Rain Effect: వర్ష ప్రభావిత ప్రాంతాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా..
ABN, Publish Date - Sep 01 , 2024 | 10:56 AM
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు(Rains) కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) సీఎంవో అధికారులతో సమావేశమయ్యారు. ఏపీలో భారీ వర్షాలపై సీఎం ఆరా తీశారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎంవో అధికారులు ముఖ్యమంత్రికి భారీ వర్షాలు, ఆయా జిల్లాల్లో తాజా పరిస్థితులపై వివరించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల(Rains) నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) సహా మంత్రులు, ఎమ్మెల్యేలు అప్రమత్తమయ్యారు. వరస సమీక్షలు నిర్వహిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులపై ఆరా తీస్తూ వివరాలు తెలుసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు సైతం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ముంపు ప్రాంతాల ప్రజలకు ధైర్యం కల్పిస్తున్నారు. అధికారులు, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి తక్షణమే సహాయక చర్యలు మరింత ఉద్ధృతం చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు.
సీఎం చంద్రబాబు ఆరా..
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎంవో అధికారులతో సమావేశమయ్యారు. ఏపీలో భారీ వర్షాలపై సీఎం ఆరా తీశారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎంవో అధికారులు ముఖ్యమంత్రికి భారీ వర్షాలు, ఆయా జిల్లాల్లో తాజా పరిస్థితులపై వివరించారు. రాష్ట్రంలో వర్షాలు కాస్త నెమ్మదించినా చాలా ప్రాంతాల్లో ఇంకా వరదలు కొనసాగుతున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. పలు జిల్లాల్లో వరదల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్లు నడుస్తున్నాయని వివరించారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, రెవెన్యూ, పోలీసులు విస్తృతస్థాయిలో సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు. అయితే సహాయం కోరే ప్రతి ఒక్కరి వద్దకు తక్షణమే సహాయక బృందాలు వెళ్లేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
మంత్రి అనగాని సమీక్ష..
మరోవైపు భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్న నేపథ్యంలో రెవెన్యూ శాఖ అధికారులతో ఆ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించారు. వరదల్లో ప్రజలు చిక్కుకొని ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజల రక్షణ నిమిత్తం రెవెన్యూ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. క్షణక్షణం పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు. రక్షణ చర్యల్లో ప్రజలకు సాయపడుతూ నష్టం జరగకుండా చూసుకోవాలని చెప్పుకొచ్చారు. వర్షాలు మరో 24గంటలపాటు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనగాని ఆదేశించారు. విధుల నిర్వహణలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని ఆదేశించారు.
బొండా ఉమా పర్యటన..
బుడమేరు కట్ట తెగడంతో విజయవాడ వాసులను వరదనీరు ముంచెత్తుతోంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో నివాసాల మధ్యకు నీరు భారీగా చేరడంతో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. వరద బాధితులకు అవసరమైన చర్యలు తీసుకోవాలని టీడీపీ కార్యకర్తలు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సింగ్ నగర్ నుంచి కొత్త రాజరాజేశ్వరిపేట మధ్య బుడమేరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు పూర్తిగా నిలపిపోయాయి. దీంతో పడవుల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమా మాట్లాడుతూ.. " ఈ దశాబ్దంలోనే ఎప్పుడూ ఇంత వర్షం చూడలేదు. శనివారం నుంచి ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక చర్యలు చేపట్టాం. అధికారులు, టీడీపీ కార్యకర్తలు ముంపుప్రాంతాల ప్రజలకు భోజనం అందించారు. రెండ్రోజులపాటు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి అవసరం ఉన్నా వెంటనే తనకు లేదా అధికారులకు ఫోన్ చేయాలి. సీఎం చంద్రబాబు స్వయంగా సహాయక చర్యలు పర్యవేక్షిస్తూ మాకు సూచనలు ఇస్తున్నారు. ప్రజలు ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలి" అని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Rains: ఎన్టీఆర్ జిల్లాను ముంచెత్తిన వరదలు..
Rains: భారీ వర్షాలతో జలాశయాలకు పెరుగుతున్న వరదనీరు..
Updated Date - Sep 01 , 2024 | 11:00 AM