Budda Venkanna: జీతాలు తీసుకుంటూ గొర్రెలు కాస్తున్నారా.. ఆ ఎమ్మెల్యేలపై బుద్దా ఫైర్..
ABN , Publish Date - Dec 15 , 2024 | 05:18 PM
అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేల విషయంలో టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వారు జీతాలు తీసుకుంటున్నారు కానీ, ప్రజల తరఫున మాట్లాడేందుకు మాత్రం రావడం లేదన్నారు. దీంతో పాటు జగన్ గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్యేలకు అసెంబ్లీ అంటే ఒక దేవాలయమని, కానీ వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీకి రాకుండా ప్రజలనే అవమానిస్తున్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న (Budda Venkanna) వ్యాఖ్యానించారు. వారు అసెంబ్లీకి రాకున్నా కూడా ఆ 11 మందికి జీతాల రూపంలో ప్రతినెలా లక్షా 75వేల రూపాయలు వారి ఎకౌంట్లోకి పడుతున్నాయని గుర్తు చేశారు. ఈ క్రమంలో ఇక నుంచి ఆ 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలను మేము గొర్రెలు లేదా మేకలుగా పరిగణిస్తామని ఎద్దేవా చేశారు. వైసీపీలో 11 మంది మేకలు ఉన్నాయని, ప్రజాధనాన్ని శుబ్బరంగా మేస్తున్నాయని చెప్పాల్సి వస్తుందని దుయ్యబట్టారు బుద్దా వెంకన్న.
వెంటనే రాజీనామా చేయాలి
అంతేకాదు వారిలో ఒక పెద్ద మేక ఉందని, ఎప్పుడు ఏం మాట్లాడతారో, ఏం చెబుతారో తెలియదని బుద్దా వెంకన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో సీఎంగా పని చేసిన జగన్‌కు ప్రజలు తగిన బుద్ది చెప్పడంతో, ఇప్పుడు బెంగుళూరు పారిపోయారని ఆరోపించారు. ఇలాంటి క్రమంలో అసెంబ్లీకి రాని మీకు ఎమ్మెల్యేలుగా కొనసాగే అర్హత లేదని, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గతంలో చంద్రబాబు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చారంటే, దానికి ఓ కారణం ఉండేదని ప్రస్తావించారు. ఆరోజు నిండు సభలో మీరు ఆయనను, ఆయన కుటుంబాన్ని అవమానించారు కాబట్టి బయటకు వచ్చారని పేర్కొన్నారు.
ప్రజల తరపున
కానీ ఆ క్రమంలో మిగతా సభ్యులు కూడా అసెంబ్లీకి వెళ్లి ప్రజల తరపున గళం విప్పారని బుద్దా వెంకన్న చెప్పారు. ఇప్పుడు మాత్రం జగన్‌కు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. 18 సీట్లు ఇస్తే ప్రతిపక్ష హోదా వచ్చేది. ఇదే విషయాన్ని గతంలో జగన్ కూడా చెప్పారని తెలిపారు. కానీ గెల్చిన 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి ప్రజల తరపున మాట్లాడాలని కోరారు. లేదంటే ఇప్పటి వరకు తీసుకున్న జీతాలు కూడా వెనక్కి ఇచ్చి, రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు.
ఆచూకీ చెబితే ప్రైజ్ ఇస్తాం
మంగమ్మ శపథం అంటూ ఆనాడు నోరు పారేసుకున్న కొడాలి నాని, ఇప్పుడు ఎక్కడ అంటూ ప్రశ్నించారు బుద్దా వెంకన్న. చంద్ర బాబుది చాణక్య శపథం కాబట్టే.. ప్రజలు కూడా అండగా నిలబడ్డారని ప్రస్తావించారు. అడ్రస్ లేకుండా పోయినా కొడాలి నాని, వల్లభనేని వంశీల ఆచూకీ తెలిపితే రూ. 1,116 బహుమానం ఇస్తామని ఎద్దేవా చేశారు. జగన్ విధానాలు, పోకడలు నచ్చక అనేక మంది వైసీపీని వీడి బయటకు వస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో త్వరలో వైసీపీ పూర్తిగా ఖాళీ అయిపోవడం ఖాయమని అభిప్రాయపడ్డారు. తన పని అయిపోయిందని భావించిన జగన్, బెంగళూరుకు పూర్తిగా మకాం మార్చాలని చూస్తున్నట్లు చెప్పుకొచ్చారు బుద్దా వెంకన్న.
ఈ వార్తలు కూడా చదవండి:
kakinada: వేదిక కూలి కింద పడ్డా ఎమ్మెల్యేలు..స్వల్ప గాయాలు
నేడు నాగపూర్‌కు సీఎం, డిప్యూటీ సీఎం
For AndhraPradesh News And Telugu News