ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: ఏపీ చరిత్రలో తొలిసారి పోలీసులపై సిట్ ఏర్పాటు

ABN, Publish Date - May 18 , 2024 | 04:59 AM

ఆంధ్రప్రదేశ్‌ పోలీసు చరిత్రలోనే కొత్త అధ్యాయం నమోదైంది. ఎన్నికల విధుల్లో వైఫల్యంపై విచారణకు రాష్ట్ర పోలీస్‌ శాఖ ఊహించని రీతిలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఏర్పాటైంది.

AP Police

ఈసీ ఆదేశంతో ఐజీ వినీత్‌

బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో టీమ్‌

ఏసీబీ ఎస్పీ రమాదేవి సహా 13మంది రంగంలోకి

పల్నాడు, తాడిపత్రి, తిరుపతి హింసపై దర్యాప్తు

కొమ్ముకాసిన అవినీతి అధికారుల వెన్నులో వణుకు

సిట్‌ నివేదిక తర్వాత వారిపై కఠిన చర్యలు

రాష్ట్ర చరిత్రలో కొత్త అధ్యాయం అంటున్న పోలీసులు

పోలింగ్‌, అనంతర హింసపై సిట్‌

పెద్ద నేరాలు, కుంభకోణాలు జరిగి నప్పుడు సాధారణంగా పోలీసులతో సిట్‌ ఏర్పాటుచేస్తారు. పోలీసులపైనే సిట్‌ను వేయడం రాష్ట్ర చరిత్రలోనే చాలా అరుదైన పరిస్థితి. ఈ పరిస్థితి రావడం పోలీస్‌ శాఖ స్వయంకృతమే. ఐదేళ్ల పాటు ఐపీసీని వదిలేసి వైసీపీ చట్టాన్ని అమలుచేసి రాష్ట్రంలో పోలీసింగ్‌ను భ్రష్టు పట్టించిన ఫలితాన్నే ఇప్పుడు డిపార్టు మెంటు అనుభ విస్తోందని ఐపీఎస్‌ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అధికార పార్టీకి కొమ్ముకాసిన కొందరు అధికారుల తీరుతో ఇప్పుడు తామూ మాటలు పడాల్సివస్తోందని వాపోతున్నాయి.

అమరావతి, మే 17(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ పోలీసు చరిత్రలోనే కొత్త అధ్యాయం నమోదైంది. ఎన్నికల విధుల్లో వైఫల్యంపై విచారణకు రాష్ట్ర పోలీస్‌ శాఖ ఊహించని రీతిలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఏర్పాటైంది. కేంద్ర ఎన్నికల సంఘం సిఫారసు మేరకు 13మంది పోలీసు అధికారుల బృందం దర్యాప్తునకు సిద్ధమైంది. నిఘా విభాగం ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ ఈ టీమ్‌కు నేతృత్వం వహిస్తారు. పల్నాడు, తాడిపత్రి, తిరుపతి ప్రాంతాల్లో పోలింగ్‌, అనంతర హింసను కట్టడి చేయడంలో పోలీసు అధికారుల వైఫల్యంపై బ్రిజ్‌లాల్‌ బృందం దృష్టి సారించనుంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో పల్నాడు, తిరుపతి, అనంతపురం ఎస్పీలు, కొందరు పోలీసు అధికారులు, పల్నాడు కలెక్టరుపై సీఈసీ వేటు వేసిన విషయం తెలిసిందే. వీరిలో కొందరిని బదిలీపై పంపితే, మరికొందరిని ఏకంగా సస్పెండ్‌ చేసింది. ఇదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ హరీశ్‌ గుప్తాలను ఢిల్లీకి పిలిపించుకుని సీరియస్‌ అయింది. పోలింగ్‌ విధుల్లో, డ్యూటీలో నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై వేటు పడాల్సిందేనని స్పష్టంచేసింది. హింసాత్మక ఘటనలపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని, కేంద్ర సాయుధ బలగాలతో ఆయా ప్రాంతాల్లో శాంతి భద్రతలు అదుపు చేయాలని ఆదేశించింది.


