AP Politics: శరణు.. శరణు.. ఎన్నికల వేళ జగన్‌కు పెద్ద కష్టమే వచ్చిందిగా..!
ABN, Publish Date - Apr 13 , 2024 | 09:55 AM
ముఖ్యమంత్రి జగన్(CM YS Jagan), పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra reddy), బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana), రోజా, బుగ్గన రాజేంద్రనాథరెడ్డి వంటి హేమా హేమీలు ఉన్న రాష్ట్ర మంత్రివర్గం. 151 మంది ఎమ్మెల్యేలు, దాదాపు 35 మంది వరకు పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డితో కలిపి వందల సంఖ్యలో..
అధికార పార్టీకి వలంటీర్లే దిక్కా?
నవరత్నాలు ఏమైనట్లు..? •
మందీమార్ధలం ఎక్కడ..?
మంత్రులు, ఎమ్మెల్యేలు ఏమయ్యారు..?
వలంటీర్లకు సాగిలపడుతున్న అధికార పార్టీ
(రాయచోటి-ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్(CM YS Jagan), పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra reddy), బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana), రోజా, బుగ్గన రాజేంద్రనాథరెడ్డి వంటి హేమా హేమీలు ఉన్న రాష్ట్ర మంత్రివర్గం. 151 మంది ఎమ్మెల్యేలు, దాదాపు 35 మంది వరకు పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డితో కలిపి వందల సంఖ్యలో సొంత సామాజిక వర్గానికి చెందిన సలహాదారులు, చెప్పింది చెప్పినట్లు విని తూచా తప్పకుండా పాటిస్తూ.. ఎస్ బాస్ అనే ఎందరో ఐఏఎస్ లు, ఐపీఎస్ లు.. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు కనికట్టు చేయగల సోషల్ మీడియా సైన్యం.. ఇసుక, మట్టి, అమ్ముకుని, ప్రభుత్వ భూములు ఆక్రమించి, ప్రైవేటు భూముల్లో సైతం తలదూర్చి.. వందల కోట్లు వెనకేసిన నాయకులు, నవరత్నాల అమలు, గత ఐదేళ్లలో రాష్ట్రంలో తెచ్చిన పరిశ్రమలు, ఉపాధి కల్పన చేసినట్లు చెప్పుకుంటున్న అభివృద్ధి. ఇవన్నీ రాబోయే ఎన్నికల సమరంలో అధికార వైసీపీకి ప్రధాన అస్త్రాలుగా ఉంటాయని ఆ పార్టీ నేతలు బావిస్తూ వచ్చారు.
అయితే ఇవేవీ తమ పార్టీని గెలుపు బాటలో నడిపించవనే భయం ముఖ్యమంత్రికి పట్టుకున్నట్లుగా ఉంది. లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పదవులు పొందిన వాళ్లను కాదని.. ముఖ్యమంత్రే వార్డు/గ్రామ వలంటీర్లను శరణు కోరుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ బహిరంగ సభలు జరిగినా, రాబోయే ఎన్నికల్లో తన బలం, సైన్యం వలంటీర్లే అని చెప్తున్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
నవరత్నాలు ఏమైనట్లు..?
జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే. నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలను ఎంతో ఆర్భాటంగా ప్రకటించింది. వీటికి ఎక్కడా లేని ప్రాధాన్యతను ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలో ఈ పథకాలు ఎంతో కొంత అమలు జరిగినా.. తర్వాత లబ్ధిదారుల ఎంపికలో ప్రభుత్వం అనేక కఠిన ఆంక్షలు చేర్చింది. ఫలితంగా లబ్దిదారుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. పాదయాత్ర సందర్భంగా జగన్ చెప్పిన మాటలకు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నవరత్నాల అమలు సమయంలోనూ ఎంతో వ్యత్యాసం కనిపించింది. ఐదేళ్ల పాలనలో అమ్మఒడి పథకాన్ని నాలుగేళ్లు మాత్రమే అమలు చేశారు. అదే సమయంలో ఈ పథకానికి లబ్దిదారుల ఎంపికకు కరెంటు బిల్లులు, సొంత ఇళ్లు ఉండకూడదు. కారు ఉండకూడదు అనే నిబంధనలతో నిజమైన అర్హు లను లబ్దిదారులుగా ఎంపిక చేయలేదు. దాదాపు నవరత్నాలలో ప్రతి పథకానికి ఇటువంటి నిబంధనలే పెట్టారు. పెన్షన్లు పెంపు విషయంలో ప్రభుత్వం నాలుక ఎన్ని మడతలు పెట్టిందో లెక్కపెట్టడమే కష్టం. టీడీపీ పాలనలో పెన్షన్ రూ.2 వేలు ఇచ్చే వాళ్లు తాము ఆధికారంలోకి వస్తే రూ.3 వేలు ఇస్తానన్న జగన్.. అధికారంలోకి రాగానే మాట మార్చేశాడు. ఏటా రూ.250 చొప్పున.. ఇప్పటికి రూ.3వేలు చేశాడు. ఇలా ప్రభుత్వం లబ్దిదారుల విషయంలో అనుసరించిన వైఖరి వల్ల నవరత్నాలు జగన్ ప్రభుత్వానికి పెద్దగా ఉపయోగపడలేదనే అభిప్రాయం సర్వత్రా ఉంది.
