ABN Effect: ఏబీఎన్ ఎఫెక్ట్.. వారి సమస్య పరిష్కరించిన చంద్రబాబు సర్కార్..
ABN, Publish Date - Nov 03 , 2024 | 05:19 PM
కాకినాడలో రమ్య నర్సింగ్ ఆస్పత్రి, కాలేజీని వైసీపీ నేత పితాని అన్నవరం నడుపుతున్నారు. అయితే నర్సింగ్ రెండో సంవత్సరం విద్యార్థినిలు ఫీజులు చెల్లించలేదంటూ వసతి గృహంలోని 40 మంది విద్యార్థినిలకు యాజమాన్యం రెండ్రోజులుగా భోజనం పెట్టలేదు.
కాకినాడ: నగరంలోని రమ్య నర్సింగ్ కాలేజీ నిర్వాకంపై ప్రచురించిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. వైసీపీ నేత పితాని అన్నవరానికి చెందిన నర్సింగ్ కాలేజీ చేసిన దుర్మార్గపు పనిపై చంద్రబాబు సర్కార్ మండిపడింది. ఫీజులు చెల్లించలేదని విద్యార్థినిలకు రెండ్రోజులుగా భోజనం పెట్టకపోవడంపై ఆగ్రహించింది. వెంటనే కళాశాల వద్దకు చేరుకుని విద్యార్థినిలకు భోజనం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఈ మేరకు కాకినాడ ఆర్డీవో కళాశాల వద్దకు చేరుకుని వారికి ఆహారం అందించారు. ఫీజు రియింబర్స్‌మెంట్ వచ్చే వరకూ స్టూడెంట్స్‌ని ఇబ్బంది పెట్టవద్దని కళాశాల యాజమాన్యానికి అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
అసలేం జరిగిందంటే..
కాకినాడలో రమ్య నర్సింగ్ ఆస్పత్రి, కాలేజీని వైసీపీ నేత పితాని అన్నవరం నడుపుతున్నారు. అయితే నర్సింగ్ రెండో సంవత్సరం విద్యార్థినిలు ఫీజులు చెల్లించలేదంటూ వసతి గృహంలోని 40 మంది విద్యార్థినిలకు యాజమాన్యం రెండ్రోజులుగా భోజనం పెట్టలేదు. బయటకు వెళ్లి తిందామన్నా వారిని అనుమతించలేదు. ఈ విషయాన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకువచ్చింది. పితాని చేసిన నిర్వాకంపై వార్తను ప్రచురించింది. ఇది కాస్త ఏపీ ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. దీంతో చంద్రబాబు సర్కార్ స్పందించి తక్షణమే చర్యలు చేపట్టింది.
అయితే నర్సింగ్ విద్యార్థినిలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తిస్తున్నప్పటికీ కళాశాల యాజమాన్యం వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తోంది. ఫీజులు కట్టాలని వేధింపులకు గురి చేస్తోంది. దీంతో భయపడిన విద్యార్థినుల తల్లిదండ్రులు సగం ఫీజు చెల్లించారు. అయినా ఫీజులు పూర్తిగా చెల్లించలేదని భోజనం పెట్టడం ఆపేశారు. మిగితా నగదు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫీజులు చెల్లించకపోయినా, విషయాన్ని బయట వారికి చెప్పినా సర్టిఫికెట్లు ఇవ్వమని విద్యార్థినిలను బెదిరించారు. దీంతో 40 మంది విద్యార్థినిలు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. బయటకు వెళ్లి తిందామన్నా వారికి భయపడి హాస్టల్ లోపలే ఉండిపోయారు.
అయితే రమ్య నర్సింగ్ కాలేజీలో ఎటువంటి సదుపాయాలు లేవని, సరైన ఫ్యాకల్టీ లేదని విద్యార్థినిలు ఆరోపిస్తున్నారు. కళాశాలలో చేరేటప్పుడు హస్టల్, కాలేజీ రూమ్‌ల విషయంలో యాజమాన్యం చెప్పిన దానికి, వాస్తవానికి పొంతన లేదని అంటున్నారు. మెుదట నలుగురికి కలిపి ఒక్కో రూమ్ ఇస్తామని చెప్పారని, కానీ ఇప్పుడు 60 మందిని రెండు రూముల్లో ఉంచుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భోజనం విషయంలోనూ చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పుకొచ్చారు. కళాశాలలో జాయిన్ అయ్యేటప్పుడు ఫీజు రూ.18 వేలు అని చెప్పారని, తర్వాత రూ.90 వేలకు పెంచారని బోరున విలపించారు. నగదు చెల్లించిన తర్వాతే హాల్ టిక్కెట్లు ఇస్తామని యాజమాన్యం చెబుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థినిలకు భరోసా కల్పించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ వచ్చే వరకూ వారిని ఇబ్బందులు పెట్టవద్దని హెచ్చరించింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Anitha: అత్యాచార ఘటనలను ఆ నేతలు రాజకీయం కోసం వాడుకుంటున్నారు: హోంమంత్రి అనిత..
AP Politics: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మరో భారీ కుంభకోణం
Jaya Prakash Narayana: ఏ రాష్ట్రానికీ లేనన్ని అప్పులు ఏపీకి ఉన్నాయి: జయప్రకాశ్ నారాయణ..
Updated Date - Nov 03 , 2024 | 05:25 PM