ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP CM Chandrababu Naidu : విజ్ఞాన సమాజమే మన లక్ష్యం

ABN, Publish Date - Dec 13 , 2024 | 05:03 AM

విజ్ఞాన సమాజాన్ని సృష్టించడం మనందరి లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. అందుకోసం అన్నివిధాలుగా విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని, ప్రభుత్వం, ప్రైవేటు అని వేర్వేరుగా చూడొద్దని, రెండింటినీ ప్రోత్సహించాలని నిర్దేశించారు.

  • ఎప్పటికప్పుడు కరిక్యులమ్‌లో మార్పులు రావాలి

  • ప్రైవేటు, ప్రభుత్వం..రెండు రంగాలనూ ప్రోత్సహించాలి

  • పాఠశాలల్లో అందరికీ రేటింగ్‌ అవసరం: సీఎం చంద్రబాబు

అమరావతి, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): విజ్ఞాన సమాజాన్ని సృష్టించడం మనందరి లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. అందుకోసం అన్నివిధాలుగా విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని, ప్రభుత్వం, ప్రైవేటు అని వేర్వేరుగా చూడొద్దని, రెండింటినీ ప్రోత్సహించాలని నిర్దేశించారు. చేతగానప్పుడే ప్రైవేటురంగాన్ని వేరుగా చూపిస్తుంటారని, వారితో పోటీపడాలన్నారు. అంతిమంగా తెలుగు విద్యార్థులు నంబర్‌ వన్‌ కావడం లక్ష్యం కావాలన్నారు. కలెక్టర్ల సదస్సులో మానవ వనరుల అభివృద్ధిపై సమీక్ష సందర్భంగా సీఎం మాట్లాడారు. కరిక్యులమ్‌లో మార్పులు చేయడం అనేది నిరంతర ప్రక్రియగా మారాలని, భవిష్యత్తు ఆధారంగా ఈ ప్రక్రియ సాగాలన్నారు. సాధారణ యూనివర్సిటీలతోపాటు సివిల్‌ ఏవియేషన్‌, ఎనర్జీ, లాజిస్టిక్స్‌ లాంటి ఫంక్షనల్‌ యూనివర్సిటీలు వచ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు. పాఠశాలల్లో రేటింగ్‌ అనేది అందరికీ ఉండాలనీ, దానివల్ల మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు.

  • పిల్లలు ఎక్కడో ఒకచోట చదవాలి: లోకేశ్‌

ప్రైవేటు బడుల్లో లేదా ప్రభుత్వ బడుల్లో ఎక్కడో ఒకచోట పిల్లలు చదువుకోవడం ముఖ్యమని మంత్రి లోకేశ్‌ అన్నారు. ఇప్పటికే చాలా మంది పిల్లలు ఎక్కడ చదువుతున్నారో తెలియక డ్రాప్‌బాక్స్‌లో పెడుతున్నారని, డ్రాప్‌బాక్స్‌లో ఎవరూ ఉండకూడదని స్పష్టంచేశారు. పాఠశాల విద్యలో పనితీరు ఆధారంగా జిల్లా కలెక్టర్లకు ప్రగతి కార్డులు ఇస్తున్నామన్నారు. మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం పెరగాలనీ, ఉన్నత విద్యలో మెస్‌లపై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని కలెక్టర్ల దృష్టికి తెచ్చారు. ఇకపై విద్యార్థుల నుంచి ప్రతివారమూ అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. ప్రతి కాలేజీ, పాఠశాలలో ఈగల్‌ క్లబ్స్‌ ఏర్పాటుచేయాలని ఆదేశించారు. కేజీ నుంచి పీజీ వరకు మొత్తం బోధనావిధానం మారుస్తున్నామన్నారు.


ఏపీ మోడల్‌ విద్యా విధానం దేశానికి ఆదర్శంగా నిలవడం లక్ష్యంగా పనిచేయాలని కోరారు. గత ప్రభుత్వంలో పాఠశాలల్లో మౌలిక సదుపాయాల పనులపై మంత్రులు అనుమానాలు వ్యక్తంచేశారని, వాటిపై ఆడిట్‌ నిర్వహించనున్నామని అన్నారు ఫౌండేషనల్‌ లిటరసీ, న్యూమరసీని మెరుగుపరిచేందుకు త్వరలో సమగ్ర విధానం (ఎఫ్‌ఎల్‌ఎన్‌- ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ) తీసుకొస్తామని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ తెలిపారు. విద్యార్థుల హాజరు, అకడమిక్‌ అంశాలను వాట్సాప్‌ ద్వారా తల్లిదండ్రులకు పంపుతామన్నారు. ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత శాతం చాలా తక్కువగా ఉందని, దీనిపై స్థానిక యంత్రాంగం దృష్టి పెట్టాలన్నారు. 2029 నాటికి రాష్ట్రంలోని 15 యూనివర్సిటీలు ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌లో టాప్‌-100 ఉండటం లక్ష్యంగా పనిచేయాలని నిర్దేశించారు.

