AP Elections: ఏపీ ఓటర్ల చూపు ఆ వైపేనా..?
ABN, Publish Date - May 09 , 2024 | 11:20 AM
2019లో పరిస్థితి వేరు.. ఇప్పుడు వేరు. ఆ సమయంలో ఒక్క ఛాన్స్ అని ప్రజలను జగన్ అడిగారు. సరేలే అని అవకాశం ఇచ్చి ఉంటారు. ఛాన్స్ ఇస్తే ఏం చేశాడో ఆ జనమే చూశారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజా వేదిక కూల్చి తన మనస్తత్వాన్ని బయట పెట్టుకున్నాడు. తర్వాత విపక్ష నేతలను టార్గెట్ చేశాడు. తొలినాళ్లలో కరెంట్ సమస్య ఎక్కువగా ఉండేది. రహదారుల సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికి రహదారుల మరమ్మతులు జరగలేదు. అందుకే ఈ సారి కూటమి వైపు జనాలు మొగ్గు చూపే అవకాశం ఉంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఓటర్ల నాడీ ఎలా ఉంది..? అధికార వైసీపీపై వ్యతిరేకతకు కారణం ఏంటీ.? చంద్రబాబుకు (Chandrababu) ఒక్కసారిగా సానుభూతి ఎందుకు పెరిగింది. ఈ సారి రాష్ట్రంలో కూటమి పగ్గాలు చేపట్టనుందా..? ఇప్పుడు ఇవే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్ది ప్రజల ఆలోచన విధానం మారుతోంది. తెలుగుదేశం పార్టీ వైపు సానుకూలంగా ఉన్నారని విశ్వసనీయ సమాచారం.
ఎందుకంటే..?
2019లో పరిస్థితి వేరు.. ఇప్పుడు వేరు. ఆ సమయంలో ఒక్క ఛాన్స్ అని ప్రజలను జగన్ (Jagan) అడిగారు. సరేలే అని అవకాశం ఇచ్చి ఉంటారు. ఛాన్స్ ఇస్తే ఏం చేశాడో ఆ జనమే చూశారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజా వేదిక కూల్చి తన మనస్తత్వాన్ని బయట పెట్టుకున్నాడు. తర్వాత విపక్ష నేతలను టార్గెట్ చేశాడు. తొలినాళ్లలో కరెంట్ సమస్య ఎక్కువగా ఉండేది. రహదారుల సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికి రహదారుల మరమ్మతులు జరగలేదు. దాంతో ప్రజల ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. మారుమూల ప్రాంతాల్లో కాదు.. పట్టణాలు (Town), నగరాల్లో కూడా ఆశించిన స్థాయిలో రహదారుల మరమ్మతులు చేయలేదు. ఈ అంశం వైసీపీ ప్రభుత్వానికి మైనస్ అవనుందని తలపండిన రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడ్డారు.
లేని రాజధాని
రాష్ట్రం విడిపోయి పదేళ్లు అవుతోంది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేదు. చంద్రబాబు అమరావతి రాజధాని నిర్మాణానికి అంకురార్పణ చేశారు. డెవలప్ జరిగే సమయంలో ప్రభుత్వం మారింది. అమరావతి రాజధాని నచ్చని జగన్ (Jagan) మూడు రాజధానుల పేరుతో డ్రామా చేసిన సంగతి తెలిసిందే. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ నిలిచింది. వైసీపీ కన్నా తెలుగుదేశం బెటర్ అని ఓటర్లలో అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోసారి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇస్తే రాజధాని నిర్మాణం పూర్తవుతుందని, చంద్రబాబు (Chandrababu) సంపద సృష్టిస్తారని క్షేత్రస్థాయిలో ప్రజల భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఆనలిస్టులు సైతం అంగీకరిస్తున్నారు.
నిరుద్యోగ సమస్య
గత ఐదేళ్ల నుంచి నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తోంది. వాలంటీర్లు తప్ప మిగతా కొలువుల నియామకం సరిగా లేదు. ఉద్యోగాల పేరుతో జగన్ (Jagan) తమను మోసం చేశాడని యువత భావిస్తోంది. గతంలో జగన్ (Jagan) వైపు ఉన్న యువకులు ఈ సారి చంద్రబాబు పక్షాన నిలబడే అవకాశం ఉంది. అలా జరిగితే ఓటు షేర్ భారీగా పెరిగి చంద్రబాబు (Chandrababu) నేతృత్వంలోని కూటమి జయకేతనం ఎగరవేయడం ఖాయమని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు.
ఇసుక దోపిడి
ఆంధ్రప్రదేశ్‌లో తీరప్రాంతం ఎక్కువగా ఉంది. వాగుల్లో సారవంతమైన ఇసుక మేటలు కడుతోంది. ఇసుక ఉన్నప్పటికి భవన నిర్మాణాల కోసం వాడేందుకు ఆంక్షలు విధించారు. భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కొందరు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. వైసీపీ నేతలకు (Ycp), ఆ పార్టీ అనుకూలంగా ఉండేవారికి ఇసుక రీచ్‌లు కేటాయించి అందినకాడికి దోచుకున్నారు. ఇసుక ధర ఆమాంతం పెంచెశారు. దీంతో ఇల్లు కట్టాలని అనుకునే మధ్య తరగతి వారు వెనకడుగు వేసే పరిస్థితి నెలకొంది.
కొన్ని చోట్ల లేని టాయిలెట్స్
ఇప్పటికి కొన్ని జిల్లాల్లో ఇంటింటికి మరుగుదొడ్లు లేవు. ఇది ప్రధాన సమస్యగా మారింది. మరుగుదొడ్లు నిర్మించేందుకు ప్రభుత్వం రాయితీలు ప్రకటించలేదు. శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో ఆముదాల వలస, ఎట్చర్ల నియోజకవర్గాల్లో ఇప్పటికి టాయిలెట్స్ లేవు. మారుమూల ప్రాంతాలు, ఇతర చోట్ల కూడా ఇంటింటికి మరుగుదొడ్డి లేదు.
కలిసొచ్చిన కూటమి అంశం
తెలుగుదేశం పార్టీతో (Tdp) జనసేన, బీజేపీ కలిసి వచ్చాయి. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ప్రజల్లో అసంతృప్తి ఉంది. కూటమి కలిసి రావడంతో ఈ సారి అవకాశం ఇవ్వాలని ఆలోచనలో ఉన్నారు. చంద్రబాబు (Chandrababu), లోకేశ్, పవన్ కల్యాణ్, నరేంద్ర మోదీ, అమిత్ షా క్షేత్రస్థాయిలో ప్రజలను కలిశారు. జగన్ సర్కార్ చేసిన అవినీతిని ప్రతి సభ, సమావేశం, ర్యాలీ, రోడ్ షోలో ఎండగట్టారు. మేమంతా ఒక్కటి అని సంకేతం ఇవ్వడంతో అభివృద్ధి జరుగుతుందనే ఆశ జనాల్లో ఉంది. కూటమి వల్ల తమకు మేలు జరుగుతుందని, తమ బతుకులు బాగు పడతాయనే భావన ప్రజల్లో నెలకొంది.
Read Latest AP News And Telugu News
Updated Date - May 09 , 2024 | 12:07 PM