Share News

Budget Highlights : ఏపీ హ్యాపీ..

ABN , Publish Date - Jul 24 , 2024 | 05:15 AM

మోదీ ప్రభుత్వం మిత్రధర్మాన్ని చాటుకుంది. కేంద్రంలో ప్రభుత్వ మనుగడకు టీడీపీ-జనసేన మద్దతే కీలకం కావడంతో..

Budget Highlights : ఏపీ హ్యాపీ..
CM Chandrababu

కేంద్ర బడ్జెట్‌లో ఆపన్న హస్తం

పారిశ్రామికాభివృద్ధికి తోడ్పాటు

కొప్పర్తి, ఓర్వకల్లు నోడ్స్‌ అభివృద్ధి

విశాఖ ఉక్కుకు రూ.620 కోట్లు

తూర్పు తీరాన్ని కలుపుతూ ‘పూర్వోదయ్‌’

రాష్ట్రంలోని పలు కేంద్ర సంస్థలకూ నిధులు

కేంద్ర పన్నుల్లో వాటా 50,474 కోట్లు

కేంద్ర బడ్జెట్‌లో నిర్మలమ్మ ప్రకటన

ఐదేళ్లుగా కేంద్ర బడ్జెట్‌లో ‘ఆంధ్రప్రదేశ్‌’ అన్న మాటే గట్టిగా వినిపించలేదు! నాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్‌ సర్కారూ పట్టించుకోలేదు. ఇప్పుడు... ఇన్నాళ్లకు, ఇన్నేళ్లకు తొలిసారిగా కేంద్ర బడ్జెట్‌లో ‘ఆంధ్రప్రదేశ్‌’ మాట పలుమార్లు మార్మోగింది. ఎప్పుడో అటకెక్కించిన ‘రాష్ట్ర పునర్విభజన చట్టం’... రాష్ట్ర విభజన జరిగిన పదేళ్లకు మళ్లీ లోక్‌సభలో తెరపైకి వచ్చింది. నవ్యాంధ్రకు రెండు కళ్లలాంటి రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి ఆర్థిక అభయం లభించింది. విభజన చట్టంలో ప్రస్తావించినట్లుగా... వెనుకబడిన జిల్లాలకు ఆపన్న హస్తం అందిస్తామని కేంద్రం ప్రకటించింది. పారిశ్రామిక అభివృద్ధికీ చేదోడుగా నిలుస్తామని తెలిపింది. మొత్తంగా చూస్తే... ఐదేళ్లలో తొలిసారిగా కేంద్ర బడ్జెట్‌ రాష్ట్ర ప్రజలకు ఆనందాన్ని పంచింది.


న్యూఢిల్లీ, జూలై 23 (ఆంధ్రజ్యోతి): మోదీ ప్రభుత్వం మిత్రధర్మాన్ని చాటుకుంది. కేంద్రంలో ప్రభుత్వ మనుగడకు టీడీపీ-జనసేన మద్దతే కీలకం కావడంతో.. తాజా కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రంపై వరాల జల్లు కురిపించింది. రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణం, పారిశ్రామికాభివృద్ధి, వెనుకబడిన ప్రాంతా ల అభివృద్ధికి ఇబ్బడిముబ్బడిగా సాయం అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం లోక్‌సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ప్రకటించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే కర్తవ్యంలో భాగంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రధానంగా రాష్ట్రానికి రాజధాని ఉండాల్సిన అవసరాన్ని గుర్తించామన్నారు. అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్ల ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించారు. వివిధ అభివృద్ధి ఏజెన్సీల ద్వారా ఈ ఏడాదే ఈ నిధులు అందిస్తామని చెప్పారు. రానున్న సంవత్సరాల్లో అదనపు నిధులు కూడా సమకూరుస్తామన్నారు.

