ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జగన్‌ అదానీ లంచాల కహానీ

ABN, Publish Date - Nov 22 , 2024 | 03:54 AM

వివాదాస్పద వ్యాపారవేత్త.. గౌతమ్‌ అదానీ!దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన రాజకీయ వేత్తగా ముద్రపడిన వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి! వీరిద్దరి మధ్య ‘ముడుపుల బంధం’ బట్టబయలైంది.

  • అమెరికా బయటపెట్టిన అక్రమ బంధం

  • న్యూయార్క్‌ కోర్టులో కేసు, అభియోగాలు

వివాదాస్పద వ్యాపారవేత్త.. గౌతమ్‌ అదానీ!దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన రాజకీయ వేత్తగా ముద్రపడిన వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి! వీరిద్దరి మధ్య ‘ముడుపుల బంధం’ బట్టబయలైంది. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల కోసం అదానీ సంస్థ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.2,029 కోట్ల లంచాలను ఎరవేసింది. ఇందులో ఏకంగా రూ.1,750 కోట్లు ‘జగన్‌ యంత్రాంగానికే’ అందించింది. ఇది తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణ కాదు! మన దేశానికి చెందిన సీబీఐ, ఈడీలు తేల్చిన సంగతీ కాదు. అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ (ఎస్‌ఈసీ), ఆ దేశ దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ, న్యాయ శాఖ నిగ్గు తేల్చిన విషయాలు! దీనిపై ఈస్ట్‌ డిస్ట్రిక్ట్‌ న్యూయార్క్‌ కోర్టులో అభియోగాలు కూడా నమోదయ్యాయి. అదానీపై అమెరికాలో అరెస్టు వారెంటు జారీ అయ్యింది.

  • సౌర విద్యుత్‌ కొనుగోళ్లలో భారీ గోల్‌మాల్‌

  • రాష్ట్ర ప్రభుత్వాలకు అదానీ లంచాల ఎర

  • నాడు జగన్‌కే రూ.1,750 కోట్ల ముడుపులు

  • మిగతా రాష్ట్రాలన్నింటికీ కలిపి రూ.280 కోట్లు

  • జగన్‌తో భేటీ తర్వాతే కుదిరిన ఒప్పందాలు

  • న్యూయార్క్‌ కోర్టులో న్యాయ శాఖ చార్జిషీటు

  • గౌతమ్‌ అదానీ అరెస్టుకు కోర్టు వారెంట్‌ జారీ

  • జగన్‌తో భేటీ, ముడుపుల లెక్క తేలాకే ఒప్పందాలు

  • కుండబద్దలు కొట్టిన అమెరికా స్టాక్స్‌ సంస్థ

అమరావతి/న్యూఢిల్లీ, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): భారతదేశంలో రెండో అతిపెద్ద సంపన్నుడైన గౌతమ్‌ అదానీ భారీ సంక్షోభంలో ఇరుక్కున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థను అడ్డం పెట్టుకొని, రాష్ట్రాల్లోని విద్యుత్‌ సంస్థలకు సౌరశక్తిని అమ్మే కాంట్రాక్టులు దక్కించుకోవడం కోసం 2021-24 మధ్యకాలంలో జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం సహా ఐదు రాష్ట్ర ప్రభుత్వాల్లోని కీలక వ్యక్తులకు రూ.2,029 కోట్లు లంచంగా చెల్లించారని అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ సంచలన ప్రకటన చేసింది. అందులో రూ.1,750 కోట్లు అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలోని కీలకమైన వ్యక్తికి చెల్లించారని ప్రకటించింది.


  • అసలేం జరిగింది...

