V.Kota issue: వి.కోటలో హైటెక్షన్.. 144 సెక్షన్ విధింపు..
ABN, Publish Date - Sep 03 , 2024 | 01:44 PM
వెంకటగిరి కోట(వి.కోట) మండల కేంద్రంలో చిన్న గొడవ కాస్త చిలికి చిలికి గాలివానగా మారింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఈ మేరకు దుకాణాలు, విద్యాసంస్థలు సహా పలు కార్యాలయాలు మూసివేశారు.
చిత్తూరు: వెంకటగిరి కోట(వి.కోట) మండల కేంద్రంలో చిన్న గొడవ కాస్త చిలికి చిలికి గాలివానగా మారింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఈ మేరకు దుకాణాలు, విద్యాసంస్థలు సహా పలు కార్యాలయాలు మూసివేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు వి.కోటలోనే మకాం వేశారు. దీంతో అక్కడంతా టెన్షన్ వాతావరణం నెలకొంది.
పీస్ కమిటీలు..
సోమవారం రోజున క్రికెట్ బాల్ ఓ మహిళకు తగలడంతో తలెత్తిన వివాదం.. ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఓ వర్గం వారు మరో వర్గంపై కత్తులు, రాడ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు ఇరువర్గాల పెద్దలతో పీస్ కమిటీలను జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది. సమస్య సామరస్యంగా పరిష్కరించే దిశగా ఇరువర్గాల పీస్ కమిటీలతో అధికార యంత్రాంగం చర్చలు జరుపుతోంది. ఇరువర్గాల ప్రజలకు సర్దిచెప్పాలని, దీన్ని మరింత పెంచే ప్రయత్నం చేయవద్దని అధికారులు వారికి సూచించారు. పట్టణంలో పూర్వ పరిస్థితులు కల్పించాలని, అందరూ ప్రశాంతంగా ఉండేలా సర్దిచెప్పాలని పీస్ కమిటీ సభ్యులకు అధికారులు చెప్పారు.
నేతలు పరామర్శ..
వి.కోటలో పరస్పర దాడులు జరిగిన సంఘటనా ప్రాంతానికి పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, బీజీపీ రాష్ట్ర కార్యదర్శి గాలి భానుప్రకాశ్ రెడ్డి చేరుకున్నారు. గాయపడిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీలకు వినతిపత్రం అందించారు. ప్రజలందరూ సంయమనం పాటించాలని ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కోరారు. నిన్న జరిగిన ఘటన దురదృష్టకరమని, అన్నదమ్ముళ్లలాగా కలిసిమెలిసి ఉన్న చోట చిరు వివాదం ఇలా ఘర్షణకు దారి తీయడం బాధాకరమని ఆయన అన్నారు. గొడవల్లో దుకాణాలు నష్టపోయిన వారికి ప్రభుత్వం ద్వారా తగిన పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఘటనకు కారుకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
గొడవ ఏంటంటే..
వి.కోటలో సోమవారం రోజున యువకులు క్రికెట్ ఆడుతున్నారు. అయితే అటుగా వెళ్లున్న మహిళకు క్రికెట్ బాల్ తగిలింది. దీనిపై ఆమె ప్రశ్నించగా యువకులకు చెందిన ఓ వర్గం వారు మహిళ కుటుంబంపై దాడికి తెగబడ్డారు. భయంతో పరుగులు తీసి ఇంట్లోకి వెళ్లినా పదుల సంఖ్యలో వచ్చి దాడి చేశారు. కత్తులు, రాడ్డులతో దాడి చేసి వీరంగం సృష్టించారు. భారీ సంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్దకు ఇరువర్గాలు వారు చేరుకున్నారు. అయితే అదే సమయంలో దారి మధ్యలో మహిళ వర్గానికి చెందిన వారు భారీ చేరుకోవడంతో మళ్లీ దాడులు ప్రతి దాడులు జరిగాయి.
దీంతో ఆ ప్రాంతమంతా విధ్వంసం జరిగింది. పలు దుకాణాలు ధ్వంసమయ్యాయి. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. అదుపు చేసేందుకు పోలీసుల విశ్వ ప్రయత్నం చేసినా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదు. పైగా గొడవలు ఆపేందుకు వెళ్లిన డీఎస్పీ ప్రభాకర్ తలకు సైతం తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఎంత సర్దిచెప్పినా పరిస్థితి అదుపులోకి రాకపోడవంతో కలెక్టర్, ఎస్పీ సైతం అక్కడే మకాం వేశారు. ఈ నేపథ్యంలోనే వి.కోటలో 144సెక్షన్ విధించారు.
Updated Date - Sep 03 , 2024 | 01:44 PM