Share News

AP New Cabinet: కొత్త తరానికి అందలం

ABN , Publish Date - Jun 13 , 2024 | 03:47 AM

పార్టీలోని కొత్త తరాన్ని అధికార అందలమెక్కించేలా చంద్రబాబు తన బృందాన్ని ఎంపిక చేసుకున్నారు. సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తూనే కొత్త తరానికి కేబినెట్‌లో అధిక స్థానాలు కేటాయించారు.

AP New Cabinet: కొత్త తరానికి అందలం

  • సీనియర్లకూ ప్రాధాన్యం

  • మొత్తంగా సామాజిక సమతౌల్యం!

  • 17 మందికి తొలిసారి కేబినెట్‌లో చోటు

  • భావి నాయకత్వం పెంపొందేలా అడుగులు

  • మంత్రి పదవుల్లో సగం బలహీనవర్గాలకే

  • ఇందులో 8 మంది బీసీ ఎమ్మెల్యేలు

  • అక్రమ కేసుల్లో జైళ్లకు వెళ్లినవారికి స్థానం

  • సమీకరణలతో కొందరు సీనియర్లకు నిరాశ

  • యనమల, అయ్యన్నలకు దక్కని పదవులు

(అమరావతి-ఆంధ్రజ్యోతి) : పార్టీలోని కొత్త తరాన్ని అధికార అందలమెక్కించేలా చంద్రబాబు (Chandrababu) తన బృందాన్ని ఎంపిక చేసుకున్నారు. సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తూనే కొత్త తరానికి కేబినెట్‌లో అధిక స్థానాలు కేటాయించారు. 17 మంది మొదటిసారి మంత్రి పదవులు అందుకోవడం విశేషం. గతంలో మంత్రులుగా పనిచేసినవారు కొత్త కేబినెట్‌లో ఏడుగురే. మంత్రుల్లో పది మంది తొలిసారి ఎన్నికైన వారు కావడం మరో విశేషం. వీరిలో పవన్‌ కల్యాణ్‌, వాసంశెట్టి సుభాష్‌, ఎం.రాంప్రసాద్‌రెడ్డి, టీజీ భరత్‌, సవిత, కొండపల్లి శ్రీనివాస్‌, సత్యకుమార్‌ చట్ట సభలకు మొదటిసారి ఎన్నికయ్యారు. లోకేశ్‌, కందుల దుర్గేశ్‌, గుమ్మిడి సంధ్యారాణి గతంలో ఎమ్మెల్సీలుగా పనిచేశారు. ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలోకి అడుగు పెట్టడం మాత్రం ఇదే ప్రథమం.

Chandrababu-And-Pawan.jpg

మరో 8 మంది మంత్రులు గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసినా అమాత్య పదవులు అందుకోవడం ఇదే మొదటిసారి. వీరిలో పయ్యావుల కేశవ్‌, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్‌, వంగలపూడి అనిత, డోలా బాల వీరాంజనేయ స్వామి, నాదెండ్ల మనోహర్‌, గొట్టిపాటి రవి కుమార్‌, బీసీ జనార్దన్‌రెడ్డి గతంలో ఎమ్మెల్యేలుగా చేశారు గానీ.. మంత్రులు కాలేదు. నాదెండ్ల మనోహర్‌ ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్‌గా పనిచేశారు. వీరంతా ఇప్పుడు చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రులయ్యారు. ఇక కేబినెట్‌లో చోటు దక్కించుకున్న ఆనం రామనారాయణరెడ్డి, ఎన్‌ఎండీ ఫరూక్‌, పొంగూరు నారాయణ, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి, లోకేశ్‌ గతంలోనూ మంత్రులుగా పనిచేశారు. ముఖ్యంగా ఆనం, కొలుసు గతంలో కాంగ్రెస్‌ మంత్రివర్గాల్లో ఉన్నారు.

AP-Ministers.jpg

నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీకి భావి నాయకత్వాన్ని పెంపొందించే ప్రయత్నంలో భాగంగా కొత్త తరానికి టీడీపీ అధినేత అధిక ప్రాధాన్యం ఇచ్చారని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రయత్నంలో కొందరు సీనియర్లు అవకాశం కోల్పోయారు. కేశవ్‌, గొట్టిపాటి రవికి చోటు దక్కడంతో అదే సామాజిక వర్గంలో సీనియర్‌ బుచ్చయ్య చౌదరికి చోటు దక్కలేదు. శెట్టిబలిజ సామాజిక వర్గం నుంచి యువ నేత సుభా్‌షకు చోటు దక్కడంతో సీనియర్‌ నేత పితాని సత్యనారాయణ అవకాశం కోల్పోయారు. యాదవ సామాజిక వర్గం నుంచి సుదీర్ఘ కాలంగా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడికి మంత్రివర్గంలో అవకాశం లభిస్తూ వస్తోంది. ఈసారి ఆ వర్గం నుంచి సత్య కుమార్‌, కొలుసు పార్థసారథికి చాన్సు రావడంతో యనమలకు చోటు దక్కలేదు. కొప్పుల వెలమ నుంచి కేంద్రంలో రామ్మోహన్‌నాయుడు, రాష్ట్రంలో అచ్చెన్నాయుడికి అవకాశం ఇవ్వడంతో అదే వర్గానికి చెందిన మాజీ మంత్రి, సీనియర్‌ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడికి చాన్సు రాలేదు.

