Chandrababu: రాజధాని గురించి మాట్లాడుతూ.. విశాఖపై మనసులో మాట బయటపెట్టిన చంద్రబాబు
ABN , Publish Date - Jun 11 , 2024 | 01:23 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏ సమావేశం జరగ్గా శాసన సభ పక్షనేతతో పాటు సీఎం అభ్యర్థిని ఏకగ్రీవంగా టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యులు ఎన్నుకున్నారు. సమావేశంలో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు (Chandrababu Naidu) రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏ సమావేశం జరగ్గా శాసన సభ పక్షనేతతో పాటు సీఎం అభ్యర్థిని ఏకగ్రీవంగా టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యులు ఎన్నుకున్నారు. సమావేశంలో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ రాజధాని గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు వైజాగ్ అభివృద్ధిపై మనసులో మాటను బాబు బయటపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని మరోసారి స్పష్టం చేసిన బాబు.. ఆర్థిక రాజధానికి విశాఖపట్నంను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖ అభివృద్ధిని ఎట్టి పరిస్థితుల్లోనూ మరిచిపోమని స్పష్టం చేశారు. జగన్ చెప్పిన విశాఖ రాజధాని ప్రతిపాదనలు.. కర్నూలు న్యాయ రాజధాని అనే మోసాలను ప్రజలు గమనించారన్నారు. కర్నూలు అభివృద్ధికి కూటమి కట్టుబడి ఉందని చంద్రబాబు తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలుగా గెలిచిన సభ్యులకు పలు సలహాలు, సూచనలు చేశారు. ప్రజావేదికలా విధ్వంస రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మక రాజకీయాలు చేయాలని పిలుపునిచ్చారు.
ఆసక్తికర ఘటన!
కాగా.. ఎన్‌డీఏ శాసనసభ్యుల సమావేశంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. చంద్రబాబు ప్రసంగిస్తుండగా.. విశాఖ రుషికొండపై పేదవాడు కట్టుకున్న ప్యాలస్ గురించి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ప్రస్తావనకు తెచ్చారు. పేదవాడి ప్యాలస్‌ను సందర్శించేందుకు అవకాశం కల్పించాలని కూడా యరపతినేని అడిగారు. ‘అలాగేనమ్మా..’ అవన్నీ చేద్దామని చంద్రబాబు బదులిచ్చారు.
ఇక అవన్నీ ఏముండవ్!
‘సీఎం కూడా మామూలు మనిషే. సీఎం వస్తున్నాడు అంటే ఇక పరదాలు కట్టటం, దుకాణాలు బంద్ చేయటం, ట్రాఫిక్ నిలిపి వేయటం, చెట్లు నరకటం లాంటివి ఉండకూడదు. నా కాన్వాయ్ ఒక నిమిషం ఆలస్యమైనా పర్లేదు కానీ ట్రాఫిక్ నిబంధనలు పేరుతో ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు. ముఖ్యమంత్రిగా మళ్లీ గౌరవ సభలో అడుగుపెడతాననే శపథాన్ని ప్రజలు గౌరవించారు. ప్రజల గౌరవాన్ని నిలపెడుతూ మళ్లీ గౌరవ సభ నిర్వహిద్దాం. పోలవరం పూర్తితో పాటు నదుల అనుసంధానం చేస్తే ప్రతీ ఎకరాకు నీరివ్వొచ్చు. పోలవరం పూర్తి చేసే దిశగా ప్రతీ ఒక్కరం కృషి చేద్దాం’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.