కేంద్ర సంస్థలకు నిధులు

రాష్ట్రంలో ఉన్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఎన్‌ఐడీ), గిరిజన విశ్వవిద్యాలయం, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం ఎనర్జీ(ఐఐపీఈ), సొసైటీ ఫర్‌ అప్లైడ్‌ మైక్రోవేవ్‌ ఎలక్ర్టానిక్స్‌ ఇంజనీరింగ్‌-రీసెర్చ్‌ (సమీర్‌), ఇండియన్‌ స్ర్టాటెజిక్‌ పెట్రోలియం రిజర్వ్‌ లిమిటెడ్‌(ఐఎ్‌సపీఆర్‌ఎల్‌), విశాఖ పోర్టు ట్రస్టు, విశాఖ ఉక్కు కర్మాగారం, హిందూస్థాన్‌ షిప్‌ యార్డ్‌ తదితర కేంద్ర సంస్థలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. గిరిజన విశ్వవిద్యాలయాన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో భాగంగా గుర్తించాలని నిర్ణయించారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి రూ.620 కోట్లు, విశాఖ పోర్టు ట్రస్టుకు రూ.150 కోట్లు, పెట్రోలియం ఎనర్జీ సంస్థకు రూ.168 కోట్లు కేటాయించారు. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్షా యోజన కింద దేశంలోని అన్ని ఎయిమ్స్‌లకూ కలిపి రూ.2,200 కోట్లు కేటాయించారు. ఇందులో నుంచి మంగళగిరి ఎయిమ్స్‌కు కూడా నిధులు అందుతాయి.


రాష్ట్రానికి పన్నులు, సుంకాల వాటా ఇదీ

2024-25 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర పన్నులు, సుంకాల్లో రూ.50,474.64 కోట్ల వాటా లభిస్తుందని బడ్జెట్‌లో పేర్కొన్నారు. మొత్తం పన్నులు, సుంకాల్లో ఏపీ వాటా 4.047ు. కార్పొరేషన్‌ ట్యాక్స్‌ రూపేణా రూ.15,156.51 కోట్లు, ఆదాయ పన్ను-రూ.17,455.93 కోట్లు, కేంద్ర జీఎస్టీ-రూ.15,079.39 కోట్లు, కస్టమ్స్‌-రూ.2,228.46 కోట్లు, ఎక్సైజ్‌-రూ.469.73 కోట్లు, సర్వీస్‌ ట్యాక్స్‌-రూ.1.66 కోట్లు, ఇతర పన్నులు, సుంకాల రూపేణా రూ.82.96 కోట్లు లభిస్తాయి.

మరిన్ని వరాలు

వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లా అభివృద్ధికీ విభజన చట్టం ప్రకారం గ్రాంట్లు మంజూరు చేస్తాం.

పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించడానికి విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని కొప్పర్తి నోడ్‌, హైదరాబాద్‌-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లోని ఓర్వకల్లు నోడ్‌లో నీరు, విద్యుత్‌, రైల్వే వంటి మౌలిక సదుపాయాలకు నిధులు మంజూరు చేస్తాం. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి మూలధన పెట్టుబడుల కోసం ఈ ఏడాది అదనపు కేటాయింపులు చేస్తాం.

తూర్పున ఉన్న రాష్ట్రాలు బలమైన సంస్కృతీ సంప్రదాయాలు కలిగి ఉన్నాయి. బిహార్‌, ఆంధ్రప్రదేశ్‌, జార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌, ఒడిసాలను కలుపుతూ తూర్పు ప్రాంతం సర్వతోముఖాభివృద్ధికి ‘పూర్వోదయ’ ప్రణాళిక రూపొందిస్తాం.

fdklhb.jpg


పోలవరానికి వరం

‘‘ఆంధ్రప్రదేశ్‌కు, ఆ రాష్ట్ర రైతులకు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు ఆర్థిక సాయం అందించడానికి.. త్వరగా పూర్తిచేయడానికి కేంద్రం కట్టుబడి ఉంది. ఈ ప్రాజెక్టు దేశ ఆహార భద్రతను పెంచుతుంది’’ అని నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. అలాగే... వనరుల కొరత రాకుండా వివిధ రాష్ట్రాలకు రూ.లక్షన్నర కోట్ల మేర దీర్ఘకాలిక వడ్డీ లేని రుణాలను కల్పిస్తామని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. రాష్ట్రానికి విదేశీ రుణ సాయం లభిస్తున్న ‘ఆంధ్రప్రదేశ్‌ రోడ్లు-వంతెనల నిర్మాణ ప్రాజెక్టు’, గ్రామీణ రహదారుల ప్రాజెక్టు (రూ.150 కోట్లు), నీటిపారుదల, జీవనోపాధి మెరుగుదల ప్రాజెక్టు రెండోదశ (రూ.300 కోట్లు), అభ్యాస్‌ పరివర్తన్‌ ప్రాజెక్టు (రూ.300 కోట్లు) గురించి కూడా నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో ప్రస్తావించారు.

Updated Date - Jul 24 , 2024 | 07:26 AM