మందీ మార్బలం పనిచేయలేదా ?
అధికార వైసీపీలో మహా మహులైన రాజకీయ నాయకులు, ఎంతో రాజకీయ అనుభవం, నేపథ్యం ఉన్న నాయకులు ఉన్నట్లు ఆ పార్టీ నేతలు గొప్ప చెబుతుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే. పార్టీకి వైఎస్ జగన్ పెద్ద బ్రాండ్ అని డబ్బా కొడుతుంటారు. దీనికి తోడు ఐప్యాక్ టీం ప్రభుత్వానికి ఎప్పుడూ జాకీలు వేసి పైకి లేపుతూనే ఉంటుంది. సలహాదారు నామినేటెడ్ పదవులు పొందిన నాయకులు, ప్రతిపక్షం పైకి ఒంటికాలిమీద వెళ్లే నాయకులు, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా పెద్దదే అవుతుంది. ఈ జాబితా అంతా కూడా రాబోయే ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చే పరిస్థితి కనిపించడం లేదని అర్ధమవుతోంది.
ఇక వలంటీరే దిక్కా..?
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీరును ఏర్పాటు చేసింది. జిల్లాలో 8,528 మంది వలంటీర్లను ఏర్పాటు చేసింది. అందులో ప్రస్తుతం 8,376 మంది పనిచేస్తున్నారు. వీళ్ల ద్వారా నవరత్నాల సంక్షేమ పథకాలను అమలు చేయించే వాళ్లు. అయితే రాను రాను.. ప్రతి ఇంట్లోని సమాచారం వలంటీర్ల సేకరించడం మొదలు పెట్టారు. ఆధార్ కార్డులు, బ్యాంకు పాసుపుస్తకాలు, అస్తుల వివరాలు, వాళ్ళు ఏ పార్టీకి మద్దతుదారులు వంటి వ్యక్తిగత సమాచారాన్ని కూడా సేకరించారు. అంతేకాకుండా.. అధికార పార్టీ తరపున ప్రచారం కూడా చేశారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కానుకల పంపిణీకి కూడా అధికార పార్టీ వలంటీర్లను వాడుకుంది. ఇంకా కొన్ని చోట్ల తమ ప్రత్యర్థి పార్టీల ఓటర్ల ఓట్లు తొలగించేందుకు కూడా వలంటీర్లను అధికార పార్టీ వినియోగిస్తోందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. దీంతో కొందరు వలంటీర్లను ఎన్నికల సంఘం ఆదేశాలతో అధికారులు సస్పెండ్ చేశారు. ఒకమాటలో చెప్పాలంటే అధికార పార్టీ పూర్తిగా వలంటీర్లపైనే ఆధారపడింది.
ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఓ స్వచ్ఛంద సేవా సంస్థ చేసిన ఫిర్యాదుతో వలంటీర్లను ఎన్నికలతో పాటు, సంక్షేమ పథకాల ఆమలులో కూడా దూరంగా ఉండమని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలతో ఖంగుతిన్న అధికార పార్టీ వలంటీర్ల సేవలు దొడ్డిదారిలో వాడుకునేందుకు నిర్ణయించింది. దీంతో అధికార పార్టీ వలంటీర్లతో తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేయించి తమతో పాటు ఎన్నికల ప్రచారానికి తిప్పుతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా సుమారు 58 మంది తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేశారు. 16 మందిని ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. రాజీనామాలు రాబోయే రోజుల్లో మరిన్ని పెరిగే అవకాశం ఉంది. ఈ సంఘటనల నేపథ్యంలో ఎంతో గొప్పగా పాలన చేశామని చెప్పుకుంటున్న జగన్ ప్రభుత్వానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, సలహాదారులు, ఐఏఎస్, ఐపీఎస్‌లు, ఇంకా ముఖ్యమైన నాయకులు ఉండగా, వలంటీర్లే దిక్కయ్యారా అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
175 సీట్లలో నేనే పోటీ..
"ఒక అవకాశం ఇవ్వండి.. నన్ను చూసి ఓటెయ్యండి... 175 స్థానాల్లోనూ.. నేనే పోటీలో ఉన్నాననుకోండి.. చంద్రబాబు కంటే మెరుగైన పాలన అందిస్తా.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సాయం చేస్తా." ఇది గత ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలనుద్దేశించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నమాటలు.
మరొక్కసారి నాకు అవకాశం ఇవ్వండి..
‘‘130 సార్లకు పైగా బటన్ నొక్కాను.. సాయం పొందిన వాళ్లు నాకు ఓటేయ్యండి.. నన్ను గెలిపించాల్సిన బాధ్యత వలంటీర్లపైనే..’’ ఇవీ ఇప్పుడు ఎన్నికల కోసం సీఎం జగన్ మోహన్ రెడ్డి అంటున్న మాటలు.
పై రెండు మాటలను గమనిస్తే.. రాబోయే ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎలా ఉండబోతోందో..? ముఖ్యమంత్రికి ఇప్పటికే స్పష్టంగా అర్ధమై పోయిందని పలువురు రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Updated Date - Apr 13 , 2024 | 09:55 AM