సిట్‌ను ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిజానికి, రాష్ట్రంలో గత ఐదేళ్లుగా ఐపీసీకి బదులు వైసీపీ చట్టమే అమలవుతూ వస్తోంది. ఏకపక్ష ఎన్నికలు ఎలా ఉంటాయో.. ప్రజాస్వామ్యం ఏ విధంగా అపహాస్యం పాలవుతుందో ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు ప్రత్యక్ష ఉదాహరణ. ఐపీసీ చట్టాన్ని పూర్తిగా పక్కన బెట్టి వైసీపీ మాన్యువల్‌ను అమలు చేస్తున్న పోలీసులు కొందరు ఎంతకూ మారక పోవడాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్‌ నిశితంగా గమనించింది. తిరుపతిలో ఓట్ల తారుమారు నుంచి పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన దొంగ ఓటర్లు ఉపఎన్నికలో ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారో తెలుసుకుంది. దీంతో ఏపీలో ఎన్నికలపై ఎక్కువ దృష్టి పెట్టిన సీఈసీ, ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఇచ్చే ఫిర్యాదులను పరిశీలించి ఏ చిన్న పొరపాటు ఉన్నట్లు బయటపడినా బాధ్యులైన అధికారులపై వేటు వేస్తోంది. చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల ఎస్పీలతోపాటు గుంటూరు రేంజ్‌ ఐజీ, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌, ఏకంగా రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిని కూడా వదల్లేదు. అయినా ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా ఈ నెల 13న పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో తీవ్రమైన హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో రాష్ట్ర పోలీసింగ్‌ తీరుపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహంతో ఉంది. దీంతో.. రానున్న కాలంలో ఇంకా ఎటువంటి చర్యలు ఉంటాయోనని అవినీతి పోలీసు అధికారుల వెన్నులో చలి మొదలైంది.

ఎక్కడ వైఫల్యం చెందారు?

రెండురోజుల్లో సీఈసీ ఇవ్వాలన్న ప్రాథమిక నివేదికను పోలీస్‌ శాఖ సిద్ధం చేసింది. ఇక.. 60 రోజుల్లో సిట్‌ ఇచ్చే నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుని, ఈసీకి సమగ్ర నివేదికను సమర్పించాల్సి ఉంది. పల్నాడులో దాడులు, ఈవీఎంల ధ్వంసం, పోలీసుల భద్రతా వైఫల్యం, ఇంటి దొంగల పాత్ర తదితర వ్యవహరాలను వెలికి తీయబోతోంది. తాడిపత్రిలో ప్రధాన పార్టీల అభ్యర్థుల కుటుంబాల మధ్య దశాబ్దాలుగా ఫ్యాక్షన్‌ గొడవలు ఉన్నా పోలింగ్‌ రోజు ఆ తర్వాత హింసను అదుపు చేయడంలో ఎస్పీ అమిత్‌ బర్దార్‌, డీఎస్పీ గంగయ్య ఇతర పోలీసులు వైఫల్యం చెందిన వైనాన్ని సిట్‌ కనిపెట్టబోతోంది. పారా మిలటరీ బలగాలు ఇచ్చినా రాళ్ల దాడులను ఎందుకు నిలువరించలేక పోయారనే గుట్టును రట్టు చేయబోతోంది. తిరుపతిలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నానీపై హత్యాయత్నం అక్కడ జరిగిన హింసపై పూర్తిస్థాయి నివేదిక సిట్‌ తయారుచేయనుంది.


హింసపై ఈసీకి సీఈవో నివేదిక

స్ట్రాంగ్‌ రూముల వద్ద మూడంచెల భద్రత: మీనా

రాష్ట్రంలో పోలింగ్‌ అనంతర హింసాత్మక ఘటనలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్‌ మీనా కార్యాలయం ప్రాథమిక విచారణ పూర్తి చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపింది. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూంలు, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేయనున్నట్లు మీనా తెలిపారు. ఇప్పటి వరకు కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మాత్రమే మూడంచెల భద్రత ఉండేదని, స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద రెండంచెల భద్రత ఉండేదని తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్ల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద సీసీ కెమెరాలు ఉంటాయని, సాయుధులతో నిరంతరం పహార ఉంటుందని వివరించారు.