  • అనర్హులను తొలగించాలి

  • బోగస్‌ పింఛన్లపై మూడునెలల్లో నివేదిక: చంద్రబాబు

రాష్ట్రంలో అనర్హులుకిచ్చిన పెన్షన్లు తొలగించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, సదరం సర్టిఫికెట్లను జారీ చేసేటప్పుడు మార్గదర్శకాలు సక్రమంగా పాటిస్తున్నారా? లేదా? పరిశీలించాలని సీఎం చంద్రబాబు.... కలెక్టర్లకు సూచించారు. బోగస్‌ పెన్షన్లు తొలగించేందుకు సాంకేతిక, హైబ్రిడ్‌ విధానాలను వినియోగించాలన్నారు. ఎక్కడైనా సదరం సర్టిఫికెట్ల జారీలో మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే సంబంధిత డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కడప జిల్లాల్లో ఇటీవల చేసిన సర్వేలో భారీసంఖ్యలో అనర్హులు బయటపడటంతో, వారి పెన్షనుల తొలగించామని కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ అన్నారు. ఎన్నికలకు ముందు 6లక్షల బోగస్‌ పెన్షన్లు గత ప్రభుత్వం మంజూరు చేసిన విషయం సెర్ప్‌ తనిఖీల్లో వెల్లడైందని మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. 3నెలల్లో పెన్షన్లపై సమగ్ర నివేదిక ఇవ్వాలని, తర్వాత తాను కూడా దానిపై విచారిస్తానని చంద్రబాబు తెలిపారు. 2027లో పుష్కరాలు జరగనున్నాయని, ఘాట్‌లను ఉపాధి నిధులతో చేపట్టేలా చర్యలు తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి కోరారు. దానిపై ప్రత్యేకంగా మరో సమావేశంలో చర్చిద్దామని చంద్రబాబు తెలిపారు.


నాగార్జునసాగర్‌ వద్ద విజయపురి కాలనీని పంచాయతీగా మార్చాలని, శ్రీశైలం వద్ద సున్నిపెంటను దేవదాయశాఖ నిధులతో అభివృద్ధి చేయాలని ఆ శాఖ మంత్రి రామనారాయణరెడ్డికి సీఎం సూచించారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖకు నిధులిచ్చినా పూర్తిస్థాయిలో ప్రగతి చూపించలేకపోతున్నారనీ, నిధులు లేక కొన్ని శాఖలు పనులు చేయలేకపోతే...నిధులిచ్చినా ఎందుకు వెనకబడి ఉన్నారని ఆ శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ను సీఎం ఆరా తీశారు. సిమెంట్‌రోడ్ల నిర్మాణంలో ఒక జిల్లాలో 54 శాతం పనులు చేసి, మరో జిల్లాలో 1.6శాతం పనులే ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. గ్రామాల్లో ముందుగా రోడ్లకు ఇరువైపులా జంగిల్‌ క్లియరెన్స్‌ చేపట్టాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు.

  • నైపుణ్య గణన ఇంకెప్పుడు పూర్తిచేస్తారు?

  • ఆ శాఖ పనితీరుపై సీఎం తీవ్ర అసహనం

నైపుణ్యాభివృద్ధి శాఖ పనితీరు, నైపుణ్య గణన పురోగతి తీరుపై చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. మొక్కుబడి రోజులు పోవాలని అధికారులకు స్పష్టంచేశారు. నైపుణ్యాభివృద్ధిపై ప్రజంటేషన్‌లోనే స్పష్టత లేదని, దీనిపై మరింత కసరత్తు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ల సదస్సులో నైపుణ్యాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. మంగళగిరిలో నైపుణ్య గణన పైలట్‌గా చేపట్టామని వివరిస్తున్నప్పుడు....సీఎం జోక్యం చేసుకుని మాట్లాడారు. ‘‘రాష్ట్రం మొత్తం 6నెలల్లో పూర్తికావాలి. కానీ, ఇంకా ఒక్క నియోజకర్గంలోనే ఉన్నారు. మొత్తం నైపుణ్య గణన ఎప్పుడు పూర్తిచేస్తారు? సమయాన్ని నిర్దేశించుకుని పనిచేయండి. రొటీన్‌గా పనిచేస్తే నైపుణ్యాభివృద్ధి జరగదు. నైపుణ్యాల కల్పనలో కేంద్ర పథకంపై ప్రచారం కూడా మొక్కుబడి ఉంది’’ అని అన్నారు. నైపుణ్య గణన వివరాల సేకరణలో ప్రజలపై ఒత్తిడి చేయకుండా ఐచ్ఛికంగానే చేపట్టాలనీ, మానవ వనరులు, నైపుణ్యాలను అనుసంధానం చేయాలన్నారు. విద్యారంగంలో ఆఫ్‌లైన్‌తోపాటు ఆన్‌లైన్‌ డిగ్రీలను కూడా గుర్తించాలన్నారు. కాగా, సీఎం అసంతృప్తి వ్యక్తం చేయడంతో ముఖ్య కార్యదర్శి తన ప్రజంటేషన్‌ ఆపేశారు.

Updated Date - Dec 13 , 2024 | 05:04 AM