భారత సౌర విద్యుత్తు సంస్థ (సెకీ) రాష్ట్రాలకు సోలార్‌ పవర్‌ సరఫరా చేసేందుకు ఆహ్వానించిన టెండర్‌ను అప్పట్లో అదానీ గ్రూప్‌ దక్కించింది. దీని ప్రకారం... రాష్ట్రాల డిస్కమ్‌లు ‘సెకీ’తో ఒప్పందం చేసుకుంటే... అదానీ ప్లాంట్ల ద్వారా సౌర విద్యుత్తును సరఫరా చేస్తారు. అయితే... అదానీ కోట్‌ చేసిన ధరను చూసి డిస్కమ్‌లు బెంబేలెత్తాయి. ఒక్క ప్రభుత్వం కూడా సెకీతో ఒప్పందానికి ముందుకు రాలేదు. అవి కుదిరితే తప్ప ప్లాంట్లు ఏర్పాటు చేయలేరు. సొమ్ములు సంపాదించలేరు. ప్లాంట్ల ఏర్పాటు పేరుతో అప్పటికే భారీగా అప్పులు తెచ్చి, పెట్టుబడులు సమీకరించిన నేపథ్యంలో ‘అదానీ’పై ఒత్తిడి బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్‌ ‘లంచాల యాత్ర’ మొదలుపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వాల్లోని కీలక వ్యక్తులను కలిసి లంచాలు ఆఫర్‌ చేసినట్లు అమెరికా దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. ఇందులో... జగన్‌ జమానాలో జరిగిన సంఘటనల గురించి మరింత వివరంగా వెల్లడించాయి. ‘‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ను అదానీ పలుమార్లు స్వయంగా కలిశారు. 2021లో ఆగస్టు 7న జగన్‌తో అదానీ భేటీ అయ్యారు. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు కుదరకపోవడంపై చర్చించారు. లంచాలు ఆఫర్‌ చేశారు.

ఆ తర్వాత సెప్టెంబరు 12, నవంబరు 20 తేదీల్లోనూ వీరు సమావేశమయ్యారు’’ అని అమెరికా దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. జగన్‌తో అదానీ సమావేశాల తర్వాత ఒప్పందాలు ఖాయమైనట్లు అదానీ గ్రూప్‌ కంపెనీల్లో అంతర్గత సందేశాలు షేర్‌ చేసుకున్నారని అమెరికా స్టాక్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌(ఎ్‌సఈసీ) కూడా తన దర్యాప్తులో ధ్రువీకరించింది. ఎఫ్‌బీఐ నేరుగా జగన్‌ పేరు/చీఫ్‌ మినిస్టర్‌ అనే పదాలు వాడకుండా... ‘భారతీయ పౌరుడు’ అని తెలిపింది. ప్రభుత్వంలోని ఆ కీలక వ్యక్తి, అదానీ తరచూ ఫోన్లో మాట్లాడుకున్నట్లు తన దగ్గర ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. ఎస్‌ఈసీ మాత్రం ఏ మాత్రం మొహమాటానికి పోకుండా అదానీ కలిసింది ముఖ్యమంత్రినేనని, ఆ తర్వాతే కీలక నిర్ణయాలు ముందుకు వెళ్లినట్లు ఆధారాలు ఉన్నాయని పేర్కొంది.


అదానీ పునరుత్పాదక విద్యుత్‌ సంస్థలైన అదానీ గ్రీన్‌, అజ్యూర్‌ల మఽధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను ఉటంకించింది. దాంతో రూ.1750 కోట్ల లంచం జగన్‌కే ముట్టిందని చెప్పకనే చెప్పింది.

  • కేసులు వీరిపైనే...

ఎఫ్‌బీఐ దర్యాప్తు ఆధారంగా అదానీ, మరో ఏడుగురు సహచరులపై ఐదు రకాల నేరారోపణలు చేస్తూ అమెరికా న్యాయశాఖ ఇటీవల అమెరికా న్యాయశాఖ న్యూయార్క్‌ న్యాయస్థానంలో అభియోగాలు నమోదు చేసింది. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో సీల్డ్‌ కవర్‌లో ఉంచిన అభియోగాలను బుధవారం పోలింగ్‌ ముగిశాక బహిర్గతం చేసింది. లంచాలు ఇవ్వడం, స్టాక్‌ మార్కెట్లో మోసానికి పాల్పడటం అనేవి వాటిలో ప్రధాన అభియోగాలు. ఈ అభియోగాల మీద కోర్టు గౌతమ్‌ అదానీ, ఆయన తమ్ముడి కుమారుడు సాగర్‌ అదానీల మీద అరెస్టు వారెంటు కూడా జారీ చేసింది. మరో పక్క అమెరికా స్టాక్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌(ఎ్‌సఈసీ) కూడా గౌతమ్‌ అదానీ బృందం మీద దర్యాప్తు చేసి న్యూయార్క్‌లోని మరో కోర్టులో అభియోగాలు నమోదు చేసింది.

