Share News

killed ఆరేళ్ల అస్పియాను చంపేశారు

ABN , Publish Date - Oct 03 , 2024 | 01:48 AM

ఆదివారం రాత్రి ఇంటి ముందు ఆడుకుంటూ కన్పించకుండా పోయిన చిన్నారి అస్పియా(6) బుధవారం నాటికి చెరువులో శవమై తేలి కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది.నాలుగురోజులుగా 11పోలీసు బృందాలు గాలిస్తున్నా చిన్న క్లూ కూడా లభించని పరిస్థితుల్లో అస్పియా శవమై కనిపించింది.

 killed ఆరేళ్ల అస్పియాను చంపేశారు
Aspia

ఆదివారం అదృశ్యమైన చిన్నారి

శవమై చెరువులో తేలింది

కారణాలను అన్వేషిస్తున్నాం: ఎస్పీ


పుంగనూరు, అక్టోబరు 2 : ఆదివారం రాత్రి ఇంటి ముందు ఆడుకుంటూ కన్పించకుండా పోయిన చిన్నారి అస్పియా(6) బుధవారం నాటికి చెరువులో శవమై తేలి కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. నాలుగురోజులుగా 11 పోలీసు బృందాలు గాలిస్తున్నా చిన్న క్లూ కూడా లభించని పరిస్థితుల్లో అస్పియా శవమై కన్పించడం అందరినీ దిగ్బ్రాంతికి గురి చేసింది. అస్పియాను చంపేసి సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంకులో పడేశారనే విషయం బుధవారం ఉదయం 11గంటలకు దావానలంలా వ్యాపించగా వందల సంఖ్యలో శవాన్ని చూసేందుకు చెరువు వద్దకు చేరుకున్నారు. శవాన్ని చూసి కంటతడి పెట్టారు. ఇందుకు కారకులైన వారిని గుర్తించి శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

aspia.jpg


పుంగనూరు ఉబేదుల్లా కాంపౌండ్‌లోని వడ్డీ వ్యాపారి ఎస్‌.అజ్ముతుల్లా, ఆసియా దంపతులకు కుమారుడు అశ్వక్‌ (13), కుమార్తె అస్పియా అంజుమ్‌(6) ఉన్నారు. ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఆస్పియా ఇంటి ఎదుట పిల్లలతో కలిసి ఆడుకుంటుండగా కొద్దిసేపు కరెంట్‌ పోయింది. అప్పట్నుంచీ అస్పియా కనిపించలేదు. చుట్టుపక్కల వీధుల్లో గాలించినా లాభం లేకపోవడంతో రాత్రి 10.30 గంటలకు సీఐ శ్రీనివాసులుకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఎస్పీ మణికంఠ దృష్టికి తీసుకుపోవడంతో ఆయన వెంటనే స్పందించారు. డీఎస్పీలు ప్రభాకర్‌, సాయినాథ్‌, ఇలియాస్‌బాషా, మహబూబ్‌బాషా, సీఐలు భాస్కర్‌, శ్రీనివాసులు, ఉమామహేశ్వరరావు, ప్రసాద్‌, పలువురు ఎస్‌ఐలు, నేరవిభాగంలో నిష్ణాతులైన కొంతమందిని 11 బృందాలుగా ఏర్పాటు చేసి గాలింపు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో పుంగనూరు ఎన్‌ఎస్‌పేటలోని బావాజాన్‌ కుమారుడు అయాజ్‌ (4) ఇంటి వద్ద ఆడుకుంటుండగా ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంలో వచ్చి చాక్లెట్‌ ఇస్తామని పిలవడం అతడి తల్లిదండ్రులు గమనించారు. మీరెవరంటూ ప్రశ్నించబోగా వారు పరారయ్యారు.వెంటనే తెలిసిన వారికి ఫోన్లు చేసి మోటారు సైకిళ్లలో వెంబడించారు.వారికోసం వెతుకుతూ సమీపంలోని సమ్మర్‌స్టోరేజీ ట్యాంకు వద్దకు వెళ్లగా నీటిలో తేలుతున్న శవం కన్పించింది. వెంటనే పోలీసులకు చెప్పడంతో బాలిక తండ్రి అజ్ముతుల్లాను అక్కడికి తీసుకొచ్చారు. శవాన్ని చూసి తన బిడ్దేనంటూ అజ్ముతుల్లా రోదించాడు. ఈ విషయం తెలిసి వందలమంది అక్కడికి చేరుకున్నారు.స్థానికులే చెరువులోకి దిగి మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చగా శవపరీక్ష కోసం పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి పోలీసులు తరలించారు. ఎస్పీ మణికంఠ ,జాయింట్‌ కలెక్టర్‌ విద్యాధరి ఆస్పత్రి వద్దకు చేరుకుని కుటుంబీకులు, ముస్లిం మత పెద్దలతో చర్చించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మధుసూదనాచారి నేతృత్వంలో ఏడుగురు వైద్యుల బృందం పోస్టుమార్టం చేసి శరీరంలోని కొన్ని అవయవాలను నిల్వ చేసి తిరుపతి ల్యాబ్‌కు పంపారు. మృతదేహంపై ఎలాంటి గాయాలులేవని వైద్యులు తెలిపారు.ఆస్పత్రి నుంచి అస్పియా మృతదేహాన్ని వందలాదిమంది సమీపంలోని ఖబరస్తాన్‌ వద్దకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.


పథకం ప్రకారమే చంపేశారా?

అస్పియా తండ్రి అజ్ముతుల్లా వడ్డీ వ్యాపారం చేస్తుండడం వల్ల వ్యాపార లావాదేవీల్లో గొడవలు, ఇతర కారణాలతో చిన్నారిని కిడ్నాప్‌ చేసి చంపేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడా కూడా సీసీ కెమెరాలకు చిక్కకుండా, ఆధారాలు దొరక్కుండా జాగ్రత్త పడ్డారంటే పథకం ప్రకారమే చంపేశారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పుంగనూరులో విచ్చలవిడిగా గంజాయి, సారా, కర్ణాటక మద్యం లభిస్తుండడంతో ఆ మత్తులో ఆకతాయిలు ఇలా చేశారా, లేక బిడ్డను కిడ్నాప్‌ చేసి తండ్రి నుంచి డబ్బులాగాలని అఘాయిత్యానికి పాల్పడ్డారా అనే అనుమానాలను మరికొందరు వ్యక్తపరుస్తున్నారు. ఈ విషయమై ఎస్పీ మణికంఠ మాట్లాడుతూ అస్పియా మృతిపై కారణాలను అన్వేషిస్తున్నామని తెలిపారు. మృతురాలి శరీరభాగాలను సేకరించి తిరుపతి ల్యాబ్‌కు పంపామని, అక్కడి నుంచి రిపోర్టు రావడానికి 2 వారాల సమయం పడుతుంది అని చెప్పారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం

Updated Date - Oct 03 , 2024 | 07:12 AM