింది. ఆయన సామాజికవర్గాన్ని తప్ప మరే కులం వారిని తాడేపల్లి ప్యాలె్‌సలోకి రానీయబోరని జగన్ గురించి సన్నిహితులే చెబుతుంటారు. ఇప్పుడు ఆయన బాటలోనే వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా నడిచారు. రోజా ఇటీవల కుటుంబసమేతంగా తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడి జిల్లా తిరుచ్చెందూర్‌లో ఉన్న సుబ్రమణ్యస్వామి ఆలయానికి వెళ్లారు. అక్కడ అనేకమంది ఆమెతో సెల్ఫీలు దిగారు. అదే సమయంలో సెల్ఫీ కోసం రోజా వద్దకు ఇద్దరు మహిళా పారిశుధ్య కార్మికులు యూనిఫారంలో వచ్చారు. అయితే, ఆమె వారిని తన దగ్గరకు రానీయలేదు. ‘దూరంగా ఉండండి’ అంటూ చేతితో వారిని వారించారు. దీంతో వారు బిక్కుబిక్కుమంటూ దూరంగా నిలబడే ఆమెతో సెల్ఫీ దిగి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వ్యవహారాన్ని చూపిస్తూ, తమిళ చానళ్లు... రోజా తీరును ఎండగడుతున్నాయి.