రెండు కేసుల్లోనూ అదానీ, ఆయన తమ్ముడి కుమారుడు, అదానీ గ్రీన్‌ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సాగర్‌ అదానీ, అదానీ గ్రీన్‌ మాజీ సీఈవో రంజిత్‌ గుప్తా, ప్రస్తుత సీఈవో వినీత్‌ ఎస్‌.జైన్‌, అజూర్‌ పవర్‌ ప్రధాన వాటాదారు(53ు) అయిన కెనడా పెన్షన్‌ ఫండ్‌ సీడీపీక్యూ అధికారి సిరిల్‌ క్యాబెన్స్‌, ఆ ఫండ్‌ భారతీయ ఉద్యోగులు సౌరభ్‌ అగర్వాల్‌, దీపక్‌ మల్హోత్రా, అజూర్‌ పవర్‌ మాజీ సీఈవో రూపేశ్‌ అగర్వాల్‌ మొత్తం ఎనిమిది మంది నిందితులుగా ఉన్నారు. వీరంతా విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. న్యాయశాఖది క్రిమినల్‌ కేసు కాగా, ఎస్‌ఈసీది సివిల్‌ కేసు. ఎస్‌ఈసీ కేసు నిరూపణ అయితే నిందితులను అమెరికా స్టాక్‌ మార్కెట్లలో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండా, అమెరికా కంపెనీల్లో ఎలాంటి పదవులు చేపట్టకుండా నిలువరించడమే కాకుండా భారీగా జరిమానా విధిస్తారు.


ముడుపులకు సంబంధించి, ఎవరికి ఎంత ఇచ్చారు, ప్రతిఫలంగా ఏం కాంట్రాక్టు పొందారు అనే ఆధారాలు సాగర్‌ అదానీ ఫోన్లో తమకు లభించాయని ఎఫ్‌బీఐ చెబుతోంది. ఆధారాలను ట్యాంపరింగ్‌ చేసే ప్రయత్నం చేయడం పైనా వీరిపై కేసులు నమోదయ్యాయి. అమెరికాతో వ్యాపార సంబంధం ఉన్న ఏ సంస్థ అయినా విదేశాల్లో అవినీతికి పాల్పడితే ఫారిన్‌ కరప్ట్‌ ప్రాక్టీసెస్‌ యాక్ట్‌ ప్రకారం అమెరికాలో అది నేరమే.

దీనికింద ఎఫ్‌బీఐ కేసు నమోదు చేసింది. 2021 సెప్టెంబరులో అదానీ గ్రీన్‌ ఎనర్జీ సంస్థ ప్రపంచవ్యాప్తంగా రూ.6,300 కోట్లు సమీకరించింది. అందులో, రూ.1500 కోట్లు అమెరికా నుంచి సమీకరించారు. భారతదేశంలో లంచాలు ఇచ్చి సంపాదించిన కాంట్రాక్టులను చూపిస్తూ అమెరికా గడ్డ నుంచి నిధులు సమీకరించారు కాబట్టి తాము దర్యాప్తు చేశామని ఎస్‌ఈసీ ప్రకటించింది. ఇవన్నీ ఆరోపణలు మాత్రమేనని అదానీ గ్రూప్‌ అంటోంది. వాటిని, ఎదుర్కొంటామని ప్రకటించింది. ఎఫ్‌బీఐ, ఎస్‌ఈసీ అభియోగాలు బయటకు రావడంతో కేసులు బయటకు రావడంతో స్టాక్‌ మార్కెట్లు కుప్ప కూలాయి. అదానీ కంపెనీల షేర్లు ఏకంగా 20 శాతం(2.24 లక్షల కోట్లు) నష్టపోయాయి. ఇతర షేర్ల మీద కూడా దీని ప్రభావం పడింది.