ఏపీలో ఎస్పీలు లేరు ఉన్నవాళ్లలోనే ఎంపిక చేసుకోండి

ఈసీకి ఐదు పేర్లు పంపిన సీఎస్‌

’ఆంధ్రప్రదేశ్‌లో మీరు అడిగిన ఐపీఎస్‌ అధికారులు లేరు.. ఎస్పీ ర్యాంకులో ఐదుగురే అందుబాటులో ఉన్నారు.. ఆ మూడు జిల్లాలకు ముగ్గురి చొప్పున పేర్లు పంపలేక పోతున్నాం. వీరిలోనే ముగ్గురిని ఎంపిక చేసుకోండి’ అంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. రాష్ట్రంలో ఎన్నికల తర్వాత హింసను అరికట్టడంలో విఫలమైన మూడు జిల్లాల ఎస్పీలపై ఈసీ వేటేసిన సంగతి తెలిసిందే. అనంతపురం జిల్లాలో అమిత్‌ బర్దార్‌, తిరుపతి జిల్లా నుంచి కృష్ణకాంత్‌ పటేల్‌, పల్నాడు ఎస్పీ గరికపాటి బిందు మాధవ్‌ను గురువారం సాయంత్రమే ప్రభుత్వం పక్కన బెట్టాల్సి వచ్చింది. ఆయా జిల్లాల్లో ఆ ముగ్గురి స్థానంలో నియమించేందుకు ఒక్కో జిల్లాకు ముగ్గురి చొప్పున మొత్తం తొమ్మిది మంది ఎస్పీ ర్యాంకు ఐపీఎస్‌ అధికారుల పేర్లు ఈసీ అడిగింది. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం ఎలాంటి విచారణలు లేని, వివాదాస్పదం కాని, సమర్థవంతమైన అధికారులు ప్రస్తుతం ఏపీలో లేరు. దీంతో ఐదుగురు ఎస్పీ ర్యాంకు అధికారుల పేర్లు పంపుతూ సీఎస్‌ జవహార్‌ రెడ్డి ఎస్పీల కొరతను ఈసీకి తెలియజేశారు. మలికా గార్గ్‌, హర్షవర్ధన్‌ రాజు, కె. శ్రీనివాసరావు, నరసింహ కిశోర్‌, గౌతమి శాలి పేర్లను ఎన్నికల కమిషన్‌కు ప్రతిపాదించారు.


డిపార్టుమెంటు పరువు తీశారు..

ప్రజాస్వామ్య పరిరక్షణలో విఫలమయ్యారంటూ పోలీసులపైనే సిట్‌ను నియమించడం పోలీస్‌ శాఖను విస్లుపోయేలా చేసింది. ఇది డిపార్టుమెంటు ప్రతిష్ఠకు భంగకరమని ఆ శాఖ వర్గాలు వాపోతున్నాయి. పోస్టింగ్‌ల కోసమో, డబ్బుకోసమో ఏకపక్షంగా వ్యవహరిస్తే.. ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందని, దానివల్ల శాఖ పరువు పోవడంతోపాటు వ్యక్తిగతంగా బాఽధ్యులైన అధికారులు భవిష్యత్తు కోల్పోతారని చెబుతున్నాయి.

వినీత్‌ బ్రిజ్‌లాల్‌ టీమ్‌..

ఏసీబీ ఎస్పీ రమాదేవి, అడిషనల్‌ ఎస్పీ సౌమ్యలత, ఏసీబీ డీఎస్పీలు రమణమూర్తి(శ్రీకాకుళం), వల్లూరు శ్రీనివాసరావు(ఒంగోలు), రవి మనోహరాచారి(తిరుపతి), సీఐడీ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు భూషణం (గుంటూరు రేంజ్‌), వెంకట్రావు (ఇంటెలిజెన్స్‌, విశాఖ), రామక్రిష్ణ(ఏసీబీ), జీఎల్‌ శ్రీనివాస్‌ (ఏసీబీ), మోయిన్‌ (ఒంగోలు పీటీసీ), ప్రభాకర్‌ (ఏసీబీ, అనంతపురం), శివప్రసాద్‌ (ఏసీబీ)

ముగ్గురు ఎస్పీల వివరణ..

శాంతి భద్రతల నిర్వహణలో వైఫల్యం చెందారంటూ ఈసీ ఆగ్రహానికి గురైన ఎస్పీలు బిందుమాధవ్‌(పల్నాడు); అమిత్‌ బర్దార్‌(అనంతపురం), కృష్ణకాంత్‌ పటేల్‌(తిరుపతి).. డీజీపీకి తమ వివరణ ఇచ్చినట్లు తెలిసింది. పోలింగ్‌ సమర్ధవంతంగా నిర్వహించారని ఈసీ ప్రశంసలు అందుకున్న మరుసటి రోజే.. ఫెయిలయ్యారంటూ మాటలు పడటంపై డీజీపీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే తాము చేయాల్సినంత చేశామని ఎస్పీలు చెప్పబోగా శాంతిభద్రతల ఏడీజీ బాగ్చికి ఆ వివరణలు ఇవ్వమని సూచించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా అన్ని జిల్లాల ఎస్పీలతో డీజీపీ గుప్తా మంగళగిరి పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కేంద్ర బలగాలు 20కంపెనీలు వచ్చాయని, అవసరమైతే ఏపీఎస్పీ బలగాలు కూడా పంపుతామని చెప్పారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని, అధికార, ప్రతిపక్ష పార్టీల్లో అల్లర్లకు పాల్పడే వ్యక్తులపై నిఘా పెట్టాలని దిశా నిర్దేశం చేశారు. ఇకపై రాష్ట్రంలో చిన్న హింసాత్మక ఘటన కూడా జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు.

Updated Date - May 18 , 2024 | 07:15 AM

Advertising
Advertising