CM Jagan: సీఎం జగన్ నేడు అనంతపురం జిల్లాలో పర్యటన
ABN , Publish Date - Jan 23 , 2024 | 07:29 AM
అనంతపురం జిల్లా: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం అనంతపురం జిల్లా ఉరవకొండలో పర్యటించనున్నారు. వైఎస్సార్ ఆసరా నాలుగో విడత రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని ప్రారంభించి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు.
అనంతపురం జిల్లా: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం అనంతపురం జిల్లా ఉరవకొండలో పర్యటించనున్నారు. వైఎస్సార్ ఆసరా నాలుగో విడత రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని ప్రారంభించి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.
సీఎం జగన్ పర్యటన షెడ్యూల్..
మంగళవారం ఉదయం 9 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి సీఎం బయల్దేరి 9.45 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుంటారు. 10 గంటలకు అక్కడి నుంచి హెలికాప్టర్లో బయల్దేరి 10.30 గంటలకు ఉరవకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చేరుకుంటారు.. ఉదయం 10.40 గంటలకు అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో బయల్దేరి 10.50 గంటలకు అనంతపురం బైపాస్ సమీపంలోని బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకుంటారు.. ఉదయం 10.55 గంటలకు స్వయం సహాయక సంఘాల మహిళలతో మాట్లాడతారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు.
ఆ తరువాత వైఎస్సార్ ఆసరా నాలుగో విడత కింద సీఎం జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి సంఘాల బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేస్తారు. అటు తరువాత మెగా చెక్ విడుదల చేస్తారు. మధ్యాహ్నం 12.35 గంటలకు బహిరంగ సభ వద్ద నుంచి బయల్దేరి 12.45 గంటలకు హెలి ప్యాడ్ వద్దకు చేరుకుంటారు.. 1.45 గంటల వరకు స్థానిక నాయకులతో భేటీ.. మధ్యాహ్నం 1.50 గంటలకు హెలికాప్టర్లో బయల్దేరి 2.20 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుంటారు. 2.30గంటలకు అక్కడి నుంచి విమానంలో గన్నవరం బయలుదేరతారు.
కాగా.. సీఎం సభ అంటేనే పెట్రోల్ బంకుల యజమానులు బెంబేలెత్తుతున్నారు. వామ్మో సీఎం సభనా అంటూ బిత్తరపోతున్నారు. డబ్బులిస్తేనే... డీజీల్ వేస్తామని తేల్చి చెప్పేస్థితికి యజమానులు వచ్చారు. ఇందుకు ప్రధాన కారణం లేకపోలేదు. జిల్లాలో ఎక్కడ సీఎం సభ జరిగినా... వాహనాలు సమకూర్చాల్సిందే... ఆ వాహనాలకు డీజిల్ వేయించాల్సిందే. ఆ బాధ్యతను సంబంధిత శాఖాధికారులు భుజాన ఎత్తుకొని మోస్తున్న పరిస్థితి జిల్లాలో ఉంది. అయ్యా బాబూ... సీఎం సభకు జనాన్ని తరలించాలి. ఏ వాహనం డీజిల్ బంకు దగ్గరకొచ్చినా డీజిల్ పట్టండి. డబ్బులు మళ్లీ ఇస్తామంటూ పెట్రోల్ బంకుల యజమానులను సంబంధిత అధికారులు బతిమలాడుకుంటున్నారు. సీఎం సభ నిర్వహించే రోజుల్లో సభ నిర్వహణలో భాగంగా జనాన్ని తరలించేందుకు వినియోగిస్తున్న ప్రైవేట్ వాహనాలకు డీజిల్ పోయించేందుకు ఆ రోజుకారోజు నిధులు విడుదల చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. గతేడాదిలో కళ్యాణదుర్గం, పుట్టపర్తిలో నిర్వహించిన సీఎం సభలకు సంబంధించి జనాన్ని తరలించేందుకు వినియోగించిన వాహనాలకు డీజిల్ వేసినందుకుగానూ రూ.60 లక్షల వరకూ పెట్రోల బంకుల యజమానులకు బకాయి పడినట్లు ఆ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఇప్పటికీ ఆ బకాయి చెల్లించకపోవడంతో... ఉరవకొండలో మంగళవారం నిర్వహించనున్న సీఎం సభ కోసం జనాన్ని తరలించేందుకు సంబంధిత అధికారులు సిద్ధం చేసిన వాహనాలకు డీజిల్ వేసేందుకు పెట్రోల్ బంకు యాజమానులు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. పాత బకాయి చెల్లిస్తేనే... డీజిల్ వేస్తామని తేల్చి చెప్తున్నట్లు సమాచారం. సంబంధిత అధికారులు తలలు పట్టుకుంటున్న పరిస్థితి ఎదురవుతోంది. ఇదిలా ఉండగా... పాత బకాయి చెల్లిస్తాము... ఈసారికి డీజిల్ అప్పుగా వేయండంటూ యజమానులను అధికారులు బతిమలాడుతున్నా... వేసేందుకు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు సంబంధిత అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తుండటం గమనార్హం.