Share News

నేటి నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు

ABN , Publish Date - Oct 26 , 2024 | 02:07 AM

తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదుకు శనివారం నుంచి శ్రీకారం చుడుతోంది.

నేటి నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు

తిరుపతి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి):తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదుకు శనివారం నుంచి శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో సభ్యత్వ నమోదుపై నాయకులకు శిక్షణ ఇచ్చిన సంగతి తెలిసిందే. గతంతో పోలిస్తే ఇటీవల ఎన్నికల్లో అద్భుత విజయంతో పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారు. దీంతో అంచనాలకు మించి సభ్యత్వ నమోదు విజయవంతమవుతుందని పార్టీ భావిస్తోంది. కూటమి అధికారంలో ఉన్నందున గుర్తింపు కోసం క్రియాశీలక కార్యకర్తలు, గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి నాయకులు పోటాపోటీగా సభ్యులను చేర్పించేందుకు కృషి చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక, పదవులు ఆశిస్తున్న వాళ్లూ చురుగ్గా పాల్గొనేందుకు ఆస్కారముంది. మరోవైపు జిల్లాలో తిరుపతి మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నందున సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పోటాపోటీగా, బల నిరూపణగా పరిగణించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే రాష్ట్ర పార్టీ కూడా జిల్లా, నియోజకవర్గాల వారీగా గతానికి మించి లక్ష్యాలను నిర్దేశించింది. అధికారంలో ఉన్నందున కూటమి ప్రభుత్వం హామీలను ఒకటొకటిగా నెరవేరుస్తున్న వైనం, అలాగే కొత్తగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న విధానం గురించి ప్రజల్లోకి తీసుకెళ్ళి సభ్యులుగా చేర్పించాలని జిల్లా టీడీపీ అధ్యక్షుడు నరసింహ యాదవ్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు.

జీవకోన గంగమ్మ ఆలయం వద్ద ప్రారంభం

తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి జీవకోన రాజీవ్‌ గాంధీ కాలనీలోని గంగమ్మ గుడి వద్ద శనివారం ఉదయం 10.30 గంటలకు టీడీపీ సభ్యత్వ నమోదును ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ప్రారంభించనున్నారు. సాధారణ సభ్యత్వం కాకుండా రూ.100 చెల్లించి తీసుకునే క్రియాశీలక సభ్యత్వానికి పార్టీ అదనపు ప్రయోజనాలు కల్పిస్తోంది. ఈ సభ్యత్వం తీసుకున్న వారికి రూ. 5 లక్షలు ప్రమాద బీమా వర్తిస్తుంది. సాధారణ మరణం సంభవిస్తే వారికి పార్టీ రూ. 10 వేలు చొప్పున చెల్లిస్తుంది.

Updated Date - Oct 26 , 2024 | 07:06 AM