Chandrababu: సీఎం ప్రమాణానికి ముందు.. చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - Jun 11 , 2024 | 12:24 PM
టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Nara Chandrababu) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం జరిగిన ఎన్డీఏ సమావేశంలో సీబీఎన్ మాట్లాడుతూ..
అమరావతి: టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Nara Chandrababu) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం జరిగిన ఎన్డీఏ సమావేశంలో సీబీఎన్ మాట్లాడుతూ.. తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఎందుకు వదిలిపెట్టకూడదనే దానిపై కూడా క్లారిటీ ఇచ్చారు కూడా. తప్పు చేసిన వారిని వదిలిపెడితే అదొక అలవాటుగా మారిపోతుందన్నారు. అందుకే చట్టపరంగా వారిని కచ్చితంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చంద్రబాబు అన్నారు. విధ్వంస, కక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని టీడీపీ శ్రేణులకు ఈ సభావేదికగా హెచ్చరించారు. అంతేకాదు.. పదవి వచ్చిందని విర్రవీగొద్దని వినయంగా మాత్రమే ఉండాలని ఈ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారు. కాగా.. ఎన్నికల్లో, ఫలితాల తర్వాత ఏపీలో జరుగుతున్న గొడవల నేపథ్యంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది.
ట్రాఫిక్ గురించి మరోసారి..!
‘ముఖ్యమంత్రిగా మళ్లీ గౌరవ సభలో అడుగుపెడతాననే శపధాన్ని ప్రజలు గౌరవించారు. ప్రజల గౌరవాన్ని నిలబెడుతూ మళ్లీ గౌరవ సభ నిర్వహిద్దాం. పోలవరం పూర్తితో పాటు నదుల అనుసంధానం చేస్తే ప్రతీ ఏకరాకు నీరివ్వొచ్చు. పోలవరం పూర్తి చేసే దిశగా ప్రతీ ఒక్కరం కృషి చేద్దాం. మాకు హోదా అనేది సేవ కోసమే. మేము కూడా సామాన్య మనుషులమే. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించొద్దు. ఐదు నిమిషాల ఆలస్యం అయినా పర్వాలేదు. సిగ్నల్ సిగ్నల్ మధ్య 1 నిమిషం ఉంటే చాలు. మళ్లీ చెబుతున్నా.. నా కాన్వాయ్ వెళ్లేటప్పుడు ట్రాఫిక్ అస్సలు ఆపొద్దు. ప్రజలు ఇబ్బంది పడే విధంగా రూల్స్ మార్చవద్దు’ అని చంద్రబాబు పోలీసులకు కీలక సూచనలు చేశారు.