కేంద్ర ప్రభుత్వ సంస్థను అడ్డంగా పెట్టుకొని భారతదేశంలోని తన సౌరశక్తి ప్రాజెక్టుకు అమెరికా బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి వందల కోట్ల డాలర్లు సేకరించిన అదానీ, విద్యుత్‌ను అమ్ముకొనే కాంట్రాక్టులు సాధించుకొనే క్రమంలో లంచాలు చెల్లించిన విషయాన్ని దాచడాన్ని అమెరికా నేరంగా భావిస్తోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని పారదర్శకంగా జరిగినట్లు చూపించుకొనేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సెకీ)ని నామమాత్రంగా మధ్యలో ఉంచారని, రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు సెకీతో, సెకీ అదానీ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పైకి కనిపిస్తున్నా నిజానికి రాష్ట్రాల విద్యుత్‌ సంస్థలతో మాట్లాడి, లంచాలిచ్చి ఒప్పందాలను ఖరారు చేసింది అదానీయేనని ఎఫ్‌బీఐ గుర్తించింది.


గౌతమ్‌ అదానీ తమ్ముడి కుమారుడు సాగర్‌ అదానీ ఫోన్లో రాష్ట్రాల వారీగా లంచాలకు సంబంధించిన సమాచారం లభించినట్లు ఎస్‌ఈసీ అభియోగ పత్రంలో పేర్కొంది. సెకీని అవినీతికి అవకాశంగా వాడుకోవడం వల్ల భవిష్యత్తులో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాల మీద నీలినీడలు అలముకొనే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది.

  • ఐదు రాష్ట్రాలతో ఒప్పందాలు

అదానీ గ్రూప్‌ 2020-2024 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, తమిళనాడు, ఛత్తీ్‌సగఢ్‌, జమ్మూ కశ్మీరు రాష్ట్ర ప్రభుత్వాలతో సౌర విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలు సౌర విద్యుత్‌ను ప్రోత్సహించే ముసుగులో ముడుపులు తీసుకొని 20 ఏళ్ల వరకు అదానీ గ్రూప్‌ దగ్గరే విద్యుత్‌ కొనే విధంగా డిస్కమ్‌లతో ఒప్పందాలు చేయించాయన్నది అభియోగం. ఆంధ్రప్రదేశ్‌లో రూ.1,750 కోట్ల ముడుపులకు బదులుగా ఏడు గిగావాట్ల సౌర విద్యుత్‌ను 26 ఏళ్లపాటు కొనేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారన్నది అభియోగం. దాంతో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అత్యధిక సౌర విద్యుత్‌ కొంటున్న రాష్ట్రంగా మారింది. స్టాక్‌ మార్కెట్‌ లావాదేవీలను తారుమారు చేశారని హిండెన్‌ బర్గ్‌ నివేదికలో వెల్లడించిన తర్వాత అదానీపై ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం గమనార్హం.

  • రాజకీయ దుమారం

ఆరోపణలన్నీ నిరాధారమైనవని అదానీ గ్రూప్‌ ఖండించినప్పటికీ వివాదం చినికి చినికి గాలివానగా మారింది. అదానీని అరెస్టు చేయాలని కాంగ్రె్‌సతో సహా ప్రతిపక్షాలన్నీ డిమాండ్‌ చేయగా, సోమవారం నుంచి జరిగే పార్లమెంట్‌ సమావేశాలు స్తంభించిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోదీ-అదానీల మధ్య అవినీతి బంధం ఉందని ఎప్పటి నుంచో ఆరోపిస్తున్న కాంగ్రెస్‌ ముఖ్యనేత రాహుల్‌గాంధీ ఈ కుంభకోణంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) దర్యాప్తుకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు. వీళ్లిద్దరి బంధం దేశానికి తీరని నష్టం చేస్తోందని మండిపడ్డారు. మోదీ అదానీకి జవాబుదారీతనం లేకుండా చేశారని, దేశంలో ఏ దర్యాప్తు కూడా అదానీ విషయంలో నిజాలు బయటపెట్టే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు.


  • అక్రమాల దందా!