Ministers-New.jpg


AP-Ministers-New.jpg

వేధింపులకు గురైన వారికి పదవులు

జగన్‌ ప్రభుత్వ హయాంలో వేధింపులకు గురై జైళ్లకు వెళ్లినవారు.. కేసుల్లో ఇరుక్కున్న బాధిత నేతలకు చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం లభించడం విశేషం. వీరిలో అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, బీసీ జనార్దనరెడ్డి అరెస్టయి జైళ్లకు కూడా వెళ్లారు. నారాయణపై అనేక కేసులు నమోదైనా ఆయన అరెస్టు కాలేదు. న్యాయస్థానాల్లో ఆయనకు ఉపశమనం లభించింది. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత కూడా కేసుల్లో ఇరుక్కుని వేధింపులకు గురయ్యారు. రాయచోటి ఎమ్మెల్యే రాంప్రసాద్‌రెడ్డిపైనా పలు కేసులు బనాయించారు. ఇలా ప్రభుత్వ వేధింపులకు గురైన వారిలో కొంత మందికి చంద్రబాబు తన మంత్రివర్గంలో చోటిచ్చారు.

బడుగులకు పెద్ద పీట

చంద్రబాబు తన మంత్రివర్గంలో బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. మొత్తం 24 మంది మంత్రుల్లో 8 మంది బీసీలే. అచ్చెన్నాయుడు (కొప్పుల వెలమ-టెక్కలి), కొండపల్లి శ్రీనివాస్‌ (తూర్పుకాపు-గజపతినగరం), అనగాని సత్యప్రసాద్‌ (గౌడ-రేపల్లె), కొలుసు పార్థసారథి (యాదవ-నూజివీడు), సత్యకుమార్‌ (యాదవ-ధర్మవరం-బీజేపీ), వాసంశెట్టి సుభాష్‌ (శెట్టిబలిజ-రామచంద్రాపురం), సవిత (కురబ-పెనుకొండ), కొల్లు రవీంద్ర (మత్స్యకార-మచిలీపట్నం)లకు అవకాశమిచ్చారు. ఎస్సీల నుంచి వంగలపూడి అనిత (మాదిగ-పాయకరావుపేట), డోలా బాలవీరాంజనేయస్వామి (మాల-కొండపి), ఎస్టీల నుంచి గుమ్మడి సంధ్యారాణి (సాలూరు), ముస్లింల నుంచి ఎన్‌ఎండీ ఫరూక్‌ (నంద్యాల)లకు చోటు దక్కింది. వీరితో కలిపి మొత్తం కేబినెట్‌లో సగం మంది బలహీన వర్గాలకు చెందినవారే ఉండడం విశేషం.

కమ్మ, కాపు 4-రెడ్డి-3

కమ్మ సామాజిక వర్గం నుంచి నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. వీరిలో లోకేశ్‌, పయ్యావుల కేశవ్‌, గొట్టిపాటి రవికుమార్‌ (టీడీపీ), నాదెండ్ల మనోహర్‌ (జనసేన) ఉన్నారు. కాపు సామాజిక వర్గం నుంచి నలుగురు.. నారాయణ, నిమ్మల రామానాయుడు (టీడీపీ), పవన్‌ కల్యాణ్‌, కందుల దుర్గేశ్‌ (జనసేన) ఉన్నారు. రెడ్డి సామాజికవర్గం నుంచి ముగ్గురు.. ఆనం రామనారాయణరెడ్డి (ఆత్మకూరు), బీసీ జనార్దనరెడ్డి (బనగానపల్లె), ఎం.రాంప్రసాద్‌రెడ్డి (రాయచోటి) ఉన్నారు. జగన్మోహన్‌రెడ్డి మంత్రివర్గంలో రెడ్డి సామాజిక వర్గం నుంచి ఐదుగురు, కమ్మ సామాజికవర్గం నుంచి అప్పుడు ఒకరే ఉండేవారు. ఆర్యవైశ్య సామాజిక వర్గం నుంచి కూడా రెండు ప్రభుత్వాల్లోనూ ఒకరు చొప్పునే ఉన్నారు.

మన మంత్రులు విద్యావంతులు!

రాష్ట్ర కొత్త మంత్రివర్గంలో ఎక్కువమంది ఉన్నత విద్యావంతులే ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా 11మంది మంత్రులు పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. నారా లోకేశ్‌, నాదెండ్ల మనోహర్‌, పొంగూరు నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్‌, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్‌, కందుల దుర్గేష్‌, టీజీ భరత్‌, కొండపల్లి శ్రీనివాస్‌ పీజీ చేశారు. డోలా బాల వీరాంజనేయస్వామి, మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి వైద్యవిద్యను, ఆనం రామనారాయణరెడ్డి, కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్‌ న్యాయ విద్యనభ్యసించారు. కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్‌ ఇంజనీరింగ్‌ చదివారు. కింజరాపు అచ్చెన్నాయుడు, ఎస్‌.సవిత, గుమ్మడి సంధ్యారాణి, అనగాని సత్యప్రసాద్‌ డిగ్రీ పూర్తిచేశారు. ఎన్‌ఎండీ ఫరూక్‌, కొణిదెల పవన్‌ కల్యాణ్‌ విద్యార్హత పదో తరగతి కాగా, బీసీ జనార్దనరెడ్డి 8వ తరగతి వరకు మాత్రమే చదివారు.

Updated Date - Jun 13 , 2024 | 08:21 AM