Share News

Gummadi Sandhya Rani: ఎవరీ గుమ్మిడి సంధ్యారాణి.. కేబినెట్‌లో చోటు ఎలా దక్కింది..!?

ABN , Publish Date - Jun 13 , 2024 | 09:17 AM

అరకులోయ పార్లమెంట్‌ స్థానంలో సాలూరు నియోజకవర్గం నుంచి టీడీపీ (Telugu Desam) ఎమ్మెల్యేగా విజయం సాధించిన గుమ్మిడి సంధ్యారాణికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కడం పట్ల కూటమి శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు...

Gummadi Sandhya Rani: ఎవరీ గుమ్మిడి సంధ్యారాణి.. కేబినెట్‌లో చోటు ఎలా దక్కింది..!?
Gummadi Sandhya Rani

  • అరకు పార్లమెంట్‌ పరిధిలో సంధ్యారాణికి అవకాశం

  • సాలూరు ఎమ్మెల్యేను వరించిన మంత్రి పదవి

  • తొలిసారి ఎన్నికైనా కేబినెట్‌లో చోటు

  • ఏజెన్సీ వ్యాప్తంగా కూటమి నేతల హర్షాతిరేకాలు

విశాఖపట్నం/పాడేరు: అరకులోయ పార్లమెంట్‌ స్థానంలో సాలూరు నియోజకవర్గం నుంచి టీడీపీ (Telugu Desam) ఎమ్మెల్యేగా విజయం సాధించిన గుమ్మిడి సంధ్యారాణికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కడం పట్ల కూటమి శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అరకు పార్లమెంట్‌ స్థానం వైసీపీకి (YSRCP) కంచుకోటగా ఉండడంతో 2014, 2019 ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీ స్థానాన్ని ఆ పార్టీ కైవశం చేసుకుంది. తాజా ఎన్నికల్లో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఐదింటిని కూటమి అభ్యర్థులు కైవసం చేసుకోగా, వైసీపీ కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది.


Gummidi-Sudharani.jpg

పార్వతీపురం ఎస్సీ రిజర్వుడు కాగా రంపచోడవరం, పాడేరు, అరకులోయ, సాలూరు, కురుపాం, పాలకొండ స్థానాలు ఎస్టీ రిజర్వుడు. వాటిలో అరకులోయలో బీజేపీ అభ్యర్థి పాంగిరాజారావు, పాలకొండలో జనసేన అభ్యర్థి నిమ్మక జయకృష్ణ, రంపచోడవరంలో మిరియాల శిరీషాదేవి, పాడేరులో గిడ్డి ఈశ్వరి, కురుపాంలో తొయ్యాక జగదీశ్వరి, సాలూరులో గుమ్మిడి సంధ్యారాణి టీడీపీ అభ్యర్థులుగా బరిలోదిగారు. పాడేరు, అరకులోయ మినహా రంపచోడవరంలో టీడీపీ అభ్యర్థి మిరియాల శిరిషాదేవి, పాలకొండలో జనసేన అభ్యర్థి నిమ్మక జయకృష్ణ, కురుపాంలో టీడీపీ అభ్యర్థి తొయ్యాక జగదీశ్వరి, పార్వతీపురంలో టీడీపీ అభ్యర్థి బోనెల విజయకుమార్‌, సాలూరులో టీడీపీ అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి విజయం సాధించారు.

తొలిసారి గెలిచి మంత్రిగా..

ఎమ్మెల్యేగా మొదటిసారి విజయం సాధించిన గుమ్మిడి సంధ్యారాణికి మంత్రి వర్గంలో చోటు దక్కడం విశేషం. ఆమె 2009లో సాలూరు ఎమ్మెల్యేగా, 2014లో అరకులోయ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ ఆమె సేవలను గుర్తించిన చంద్రబాబునాయుడు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఈసారి సాలూరు ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆమె మంచి మెజారిటీతో విజయం సాధించారు. గిరిజన సామాజిక వర్గం నుంచి మంత్రి వర్గంలో సంధ్యారాణికి అవకాశం కల్పించారు. గతానికి భిన్నంగా అరకులోయ పార్లమెంట్‌ స్థానం పరిధిలో కూటమి ఎమ్మెల్యేకు మంత్రి వర్గంలో చోటు దక్కడంపై మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jun 13 , 2024 | 09:17 AM