  1. అమెరికాలోని పెట్టుబడిదారుల నుంచి అదానీ గ్రీన్‌ సంస్థ 17.5 కోట్ల డాలర్లు సేకరించింది. ‘మేం అత్యంత పారదర్శక విధానాలు పాటిస్తాం. లంచాలు ఇవ్వడం, అవినీతిని ప్రోత్సహించడం వంటి చర్యలకు బహుదూరం’ అని హామీ ఇచ్చింది. కానీ... ఇందుకు భిన్నంగా భారత్‌లో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలకు వందలకోట్ల రూపాయల లంచాలు ఇచ్చి ఒప్పందాలు కుదుర్చుకుంది.

  2. 2016లో అదానీ గ్రీన్‌కు ఒకే ఒక్క విద్యుదుత్పత్తి ప్లాంటు... అదీ 20 మెగావాట్ల సామర్థ్యంతో ఉండేది. 2018నాటికి రెండువేల మెగావాట్ల సామర్థ్యానికి విస్తరించాలని అదానీ గ్రూప్‌ లక్ష్యంగా పెట్టుకుంది. 2020లో సెకీతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రపంచంలోనే అత్యంత భారీ సౌర విద్యుత్తు టెండరు తమకు దక్కిందని, 2025 నాటికి 25వేల మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని అదానీ గ్రీన్‌ సంస్థ 2020 జూన్‌ 9న ఒక ప్రకటన విడుదల చేసింది.

  3. సెకీ టెండరు దక్కినప్పటికీ... విద్యుత్‌ కొనుగోలుకు రాష్ట్రాల డిస్కమ్‌లు ముందుకు రాకపోవడంతో అదానీపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో... ‘ఇన్‌సెంటివ్స్‌’ (లంచాలు) ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలను ‘మోటివేట్‌’ చేయాలని 2020 చివర్లో అదానీ గ్రీన్‌ నిర్ణయించుకుంది. ఆ అవసరాన్ని, దానిని అమలు చేస్తున్న క్రమాన్ని అజూర్‌ పవర్‌ ప్రతినిధులకు సాగర్‌ అదానీ పలుమార్లు వివరించారు. లంచాలపంపిణీకి అంతర్గతంగా పలు రికార్డులునిర్వహించారు.

  4. లంచాలు పని చేయడం మొదలైంది కాబోలు! ‘అడ్డంకులన్నీ తొలగిపోయాయి’ అని 2021 మార్చిలో అదానీ గ్రీన్‌ ఒక ప్రకటన జారీ చేసింది.

    - అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ (సెక్‌)


  • ‘హయ్యర్‌ అఫిషియల్‌’ ఎవరు?

ఆంధ్రప్రదేశ్‌లో 2019 మే నుంచి 2024 జూన్‌ వరకు ఉన్నతస్థానంలో ఉన్న హయ్యర్‌ అఫిషియల్‌కు అదానీ ‘లంచం ప్రామిస్‌ చేశారు’ అని అమెరికా దర్యాప్తు సంస్థలు తెలిపాయి. ఇది... పూర్తిగా జగన్‌ జమానా! దీంతో... ఆ ‘హయ్యర్‌ అఫిషియల్‌’ ఎవరనే చర్చ మొదలైంది. ఆ ఐదేళ్లలో ముగ్గురు సీనియర్‌ అధికారులు విద్యుత్‌ శాఖ బాధ్యతలు నిర్వహించారు. పూర్తిగా ఐదేళ్లు ఎవరూ లేరు. అయితే.. ‘అఫిషియల్‌’ అంటే అధికారంలో ఉన్నవారు అనే అర్థమని, ఐఏఎస్‌ అధికారులు కారని చెబుతున్నారు. ఆ ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించింది జగనే! డిస్కమ్‌ల నిర్ణయాలను సీఎం ఎలా ప్రభావితం చేశారో కూడా అమెరికా దర్యాప్తు సంస్థలు వివరించాయి. పైగా... నివేదికలో పలు మార్లు ‘చీఫ్‌ మినిస్టర్‌’ అని నేరుగానే ప్రస్తావించాయి. దీంతో... ఆ హయ్యర్‌ అఫిషియల్‌ మరెవరో కాదు, నాటి ముఖ్యమంత్రి జగనే అని ముక్తాయిస్తున్నారు.

Updated Date - Nov 22 , 2024 | 04:01 AM